- ద.కొరియాలో లక్షా 20 వేల కెమెరాలు హ్యాక్
- దీంతో కోట్లల్లో సెక్సువల్ కంటెంట్ వ్యాపారం
- గైనకాలజిస్ట్ క్లినిక్‌ల్లోని కెమెరాలూ బజారుకే
- పరాకాష్టకు చేరుకున్న సైబర్ నేరాలు
- సింపుల్ పాస్‌వర్డ్స్: నిర్లక్ష్యమే నేరానికి మార్గం
సహనం వందే, దక్షిణ కొరియా:
దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్ క్లినిక్‌లు సైతం ఈ దారుణానికి బలయ్యాయి.

కోట్లలో సెక్సువల్ కంటెంట్ వ్యాపారం
పోలీసులు ఈ కేసులో ముగ్గురు హ్యాకర్లను అరెస్టు చేశారు. వీరు ఎవరికి వారు సొంతంగా ఈ నేరానికి పాల్పడ్డారు. అనుమానితుల్లో ఒకడు ఏకంగా 63,000 కెమెరాలను హ్యాక్ చేసి 545 లైంగిక వీడియోలను తయారు చేశాడు. వాటిని సుమారు రూ. 22 లక్షలకు అమ్ముకున్నాడు. మరొకడు 70,000 కెమెరాలు హ్యాక్ చేసి 648 వీడియోల ద్వారా దాదాపు రూ. 11 లక్షలు సంపాదించాడు. హ్యాకింగ్ ద్వారా దొరికిన వీడియోలను అక్రమంగా తీసుకుంటున్న ఒక వెబ్‌సైట్‌కు గత ఏడాది పోస్టు అయిన కంటెంట్‌లో 62 శాతం వీళ్లే అందించారని పోలీసులు గుర్తించారు.
సింపుల్ పాస్‌వర్డ్స్: నిర్లక్ష్యమే నేరానికి మార్గం
ఈ మొత్తం హ్యాకింగ్‌కు ప్రధాన కారణం సింపుల్ పాస్‌వర్డ్‌లు, సాంకేతిక లోపాలే. ఐపీ కెమెరాలకు సరైన భద్రత లేకపోవడం, పాస్‌వర్డ్‌లను తరచూ మార్చకపోవడం వల్ల హ్యాకర్లు సులభంగా లోపలికి చొరబడ్డారు. కాగా ఆ వీడియోలను కొని చూస్తున్న అనుమానిత వ్యక్తులను కూడా అరెస్టు చేశారు. అక్రమంగా చిత్రీకరించిన వీడియోలను చూడడం, దగ్గర ఉంచుకోవడం కూడా తీవ్రమైన నేరమే అని పోలీసులు హెచ్చరించారు. అధికారులు 58 ప్రాంతాల్లో బాధితులను గుర్తించి, వారికి సమాచారమిచ్చి వెంటనే పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని సూచించారు. హోమ్ కెమెరాలు అమర్చుకునేవారు జాగ్రత్తగా ఉండాలని… పాస్‌వర్డ్‌లను తరచూ మార్చుకోవాలని పోలీసులు దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. మీ ఇల్లే మీకు భద్రం… కానీ అది ఏ నిమిషంలో బయటి ప్రపంచానికి మార్కెట్ అవుతుందో తెలియని ప్రమాదంలో ఉన్నాం.