- నైజీరియన్ డ్రగ్స్ మాఫియా గుట్టురట్టు!
- తెలంగాణ ఐపీఎస్ సందీప్ శాండిల్య సాహసం
సహనం వందే, హైదరాబాద్:
దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్త వ్యక్తులను సులభంగా అనుమానించే నైజీరియన్ల కంట పడకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో చెత్త ఏరుకునే వ్యక్తితో స్నేహం పెంచుకున్నారు. అద్దె గది కోసం వచ్చిన వ్యక్తిగా నమ్మబలికి వారం రోజులు స్థానికుడిలా కలిసిపోయి డ్రగ్స్ కింగ్‌పిన్ బద్రుద్దీన్ ఉన్న ప్రదేశాన్ని పక్కాగా గుర్తించారు.
ఒకేసారి 300 మంది దాడి…
కీలక సమాచారాన్ని ఈగల్ డైరెక్టర్ నేరుగా ఢిల్లీ డిజీపీ, క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అందించడంతో భారీ దాడులకు రంగం సిద్ధమైంది. వెంటనే ఈగల్ బృందంలోని 124 మంది అధికారులు, ఢిల్లీకి చెందిన 300 మంది పోలీసులు ఒకేసారి 20 ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సమన్వయ దాడుల్లో 50 మందికి పైగా నైజీరియన్లు అరెస్టు అయ్యారు. వారి వద్ద నుంచి దాదాపు రూ. 3.5 కోట్ల విలువ చేసే 5,340 ఎక్స్‌టసీ గుళికలు, కొకైన్, హెరాయిన్, మేథ్ వంటి మత్తు పదార్థాలను పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు.
మనీ లాండరింగ్ దందా…
ఈ నెట్‌వర్క్‌కు మద్దతుగా 502 మంది నైజీరియన్లు కలిసి పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా దేశవ్యాప్తంగా 2,078 మందికి పైగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్న ముఖ్య ఆధారాల ద్వారా డ్రగ్స్ పంపిణీకి ఉపయోగించిన 59 మ్యూల్ ఖాతాలను గుర్తించి వాటికి అనుసంధానమైన 107 బ్యాంక్ ఖాతాలను వెంటనే స్తంభింపజేశారు. అరెస్టు అయిన కింగ్‌పిన్ బద్రుద్దీన్ మ్యూల్ ఖాతాల ద్వారా ఏకంగా 15 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. ఫ్లిప్‌కార్ట్ వంటి కొరియర్ కంపెనీల ప్యాకేజీలలో మత్తుమందులను దాచిపెట్టి పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.