- దేశంలో బాలికల్లో కొత్త ఉత్సాహం ఉరకలు
- తొలుగుతున్న సామాజిక అడ్డంకులు…
- అనేక చోట్ల మహిళా క్రికెట్ అకాడమీలు
సహనం వందే, న్యూఢిల్లీ:
భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం ఒక స్ఫూర్తి తరంగం. ఈ నెల మొదటి వారంలో మహిళా జట్టు కప్పు కొట్టిన క్షణం దేశవ్యాప్తంగా లక్షలాది బాలికలను మైదానాల్లోకి పరిగెత్తించింది. గత కొన్నేళ్లుగా ఆడవాళ్లు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నప్పటికీ ఇప్పుడు ఆ సంఖ్య అమాంతం రెట్టింపు అవుతోంది. చిన్న చిన్న పట్టణాల నుంచి పెద్ద నగరాల వరకు ఎక్కడ చూసినా బ్యాట్ పట్టిన ఆడపిల్లలే కనిపిస్తున్నారు. ఈ క్రీడా విప్లవం భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం లిఖిస్తోంది.
అకాడమీల్లో ఆశల వెలుగు…
క్రికెట్‌పై మక్కువ పెరగడంతో మైదానాల్లో పెద్ద మార్పు మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో సైతం బాలికల కోసం ప్రత్యేక క్రికెట్ అకాడమీలు పుట్టుకొస్తున్నాయి. ఇక పూణేలో ఒక్కో కోచ్ వంద మందికి పైగా ఆడపిల్లలకు శిక్షణ ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ముంబయిలో జరిగిన మహిళల లీగ్ మ్యాచ్ లకు ఏకంగా 2 లక్షల మంది ప్రేక్షకులు హాజరవడం ఈ ఆట ఎంతగా విస్తరించిందో చెప్పడానికి నిదర్శనం. యువ క్రీడాకారిణుల్లో ఉన్న ఉత్సాహం, నిబద్ధత చూస్తుంటే… జాతీయ జట్టు తలుపు తట్టే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.
తొలుగుతున్న సామాజిక అడ్డంకులు…
ఒకప్పుడు మహిళలు క్రికెట్ ఆడాలంటే అనేక సామాజిక అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు అవి మెల్లగా తొలగిపోతున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో తల్లిదండ్రులు సైతం ముందుండి తమ కూతుళ్లను క్రికెట్ ఆడమని ప్రోత్సహిస్తున్నారు. ఉత్తర భారత గ్రామాల్లో చూస్తే… ఆడపిల్లలు రాత్రిపూట ఫ్లడ్ లైట్ల కింద సాధన చేయడం మరింత ఆసక్తికరం. ఇదంతా ప్రపంచ కప్ విజయం తెచ్చిన ఉత్తేజం వల్లే సాధ్యమవుతోంది. ఆట పెరగడంతో పాటు మహిళల ప్రీమియర్ లీగ్ జట్లు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండడంతో యువ ఆటగాళ్లకు స్పాన్సర్లు కూడా వరుస కడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తరణ…
భారత మహిళల ప్రపంచ కప్ విజయం ప్రభావం దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆట వేగంగా వ్యాపిస్తోంది. ఈ ఉత్సాహాన్ని గమనించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2029 ప్రపంచ కప్‌ను ఎనిమిది నుంచి పది జట్లకు విస్తరించాలని నిర్ణయించింది. ఈ మార్పు థాయ్ లాండ్, ఇండోనేషియా, యూఎస్, జర్మనీ లాంటి దేశాలకు పెద్ద అవకాశంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి క్రికెట్ దిగ్గజాలు ఇప్పటికే ముందుండగా దక్షిణాఫ్రికా రనరప్‌గా నిలవడం ఆఫ్రికాలోనూ కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.
కొత్త ఖండాల్లో ఆట పరుగులు…
దక్షిణాఫ్రికా జట్టు బలమైన ప్రదర్శనతో ఆ దేశంలో మహిళల క్రికెట్ వేగంగా పెరుగుతోంది. బాలికలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నారు. దక్షిణ అమెరికా దేశాలైన బ్రెజిల్, పెరూ, చిలీలో కూడా మహిళలు ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడేందుకు సెంట్రల్ కాంట్రాక్టులు మొదలయ్యాయి. ఆసియాలో థాయ్ లాండ్, ఇండోనేషియా దేశాలు కూడా పతకాలు సాధించి ఐసీసీ ర్యాంకింగ్‌లో టాప్ టెన్ స్థానానికి దగ్గరగా ఉన్నాయి. అమెరికాలో 2028 ఒలింపిక్స్ కోసం ప్రత్యేక ప్రాజెక్టులు నడుస్తుండడం మహిళల క్రికెట్ విస్తరణకు నిదర్శనం. ఈ మార్పులన్నీ కలిసి మహిళా క్రికెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తున్నాయి.