సోలార్ బిల్… ఐఏఎస్ ఫైర్ – చార్జీల పెంపుపై మాజీ సీఎండీ ఫిర్యాదు

Suresh Chanda IAS complaints on Solar Electricity System
  • నెట్ మీటరింగ్ ఔట్… గ్రాస్ పద్ధతి ఇన్
  • పాత నిబంధన ఎత్తివేయడంతో రెట్టింపు బిల్లు
  • తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చందా ఫైర్
  • డిస్కం దౌర్జన్యం.. వినియోగదారులకు భారం!
  • రాత్రికి రాత్రే మీటరింగ్ మాయ.. డబుల్ గోల!

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో సోలార్ వినియోగదారుల బిల్లులు ఒక్కసారిగా రెట్టింపు కావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. డిస్కం అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను పక్కనబెట్టి నెట్ మీటరింగ్ స్థానంలో గ్రాస్ మీటరింగ్‌ను అమలు చేయడమే దీనికి కారణం. గ్రిడ్‌కు ఇచ్చిన కరెంటుకు తక్కువ ధర చెల్లిస్తూ తీసుకున్న కరెంటుకు మాత్రం అధిక రిటైల్ ధర వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలను మోసం చేయడమేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా తీవ్రంగా విమర్శిస్తూ పాత విధానం పునరుద్ధరణ కోసం రెగ్యులేటరీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

మూడు నెలల్లో రెట్టింపు బిల్లు…
తెలంగాణలో ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్న వేలాది మంది వినియోగదారులకు దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) సెప్టెంబరు నుంచి ఊహించని షాక్ ఇస్తోంది. ఇదివరకు నెట్ మీటరింగ్ విధానంలో తక్కువ బిల్లులు వస్తున్న వినియోగదారులు ఇప్పుడు అకస్మాత్తుగా రెట్టింపు బిల్లులు చూసి కంగు తింటున్నారు. ఉదాహరణకు ఆగస్టులో 179 యూనిట్ల నెట్ వాడకానికి కేవలం రూ. 877 వచ్చిన బిల్లు… నవంబరులో 172 యూనిట్ల వాడకానికి ఏకంగా రూ. 1,444కి పెరిగింది. దీనికి కారణం డిస్కం అధికారులు తమ ఇష్టానుసారం ఎటువంటి ముందస్తు ఉత్తర్వులు లేకుండానే పాత నెట్ మీటరింగ్ విధానాన్ని రద్దు చేసి కొత్త గ్రాస్ మీటరింగ్ విధానాన్ని అమలు చేయడమే. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా తీసుకున్న ఈ నిర్ణయం సోలార్ వాడకాన్ని నిరుత్సాహపరచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నెట్ వర్సెస్ గ్రాస్… తేడా తెలిస్తే కన్నీరే!
సౌర విద్యుత్ వినియోగదారులకు ఇప్పటివరకు నెట్ మీటరింగ్ పద్ధతి ద్వారా ఊరట లభించేది. ఈ విధానంలో నెలకు గ్రిడ్ నుంచి తీసుకున్న మొత్తం విద్యుత్ యూనిట్లను ఇంటి పైనుంచి గ్రిడ్‌కు పంపిన యూనిట్ల నుంచి తీసి వేసి (నెట్ వాడకం) మిగిలిన యూనిట్లకు మాత్రమే రిటైల్ టారిఫ్ స్లాబ్ ఆధారంగా బిల్లు వసూలు చేసేవారు. ఒకవేళ గ్రిడ్‌కు పంపిన యూనిట్లు ఎక్కువగా ఉంటే వినియోగదారుడికి డబ్బులు కూడా వచ్చేవి. కానీ ఇప్పుడు డిస్కం తీసుకొచ్చిన గ్రాస్ మీటరింగ్ పద్ధతి పూర్తిగా దీనికి భిన్నం. ఈ కొత్త పద్ధతిలో గ్రిడ్ నుంచి తీసుకున్న ప్రతి యూనిట్‌కు వినియోగదారుడు పూర్తి రిటైల్ ధర చెల్లించాలి. కానీ ఇంటి పైనుంచి గ్రిడ్‌కు పంపిన యూనిట్లకు మాత్రం చాలా తక్కువగా ఉండే సెటిల్‌మెంట్ ధర మాత్రమే ఇస్తున్నారు. అంటే గ్రిడ్‌కు ఇచ్చిన కరెంటును డిస్కం నామమాత్రపు ధరకు కొనుగోలు చేసి అదే కరెంటును ప్రజలకు రెట్టింపు ధరలకు అమ్ముతోంది. ఈ మోసపూరిత మార్పుతో సోలార్ వినియోగదారుడికి బిల్లు రెండింతలు అవుతోంది.

కమిషన్ ఆదేశాలు లేవు… డిస్కం దౌర్జన్యం!
డిస్కం అధికారులు ఏకంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (రెగ్యులేటరీ కమిషన్) ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ మార్పును అమలు చేశారనేది అతిపెద్ద ఆరోపణ. 2025 జనవరి 15న రూఫ్ టాప్ సోలార్ రెగ్యులేషన్‌లో సెక్షన్ 8.1.3 బి క్లాజ్ స్పష్టంగా ఒక నియమాన్ని చెబుతోంది. నెట్ మీటరింగ్‌లో గ్రిడ్ నుంచి తీసుకున్న యూనిట్లు ఎక్కువైతేనే వినియోగదారుడికి బిల్లు పంపాలి. కానీ డిస్కం ఈ నియమాన్ని పూర్తిగా పక్కనపెట్టి గ్రాస్ మీటరింగ్ బిల్లులు పంపుతోంది. కమిషన్ ఆమోదం లేకుండా ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని… డిస్కం నిబంధనలను ఉల్లంఘిస్తోందని నిపుణులు గొంతెత్తుతున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ పారదర్శకంగా వ్యవహరించకుండా దొంగ దారిలో ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నిస్తోందనేది వారి ప్రధాన విమర్శ.

సోలార్ పెట్టుబడి దండగ…
ప్రభుత్వమే ఇప్పటివరకు సోలార్ ప్లాంట్లను వేసుకోవాలని, విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. లక్షలు ఖర్చు పెట్టి సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్న వారికి ఇప్పుడు బిల్లు రెట్టింపు అవుతుంటే తాము మోసపోయామని వినియోగదారులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర ట్రాన్స్‌కో సీఎండీ, తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా కూడా ఈ మార్పును తీవ్రంగా తప్పుబడుతూ… ఇది ప్రజలకు చేసిన ద్రోహంగా అభివర్ణించారు. ఇలాంటి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఒక్కరు కూడా సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి ముందుకు రారని, రాష్ట్రంలో సౌర విద్యుత్ విస్తరణ లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిస్కం స్వార్థపూరిత చర్యలు పర్యావరణ పరిరక్షణకు, పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తున్నాయి.

కమిషన్‌కు లేఖ… పోరాటానికి పిలుపు!
ఈ అన్యాయంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సురేష్ చందా వెంటనే రంగంలోకి దిగారు. ఆయన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌కు లేఖ రాశారు. సెప్టెంబరు నుంచి అమలు చేస్తున్న గ్రాస్ మీటరింగ్ విధానాన్ని రద్దు చేసి పాత నెట్ మీటరింగ్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని, అలాగే సెప్టెంబరు నుంచి వచ్చిన బిల్లులన్నింటినీ సరిచేయాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. ఇది కేవలం తన ఒక్కడి సమస్య కాదని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది సోలార్ వినియోగదారుల సమస్య అని స్పష్టం చేశారు. విద్యుత్ నియంత్రణ మండలి తక్షణం స్పందించకపోతే ఈ బిల్లుల షాక్‌కి భయపడి ప్రజలు సౌర విద్యుత్ ప్లాంట్లకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పే పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పంపిణీ సంస్థ పద్ధతి మార్చుకోకపోతే సోలార్ పెట్టుబడి పెట్టిన ప్రజలు ఆందోళన బాట పట్టే అవకాశం కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *