- చర్యల కోసం సీఎంలకు న్యాయవాది లేఖ
సహనం వందే, పల్నాడు:
సినీ నటులను హీరోలు అని పిలవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పదాన్ని వాడకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది, సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. హీరో అనే పదం డ్రగ్స్ కంటే ప్రమాదకరమైందని, బాల్యం నుంచే యువత భవిష్యత్తును ఇది నాశనం చేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు లేదా అన్నం పెట్టే రైతుల కంటే, తల్లిదండ్రుల కంటే కూడా సినీ నటులనే గొప్పవాళ్లుగా భావించే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వీరిని లీడ్ యాక్టర్ లేదా లీడ్ యాక్ట్రెస్ అని మాత్రమే పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక నటులు 200 నుంచి 300 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడంతో సినిమా టికెట్ ధరలు అమాంతం పెరిగాయని, థియేటర్ క్యాంటీన్లలో 5, 10 రూపాయల మొక్కజొన్న పేలాలకు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి క్యాంటీన్ వస్తువులను ఎంఆర్‌పీ ధరలకే అమ్మేలా ఆదేశించాలని ఆయన కోరారు.