- బీఆర్ఎస్ హయాంలో బిల్లుల పెండింగ్
- లక్షల్లో నష్టపోయిన అనేకమంది సర్పంచులు
- సర్పంచుల సంఘం నాయకుల ఆవేదన
- ఎన్నికల సమయంలో మీడియాలో కథనాలు
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో స్థానిక ఎన్నికల వేళ గత ఐదేళ్ల పాలనలో జరిగిన దారుణాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. పల్లెప్రగతి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం సర్పంచులపై పెట్టిన తీవ్ర ఒత్తిడి ఫలితంగా కనీసం 60 మందికి పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల మాట పక్కన పెడితే ప్రజలచేత ఎన్నికైన ప్రజాప్రతినిధులే ఇంత పెద్ద సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడటం ఆందోళనకరం. గ్రామపంచాయతీ ఎన్నికల సమయంలో సర్పంచుల ఆత్మహత్యలపై మీడియాలో కథనాలు కలవరపెడుతున్నాయి.

అప్పులపాలు చేసిన అధికార దర్పం…
సర్పంచుల ఆత్మహత్యలకు ముఖ్య కారణం బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం. హరితహారం నర్సరీల నిర్వహణ, గ్రామీణ పార్కులు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల ఏర్పాటు వంటి పనులు చేయాలని అధికారులు సర్పంచులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. కానీ అందుకు తగిన నిధులను మాత్రం విడుదల చేయలేదు. దీంతో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది సర్పంచులు సొంత డబ్బులు, అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేశారు. అయితే పనులు పూర్తయినా బిల్లులు మాత్రం రాలేదు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ పట్టించుకోలేదని సర్పంచుల సంఘం నాయకులు అంటున్నారు.
ఇప్పటికీ సర్పంచుల కష్టాలు మారలేదు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచుల కోసం ధర్నా కూడా చేశారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చాక కూడా పాత బిల్లులు విడుదల చేయలేదు. తెలంగాణ సర్పంచుల సంఘం నాయకులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్… ఇద్దరూ సర్పంచులను మోసం చేశారని వారు ఆరోపిస్తున్నారు. పాలకులు మారినా పద్ధతి మారలేదు. పనులు చేయించిన పాత సర్పంచుల పదవీకాలం ముగిసి మళ్లీ ఎన్నికలు వచ్చినా వారి కష్టాలు మాత్రం తీరలేదు. తమ పరువు కోసం అప్పులు చేసిన సర్పంచులకు చివరికి అప్పుల బాధతో ఆత్మహత్యే శరణ్యమైంది.
కమీషన్ల కోసం ఒత్తిడి రాజకీయం
గతంలో సర్పంచులు అంటే ధనవంతులు… ఊరి పెద్దలు అనే పేరుండేది. కానీ ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి వారు కూడా ఈ పదవుల్లోకి వస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా పనులు చేయమని ఒత్తిడి చేయడం… సర్పంచులను కాంట్రాక్టర్లుగా మార్చడమే పెద్ద తప్పు అని నిపుణులు అంటున్నారు. కాంట్రాక్టర్లు అయితే వారి పద్ధతిలో డబ్బు తెచ్చుకుంటారు. కానీ సామాన్య సర్పంచులు ఈ ఆర్థిక ఒత్తిడిని… అధికారుల వేధింపులను తట్టుకోలేకపోయారు. పల్లెప్రగతి, క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు – వీటన్నిటి పనుల కోసం సొంత బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సర్పంచులు కోకొల్లలు. కోటి రూపాయల వరకు కూడా ఖర్చు చేసినవారు ఉన్నారని మాజీ సర్పంచులు వాపోతున్నారు.