టార్గెట్ 2030… ఎయిడ్స్‌ ఎండ్ – ఐదేళ్లలో వ్యాధి పూర్తి నిర్మూలనే లక్ష్యం

World AIDs Day
  • ఇప్పటికే సగానికి సగం తగ్గిన కొత్త కేసులు

సహనం వందే, హైదరాబాద్:
భారతదేశం గత పదిహేనేళ్లలో హెచ్‌ఐవీ నియంత్రణలో విజయం సాధించింది. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు దేశ ఆరోగ్య రంగానికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయి. 2010 నుంచి 2024 మధ్య కొత్తగా నమోదవుతున్న హెచ్‌ఐవీ కేసుల్లో ఏకంగా 48.7 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే ఎయిడ్స్ కారణంగా చనిపోయే వారి సంఖ్య 81.4 శాతం క్షీణించడం మరో గొప్ప ఘనతగా చెప్పుకోవచ్చు. సరైన ప్రణాళికతో అసాధ్యమనుకున్న దాన్ని భారత్ సుసాధ్యం చేసిందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తల్లీబిడ్డలకు రక్షణ కవచం
హెచ్‌ఐవీ నియంత్రణలో అత్యంత ముఖ్యమైన అంశం గర్భిణుల నుండి పుట్టబోయే పిల్లలకు వ్యాధి సంక్రమించకుండా ఆపడం. ఈ విషయంలో దేశం 74.6 శాతం తగ్గుదల ఉండటం విశేషం. అంటే సరైన చికిత్స, పర్యవేక్షణ ద్వారా లక్షలాది మంది చిన్నారులను పుట్టుకతోనే వచ్చే వైరస్ బారి నుండి కాపాడగలిగారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమం లక్ష్యాలను చేరుకుంటూ ముందుకు సాగుతోందని మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు.

రెట్టింపైన పరీక్షలు… సత్వరమే చికిత్స
వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా చికిత్స అందించవచ్చనే సూత్రాన్ని ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. దీని ఫలితంగా హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షల సంఖ్య అమాంతం పెరిగింది. 2020-21లో 4.13 కోట్ల మందికి పరీక్షలు చేస్తే, ఐదేళ్లలోనే ఆ సంఖ్య 6.62 కోట్లకు చేరుకుంది. రోగం త్వరగా గుర్తించడం వల్ల చికిత్స మొదలుపెట్టడం సులువై వ్యాప్తి కూడా అదుపులోకి వచ్చిందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణ జీవితంలోకి రోగులు…
చికిత్స ఉచితంగా ఇవ్వడం వల్ల రోగులు సాధారణ జీవితం గడపగలుగుతున్నారు. యాంటీ రెట్రోవైరల్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2020-21లో 14.94 లక్షల మంది రోగులు మందులు తీసుకుంటే, ఇప్పుడు ఆ సంఖ్య 18.60 లక్షలకు చేరింది. ఈ మందులు శరీరంలో వైరస్‌ను అణచివేసి రోగిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు రోగుల్లో వైరస్ లోడ్ ఎంత ఉందో తెలిపే కీలక పరీక్షలు కూడా 8.90 లక్షల నుంచి 15.98 లక్షలకు పెంచారు. దీంతో చికిత్సలో మార్పులు చేయడం సులువవుతోంది.

2030 లక్ష్యమే ముందుంది…
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది, సమాజం అంతా కలిసి పనిచేయడం వల్లే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత లక్ష్యాలు పెట్టుకుని పనిచేయడం ద్వారా 2030 నాటికి దేశం నుండి హెచ్‌ఐవీని పూర్తిగా అంతమొందించడం సాధ్యమేనని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *