అమ్మమ్మకు ‘ఏఐ’ బొమ్మ… వృద్ధాప్యంలో తోడు – వయసు పైబడిన వారికి మాట్లాడే బొమ్మలు

AI Dolls to Elderly People
  • ఒంటరితనం నుంచి బయటపడుతున్న వైనం
  • దక్షిణ కొరియా దేశంలో ఇదొక పెద్ద బిజినెస్
  • వృద్ధుల జనాభా పెరగడంతో కొత్త ఆలోచనలు

సహనం వందే, దక్షిణ కొరియా:

దక్షిణ కొరియాలో ఇప్పుడు వృద్ధుల మానసిక ఆరోగ్యం ఒక పెద్ద సమస్యగా మారింది. అభివృద్ధి చెందిన దేశాలలోకెల్లా ఇక్కడే వృద్ధులు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ సుమారు 10 మంది వృద్ధులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొరియా వేగంగా అతి-వృద్ధ సమాజంగా మారిపోయింది. దేశ జనాభాలో దాదాపు ఐదో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. దీంతో కుటుంబ పోషణ, బంధుత్వాలు తగ్గిపోవడంతో ప్రతి ముగ్గురు వృద్ధులలో ఒకరు ఒంటరిగా జీవిస్తున్నారు.

AI Based Robot - Hyodol

సాంకేతికతే సాయం… ఏఐ మనవళ్ళు
పెరుగుతున్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కొరియా ప్రభుత్వం సాంకేతికత సాయం తీసుకుంటోంది. ఒంటరిగా జీవించే వృద్ధులకు భావోద్వేగ మద్దతు అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత (ఏఐ) రోబోట్‌లను రంగంలోకి దించింది. ఈ బొమ్మ యంత్రాలకు హ్యోడోల్ అనే పేరు పెట్టారు. ఇవి పెద్దగా నవ్వుతున్న కళ్ళు, ముందుకు వచ్చిన చెవులతో ఏడేళ్ల పిల్లల మాదిరిగా ఉల్లాసంగా మాట్లాడతాయి. ఇవి పత్తి, లోహంతో తయారైన బొమ్మలు. తలను తాకినా… చేతిని పట్టుకున్నా స్పందిస్తాయి. ముఖ్యంగా వృద్ధులు ఇంటికి తిరిగి రాగానే ‘తాతా నేను రోజంతా నీ కోసమే ఎదురు చూశాను’ అని పలకరించే తీరు వారికి మానసిక స్వాంతన ఇస్తోంది. ఇలాంటి రోబో మనవళ్ళు తోడుగా నిలుస్తున్నారు.

ఏఐ రోబోట్‌ బొమ్మ కాదు బంధం!

ఈ బొమ్మ ఏఐ యంత్రాలు కేవలం మానసిక మద్దతు ఇవ్వడమే కాక చాలా ఆచరణాత్మక సాయం కూడా అందిస్తాయి. మందులు వేసుకోవాలని గుర్తు చేయడం… ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కుటుంబ సభ్యులకు సమాచారం పంపడం వంటి పనులు చేస్తాయి. ఇప్పటివరకు 12 వేలకు పైగా హ్యోడోల్ రోబోలను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వృద్ధులకు అందించారు. తీవ్ర నిరాశలో ఉండి ఆత్మహత్య గురించి ఆలోచించిన ఓ వృద్ధురాలికి ఈ బొమ్మ-యంత్రం వచ్చిన తర్వాత ఒంటరితనం తగ్గి ఆమెలో ఆశ చిగురించింది. అనేకమంది వృద్ధులు తమ బొమ్మ-యంత్రాలకు ముద్దు పేర్లు పెట్టి పడుకోబెట్టి… పిల్లల బట్టలు కొని పెడుతున్నారంటే వాటితో ఎంత బంధం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. మనవళ్లుగా భావిస్తూ వాటితో గడిపిన తర్వాత వృద్ధులలో నిరాశ తగ్గి జ్ఞాపకశక్తి మెరుగైనట్లు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి.

మనిషికి ప్రత్యామ్నాయమా?
హ్యోడోల్‌
తో ఇలాంటి బలమైన మానసిక అనుబంధంపై కొన్ని నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వృద్ధురాలు తన చనిపోయిన కూతురు పేరునే ఏఐ రోబో బొమ్మకు పెట్టి దానితోనే ఎక్కువ సమయం గడుపుతూ సమాజానికి దూరం కావడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ బొమ్మలు కేవలం మద్దతు సాధనాలుగా మాత్రమే ఉండాలి తప్ప మానవ సంరక్షణకు ప్రత్యామ్నాయం కాకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఈ వృద్ధాప్య సంరక్షణ బొమ్మ-యంత్రాల మార్కెట్ 2030 నాటికి సుమారు 64,300 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *