లీవ్ అడిగితే లెక్చర్- ఆఫీసుల్లో బాసుల తీరుపై ఉద్యోగుల ఆగ్రహం

  • సెలవులు అడిగితే కిందా పైనా చూస్తారు
  • భారతీయ బాసుల దాదాగిరి మనస్తత్వం
  • జపాన్ లో సెలవులు తీసుకునేలా ప్రోత్సాహం
  • అడిగిన వెంటనే గౌరవంగా లీవ్ మంజూరు
  • అనేక దేశాల్లో ‘పనికంటే జీవితం ముఖ్యం’
  • ఇండియాలో ‘జీవితం కంటే పనే ప్రధానం’
  • ఒకవేళ సెలవిచ్చి ఇంటికెళ్లినా పనికెళ్లినట్లే!

సహనం వందే, హైదరాబాద్:
ఒక రెడిట్ పోస్ట్ ఇప్పుడు భారతీయ కార్పొరేట్ ప్రపంచంలో అగ్గి రాజేసింది. అత్యవసరం అని లీవ్ అడిగితే… జపాన్ మేనేజర్ ఆప్యాయంగా పలకరించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అంటూ ప్రేమగా సెలవు మంజూరు చేశాడు. కానీ మన భారతీయ బాస్ ఎలా స్పందించారో తెలుసా? ‘నువ్వు ఎక్కువగా సెలవులు పెడుతున్నావు. నీ పని తీరుపై మేనేజ్మెంట్ అసంతృప్తితో ఉంది. సరేలే కానీ ఈసారికి సెలవు ఆమోదించాను… అయితే ఫోన్లో, మెయిల్‌లో అందుబాటులో ఉండు’ అని ఆదేశించాడు. అంటే సెలవు తీసుకున్నా నువ్వు ఇంటి నుంచే బానిసలా చేయాలన్నమాట. ఇక ఆ సెలవుకు అర్థం ఏముంది? ఇండియన్ మేనేజర్ తనకు ఏదో వ్యక్తిగత లాభం చేకూర్చినట్టు మాట్లాడడం చూసి ఆ ఉద్యోగి నిరాశ చెందాడు. ఈ చిన్న చేష్టలే మన కార్పొరేట్ సంస్కృతిలో ఉన్న చిల్లరతనాన్ని బయటపెడుతున్నాయి.

వర్క్ ఫస్ట్… లైఫ్ నెక్స్ట్
ఈ పోస్ట్ కింద వేల మంది భారతీయ రెడిట్ యూజర్లు తమ బాధలు షేర్ చేశారు. భారత్‌లో జీవితం కంటే పనే ముఖ్యం అనే అనధికారిక నియమం నడుస్తోందని ఒకరు వాపోయారు. ఫ్రాన్స్ లాంటి దేశాల్లో పని కంటే జీవితం ప్రధానంగా ఉంటుందనీ… కానీ ఇక్కడ సీన్ రివర్స్ అని మరో ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. మన మేనేజర్లు సెలవు ఇచ్చేటప్పుడు కనీసం ఒక్క మంచి మాట కూడా చెప్పడు. ఆ ఉద్యోగికి తాను కంపెనీకి విలువైనవాడిని కానేమో అనే భావన కలిగేలా వ్యవహరిస్తాడు. ఈ చిన్నపాటి మానసిక ఒత్తిడి క్రమంగా పెరుగుతూ ఉద్యోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జపాన్‌లో బాసులు కాదు స్నే’హితులు’!
జపాన్ సంస్కృతిలో మేనేజర్లంటే అధికారులు కాదు. టీమ్‌కు సేవ చేసేవాళ్లు అన్న భావన ఉంది. ఉద్యోగి లీవ్ అడిగితే కేవలం పని గురించి కాకుండా వారి వ్యక్తిగత శ్రేయస్సు గురించి కూడా ఆలోచిస్తారు. వారు ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూస్తారు. అందుకే అక్కడ ఉద్యోగి ఆరోగ్యం బాగుంటేనే పని బాగుంటుందని నమ్ముతారు. ఒత్తిడిలో ఉన్నానని చెప్పినా, సెలవులు మిగిలిపోయినా తప్పక తీసుకోమని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే విశ్రాంతి లేకపోతే ఉత్పాదకత తగ్గిపోతుందని వారికి తెలుసు. మన దేశంలో సెలవు తీసుకోవాలంటే చనిపోయిన వాళ్ళని మళ్లీ మళ్లీ చంపాల్సిన పరిస్థితి వస్తుందని ఒక ప్రైవేటు ఉద్యోగి వాపోయాడు. అనారోగ్యం వంటి లేనిపోని అబద్ధాలు చెప్పి సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మారదా మన తీరు?
భారతీయ కంపెనీల్లో చాలావరకు ఇంకా పని మీదే దృష్టి పెడుతున్నారు. పనితీరు సరిగా లేని వారిని కంపెనీ ప్రోత్సహించదంటూ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ సభ్యులు మాట్లాడడం మన కఠినత్వాన్ని చూపిస్తోంది. జపాన్ మోడల్‌ను అనుసరిస్తే ఉద్యోగులు సంతోషంగా ఉండి ఉత్పాదకత కూడా రెట్టింపవుతుందని నిపుణులు చెబుతున్నారు. మేనేజర్ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుందని కొందరు వాదిస్తున్నప్పటికీ, మెజారిటీ కార్పొరేట్ సంస్కృతి కచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఈ పోస్ట్ చూసైనా మన కార్పొరేట్ బాసులు మేల్కొంటారో లేదో చూడాలి. ఈ బానిస సంస్కృతి నుంచి మన ఉద్యోగులు బయటపడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *