- ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ ‘మౌంజారో’ ఇంజెక్షన్
- 6 నెలలుగా దేశంలో దూసుకుపోతున్న మందు
- క్లినికల్ ట్రయల్స్‌లో తిరుగులేని విజయం!
- వైద్యుల పర్యవేక్షణ లేకుండా వాడనే వాడొద్దు
- ఇతర మందుల లాగానే దీంతోనూ సైడ్ ఎఫెక్ట్స్
- మందు వాడటం ఆపితే మళ్లీ బరువు ఖాయం
- క్రాష్ డైట్ల కంటే చాలా మేలంటున్న వైద్యులు
సహనం వందే, న్యూఢిల్లీ:
భారతదేశంలో కోరలు చాస్తున్న డయాబెటిస్, అధిక బరువు సమస్యలకు చెక్ పెట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా నుంచి ఓ కొత్త అస్త్రం వచ్చింది. అదే… మౌంజారో! అమెరికన్ ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ తయారు చేసిన ఈ ఇంజెక్షన్… మన దేశంలో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే రూ.100 కోట్ల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. కేవలం డయాబెటిస్ నియంత్రణకే కాదు… బరువు తగ్గించడంలోనూ అద్భుతాలు చేస్తూ దేశ ఫార్మా మార్కెట్‌లో రెండో అతిపెద్ద బ్రాండ్‌గా అవతరించింది. డయాబెటిస్ సంక్షోభంలో కూరుకుపోతున్న భారత్‌కు ఈ మందు కొత్త ఆశలు నింపుతోంది.
ఎలా పనిచేస్తుంది ఈ మాయా మందు?
మౌంజారోలో ఉన్న కీలక రసాయనం పేరు టైర్జెపటైడ్. ఇది మన శరీరంలో సహజంగా ఉండే జీఎల్పీ-1 (గ్లూకగాన్ లైక్ పెప్టైడ్-1), జీఐపీ హార్మోన్లను పోలి ఉంటుంది. ఈ హార్మోన్ల విషయంలో మౌంజారో రెండు ప్రధాన పనులు చేస్తుంది. ఒకటి: రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతూ ఇన్సులిన్ విడుదలను పెంచుతుంది. రెండు: మెదడులోని ఆకలి కేంద్రాన్ని ప్రభావితం చేసి తినాలన్న కోరికను అణచివేస్తుంది. తద్వారా తిన్న ఆహారం ఆలస్యంగా జీర్ణమై త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో కేలరీలు తగ్గడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును శక్తిగా వాడుకుని సహజంగా బరువు తగ్గుతుంది.

క్లినికల్ ట్రయల్స్‌లో తిరుగులేని విజయం!
మౌంజారో ఎంత శక్తివంతమైనదో ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్లినికల్ పరీక్షలు నిరూపించాయి. డయాబెటిస్ ఉన్నవారిపై జరిగిన సుర్పాస్ పరీక్షల్లో… ఈ మందు తీసుకున్న వారిలో హిమోగ్లోబిన్ ఏ1సీ స్థాయిలు 2.1 నుంచి 2.6 పాయింట్ల వరకు తగ్గాయి. ఇతర డయాబెటిస్ మందులతో పోలిస్తే ఇది మెరుగైన ఫలితం. ఇక అధిక బరువు ఉన్నవారిపై నిర్వహించిన సుర్మౌంట్ పరీక్షల్లో… 72 వారాల తర్వాత 15 మిల్లీగ్రాముల మోతాదు తీసుకున్న వారిలో సగటున 22.5 శాతం బరువు తగ్గింది. డయాబెటిస్‌తో అధిక బరువు ఉన్నవారిలోనూ సగటున 15 కిలోల బరువు తగ్గి మంచి ఫలితాలు వచ్చాయి. అంతేకాదు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడినట్టు అధ్యయనాలు వెల్లడించాయి.
దీర్ఘకాలిక ఆరోగ్యం సాధ్యమేనా?
డయాబెటిస్‌ను నియంత్రించి బరువును తగ్గించడమే కాకుండా… మౌంజారో ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు అంటున్నారు. జీవనశైలి మెరుగుపడటం వల్ల స్లీప్ అప్నియా, కిడ్నీ జబ్బులు, గుండె జబ్బులు, ఆల్జైమర్స్ వంటి సమస్యల చికిత్సకు కూడా ఇది పరోక్షంగా సాయపడవచ్చు. సినీ దర్శకుడు హన్సల్ మెహతా వంటి ప్రముఖులు కూడా ఈ మందుతో ఆరోగ్య మార్పులు సాధించామని బహిరంగంగా వెల్లడించారు. కానీ కేవలం మందుపైనే ఆధారపడకుండా సరైన ఆహారం, వ్యాయామంతో కలిపి వాడితేనే ఈ ప్రయోజనాలు శాశ్వతంగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇతర మందులలాగే సైడ్ ఎఫెక్ట్స్…
ఏ మందుకైనా లాభాలతో పాటు నష్టాలు ఉంటాయి. మౌంజారో విషయంలో కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. సాధారణంగా కడుపు సంబంధిత సమస్యలు అంటే… వికారం, వాంతులు, మలబద్ధకం, విరేచనాలు వంటివి వస్తాయి. అయితే సరైన వ్యాయామం చేయకుండా ఈ మందు తీసుకుంటే కొవ్వుతో పాటు కండరాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయి. దీనిని సార్కోపీనియా అంటారు. కండరాలు కోల్పోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపొరోసిస్, కీళ్ల నొప్పుల ప్రమాదం పెరుగుతుంది. మందు వాడటం ఆపితే మళ్లీ బరువు పెరిగి కండరాలు మరింత బలహీనపడతాయని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
వైద్యుల సలహా లేకుండా అస్సలే వాడకూడదు
భారతదేశంలో కోట్లాదిమంది డయాబెటిస్, అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మౌంజారో ఒక విప్లవాత్మక పరిష్కారం. కానీ ఇది తక్షణ పరిష్కారం (క్విక్ ఫిక్స్) కాదు. వైద్యుల సలహా లేకుండా అస్సలు వాడకూడదు. కండరాల క్షీణత జరగకుండా ఉండాలంటే మౌంజారోతో పాటు వ్యాయామాలు చేయడం, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ 2026లో ఈ మందుల తరహాలోనే జెనరిక్ వెర్షన్లు వచ్చి ధరలు తగ్గే అవకాశం ఉంది. అప్పటివరకు వైద్యుల పర్యవేక్షణలో జీవనశైలి మార్పులతో కలిపి మౌంజారో వాడితే అది ఆరోగ్యానికి వరమే అవుతుంది. లేదంటే తాత్కాలిక ప్రయోజనాలు పొంది, దీర్ఘకాలిక సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.