- 1918లో స్పానిష్ ఫ్లూ… 2019లో కరోనా
- ఈ ఏడాది 99% అసాధారణ వాతావరణమే
- వందేళ్ల రికార్డులు బ్రేక్ చేసిన ఎండావానలు
- అధిక వర్షాల కారణంగా 4,064 మంది మృతి
- 2 కోట్ల ఎకరాలకు పైగా పంటలకు తీవ్ర నష్టం
- క్లైమేట్ ఇండియా – 2025 నివేదిక వెల్లడి
సహనం వందే, హైదరాబాద్:
వైపరీత్యాలు ప్రతీ వందేళ్ళకోసారి పునరావృతం అవుతాయని అంటుంటారు.1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ప్రపంచంలో 50 కోట్ల మందిని ప్రభావితం చేసింది. కోట్ల మంది చనిపోయారు. దాదాపు అటువంటి వైరసే 2019లో వచ్చిన కరోనా. దీనివల్ల ఎన్ని కోట్ల మంది చనిపోయారో అందరికీ తెలుసు. అది సృష్టించిన మానవ విలయం ప్రతి కుటుంబానికి అనుభవంలోకి వచ్చిందే. అలాగే ఈ ఏడాది వాతావరణంలో వచ్చిన అసాధారణ పరిస్థితులు వందేళ్ళ రికార్డులను తిరగరాస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన క్లైమేట్ ఇండియా – 2025 నివేదిక అందుకు నిలువెత్తు నిదర్శనం.

దేశంలో వాతావరణ విపత్తులు
క్లైమేట్ ఇండియా – 2025 నివేదిక… దేశం ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని కళ్లకు కట్టింది. ఈ ఏడాది మొదటి 9 నెలల్లో దాదాపు 99 శాతం రోజుల్లో దేశంలో ఎక్కడో ఒకచోట తీవ్ర వాతావరణ సంఘటనలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది 366 రోజుల్లో 322 రోజులు, అంతకు ముందు 318 రోజులు ఇలాంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులే ఏర్పడ్డాయి. క్లౌడ్ బరస్ట్ లాంటి ఘటనలు గతంలో ఎన్నడూ లేని ప్రాంతాలైన చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లో కూడా కనిపిస్తుండగా… ఈశాన్య భారతంలో తీవ్ర కరవు నెలకొంటుంది.
వందేళ్ళ తర్వాత వైపరీత్యాలు…
2025 సంవత్సరంలో అనేక వాతావరణ రికార్డులు బద్దలయ్యాయి. 1901 తర్వాత ఈ ఏడాది జనవరి ఐదో అత్యంత పొడి వాతావరణం నెలకొన్న నెలగా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఏకంగా 124 ఏళ్లలోకెల్లా అత్యంత వేడి నెలగా చరిత్రకెక్కింది. ఇక సెప్టెంబర్ నెల అత్యధిక సగటు ఉష్ణోగ్రతలలో ఒకటిగా ఉంది. ఇదంతా సహజం కానే కాదని… మనిషి తప్పిదాల వల్లే అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నా పట్టించుకునేవారు లేరు.
విపత్తులతో మరణ మృదంగం
వాతావరణ విపత్తుల కారణంగా జరిగిన నష్టం అపారం. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 4,064 మంది ప్రాణాలు కోల్పోయారు. 2.34 కోట్ల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు లక్ష ఇళ్లు ధ్వంసం అయ్యాయి. 58,982 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ మరణాలలో అత్యధికంగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్లనే 2,440 మంది చనిపోయారు. ఆ తర్వాత పిడుగులు, తుఫానుల వల్ల 1,456 మంది, క్లౌడ్‌బరస్ట్ వల్ల 135 మంది మరణించారు. అత్యధిక ప్రాణనష్టం జరిగిన రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ (532), ఆంధ్రప్రదేశ్ (484), జార్ఖండ్ (478) ఉన్నాయి. విపత్తు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అర్థమవుతోంది.
కళ్లు తెరవాల్సిందే…
మనం చేస్తున్న అభివృద్ధి వాతావరణాన్ని నాశనం చేసే విధంగా ఉంటే అప్పుడు ఈ విపత్తులకు వాతావరణ మార్పును మాత్రమే నిందించడం సరికాదని సీఎస్ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ అంటున్నారు. అభివృద్ధిని పునర్నిర్వచించుకోవాలని హెచ్చరిస్తున్నారు.