మెడికల్ కాలేజీలపై ఈడీ దెబ్బ- దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో దాడులు

ED Rides on Medical Colleges
  • కాలేజీల అనుమతుల విషయంపై సోదాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ఆరు చోట్ల తనిఖీలు
  • అక్రమంగా అనుమతి పొందిన అనేక కాలేజీలు

సహనం వందే, న్యూఢిల్లీ:

దేశంలో మెడికల్ కాలేజీలపై ఈడీ కొరడా ఝులిపిస్తుంది. మెడికల్ కాలేజీల అనుమతులు, సీట్ల సంఖ్య పెంపు కోసం ఎన్‌ఎంసీలోని కొందరు ఉన్నతస్థాయి అధికారులు కోట్లకు కోట్లు లంచం తీసుకున్నారన్న అనుమానంతో గురువారం ఈడీ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద వైద్య విద్యా సామ్రాజ్యాలు ఈ దాడుల్లో చిక్కాయి.

తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్‌మనీ ప్రవాహం…
లంచాల కుంభకోణంలో తెలుగు రాష్ట్రాలదే కీలక పాత్ర. తెలంగాణలో మూడు… ఆంధ్రప్రదేశ్‌లో మూడు చోట్ల ఈడీ దాడులు జరిగాయి. హైదరాబాద్‌లోని రెండు ప్రముఖ కార్పొరేట్ వైద్య కాలేజీల ఛైర్మన్ల ఇళ్లు, విజయవాడ, గుంటూరు పరిధిలోని కొత్త మెడికల్ కాలేజీల ఆఫీసుల్లో తనిఖీలు జరిగాయి. గత మూడేళ్లలోనే అనుమతులు తెచ్చుకున్న ఈ కాలేజీలు ఒక్కో సీటుకు కోట్ల రూపాయల వరకు డొనేషన్ తీసుకున్నట్లు ఈడీకి సమాచారం అందింది. ఈ లంచాల డబ్బు ఢిల్లీలోని పెద్ద అధికారుల ఇళ్లలో, హవాలా మార్గాల్లో పడుతోందని ఈడీ విచారణలో తేలింది. విద్యకు సేవకు బదులు దారుణమైన దోపిడీకి అడ్డాలుగా మారిన కార్పొరేట్ కాలేజీల కక్కుర్తికి ఇది నిదర్శనం.

మెడికల్ కాలేజీల అనుమతుల కోసం గడ్డి.‌..

దేశంలో అనేక ప్రైవేట్ కాలేజీల అనుమతుల కోసం ఎన్ఎంసీ అధికారులే గడ్డి తిన్నట్లు గతంలోనే విమర్శలు వచ్చాయి. మౌలిక సదుపాయాలు… బోధన వైద్యులు లేకపోయినప్పటికీ అనేక కాలేజీల సీట్లకు అనుమతులు ఇచ్చినట్లు తేలింది. ఈ సందర్భంగా ఎన్ఎంసీకి చెందిన బృందాలలోని కొందరు డాక్టర్లు కూడా రెడ్ హ్యాండెడ్ గా సీబీఐకి దొరికిపోయారు. దీంతో 3 నెలల క్రితం కొన్ని మెడికల్ కాలేజీల అనుమతులను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా అనేకచోట్ల అక్రమంగా అనుమతులు తెచ్చుకున్న ప్రైవేటు కాలేజీల వ్యవహారం వెలుగు చూసింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పటికీ కొందరు అధికారులు తీరు మాత్రం మారలేదు. ఈ విషయంలో అప్పటి ఎంఎంసీ చైర్మన్ పై కూడా వేటు పడిన సంగతి తెలిసిందే. తెలంగాణలో వరంగల్ కు చెందిన ఒక కాలేజీకి అనుమతులు రద్దు చేశారు. ఆ తర్వాత ఎలాగోలా మళ్లీ అనుమతులు తెచ్చుకున్నారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న ‘మహా’ గొప్ప మెడికల్ కాలేజీకి ఏమాత్రం వసతులు లేకపోయినా అదనపు సీట్లు కూడా మంజూరు చేయడం అక్రమాలకు పరాకాష్ట.

రాజకీయ నేతల అండదండలు…
ఈ కుంభకోణం వెనుక కొందరు రాజకీయ నేతలు, మంత్రుల బంధువుల పేర్లు కూడా బయటపడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు బలంగా చెప్తున్నాయి. గతంలో కర్ణాటక, మహారాష్ట్రల్లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు పెద్ద రాజకీయ పార్టీల నేతలు చిక్కుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈడీ సోదాల్లో ల్యాప్‌టాప్‌లు, పెన్ డ్రైవ్‌లు, భారీగా డబ్బు లావాదేవీల రికార్డులు, బ్యాంక్ ఖాతాల వివరాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలతో ఢిల్లీలోని పెద్ద అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *