కమ్యూనిస్టు దేవుడు… పార్టీకి విధేయుడు – చైనా దేశంలో పార్టీ నియంత్రణలో మతం

  • పార్టీనే దేవుడుగా ప్రజలు భావించేలా ప్లాన్
  • పార్టీని పూజించిన తర్వాతే దేవుడికి హారతి
  • మతం అంటే కమ్యూనిస్టులకు దడ!
  • పార్టీలో ఉన్న వాళ్లే పాస్టర్లు, ఇమామ్‌లు
  • ‘ది వాల్ స్ట్రీట్ జనరల్’ ప్రత్యేక కథనం

సహనం వందే, బీజింగ్:
బీజింగ్‌లో ప్రముఖ క్రైస్తవ పాస్టర్‌ను ఇటీవల అరెస్టు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇది కేవలం ఒక పాస్టర్ అరెస్టు మాత్రమే కాదు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ)కి మతంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను మరోసారి స్పష్టం చేసింది. దేశంలో ఎన్ని అణచివేతలున్నా మత విశ్వాసం తగ్గకపోగా మరింతగా వికసిస్తుండటం చూసి సీసీపీ నాయకత్వం ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ అరెస్టు వెనుక మతాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న పార్టీ పాత వ్యూహంలో భాగమేనని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మతం అంటే కమ్యూనిస్టులకు దడ!
చైనా కమ్యూనిస్టు నాయకులు మతాన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక అంశంగా చూడరు. తమ అధికారానికి అది ప్రత్యక్ష పోటీగా భావిస్తారు. ప్రజలు దేవున్ని కంటే తమ పార్టీని మాత్రమే అత్యున్నతంగా ఆరాధించినప్పుడే రాజ్యం తమ చేతుల్లో సురక్షితంగా ఉంటుందన్నది వారి నియమం. అందుకే ఏ మతమైనా అది క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, బౌద్ధం కావచ్చు… పెరగడాన్ని వాళ్లు అస్సలు సహించరు. చర్చిలు, మసీదులు, గుళ్లు, ప్రార్థనా మందిరాలు అన్నీ కూడా పార్టీ నిఘా, నియంత్రణలో ఉండాలన్నది వారి షరతు.

కొత్త టెక్నాలజీతో నిఘా పెంచిన జిన్‌పింగ్!
చైనాలో కమ్యూనిస్టు పాలన మొదలైన 1949 నుంచి మత నిర్మూలన అనే లక్ష్యం ఏనాడూ మారలేదు. మావో హయాంలో ఎర్ర సైనికులు వేలాది దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. ఇప్పుడు జిన్‌పింగ్ హయాంలో అదే పని మరింత ఆధునిక రూపంలో కొనసాగిస్తున్నారు. మతాన్ని కట్టడి చేయడానికి ఇప్పుడు బుల్‌డోజర్ల స్థానంలో కెమెరాలను, ఫేస్ రికగ్నిషన్, సైబర్ నిఘాను ఉపయోగిస్తున్నారు. లక్ష్యం పాతదే అయినా దానికి అత్యాధునిక సాంకేతికతను జోడించి ప్రజల విశ్వాసాలపై దాడి చేస్తున్నారు.

కత్తికి గురైన అన్ని మతాలు…
చైనా కమ్యూనిస్టు కత్తికి క్రైస్తవులు మాత్రమే కాదు చైనాలోని అన్ని మతాలూ గురయ్యాయి. ముస్లింలను లక్షల సంఖ్యలో రీ ఎడ్యుకేషన్ శిబిరాల్లో బంధించిన విషయం ప్రపంచానికి తెలిసిందే. బౌద్ధులు మెజారిటీ ఉన్న టిబెటన్లపై అణచివేత ఏమాత్రం తగ్గలేదు. ఫాలున్ గాంగ్ అనే ఆధ్యాత్మిక సంస్థను పూర్తిగా నిషేధించి వేలాది మందిని జైళ్లలో తోసేశారు. ఇప్పుడు బీజింగ్ పాస్టర్ అరెస్టుతో క్రైస్తవ సంఘాలపై మళ్లీ దృష్టి పెట్టారు. పార్టీకి లోబడకపోతే ఎవరికీ చోటు లేదన్నదే చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రపంచానికి పంపుతున్న స్పష్టమైన సందేశం.

ఊపిరి ఆడకుండా చేసే కుట్ర!
మతాన్ని ఒక్క రాత్రిలో అంతం చేయడం అసాధ్యమని చైనా కమ్యూనిస్టు పార్టీకి బాగా తెలుసు. అందుకే తరతరాలుగా కొనసాగే విధంగా ఒక దీర్ఘకాలిక పథకాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగా పిల్లలకు మత విద్య నేర్పడాన్ని పూర్తిగా నిషేధించారు. కొత్త చర్చి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ముఖ్యంగా పాస్టర్లను, ఇమామ్‌లను కూడా పార్టీ నమోదు చేసుకున్నవాళ్లనే అనుమతిస్తున్నారు. ఇలా నెమ్మదిగా మతం ఊపిరి ఆడకుండా చేసి దాని ఉనికిని తుడిచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మతానికి, విశ్వాసానికి వ్యతిరేకంగా జరుగుతున్న సైలెంట్ వార్!

రహస్యంగా పెరుగుతున్న విశ్వాసం!
సీసీపీ ఎంత ఒత్తిడి తెచ్చినా చైనాలో మత విశ్వాసం తగ్గడం లేదు కదా పైగా పెరుగుతోంది. అధికారిక లెక్కల కంటే రహస్యంగా మతాన్ని అనుసరించే వారి సంఖ్య రెట్టింపు ఉంటుందని అంచనా. ఇంట్లో చర్చీలు, రహస్య ప్రార్థనా సమావేశాలు ఎక్కడా ఆగడం లేదు. ఎంత కట్టడి చేసినా ప్రజలు దేవుడి వైపు తిరుగుతున్నారు. ఈ వాస్తవమే సీసీపీని మరింత ఆగ్రహానికి గురిచేస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *