బాడీ షేమింగ్… బహుజనుల ఫైటింగ్ – దున్నపోతు వ్యాఖ్య దుమారం…

  • తెలంగాణలో బీసీ, ఎస్సీ మంత్రుల పోరు!
  • నోరు పారేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్
  • దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అడ్లూరి
  • దీంతో రంగంలోకి దిగిన పార్టీ అధిష్టానం

సహనం వందే, హైదరాబాద్:
బహుజనుల మధ్య సఖ్యత కొరవడింది. బీసీ, ఎస్సీల మధ్య ఉండాల్సిన ఐక్యత దెబ్బతింటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇద్దరు బహుజన మంత్రుల మధ్య ఉన్న వర్గ వైరం చినికి చినికి గాలివానలా మారుతోంది. బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దున్నపోతు చుట్టూ దుమారం రేపాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యలు దళిత మంత్రి మీద బీసీ మంత్రి చేసిన బాడీ షేమింగ్ అని దళిత సంఘాలు గళం ఎత్తడంతో వ్యవహారం మరింత రచ్చ రచ్చగా మారింది.

ఆలస్యంపై ఆగ్రహం… అడ్లూరిపై పొన్నం గుస్సా!
జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా ఆయన షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యం అయింది. ఢిల్లీ వెళ్లాల్సిన హడావుడిలో ఉన్న పొన్నం ప్రభాకర్ మీడియా మైకుల ముందు లక్ష్మణ్‌ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనను తీవ్రంగా నొచ్చుకునేలా చేశాయి. దీంతో లక్ష్మణ్ నేరుగా పొన్నంకు ఫోన్ చేసి బాడీ షేమింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాను ఎవరినీ దూషించలేదని… సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశానని పొన్నం వివరణ ఇచ్చారట. దీంతో ‘మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అంటూ అడ్లూరి ఆగ్రహంగా ఫోన్ పెట్టేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

డెడ్‌లైన్‌తో ముదిరిన వైరం…అధిష్టానం జోక్యం!
ఈ వివాదంలో దళిత సంఘాలు రంగంలోకి దిగి అడ్లూరి లక్ష్మణ్‌కు మద్దతుగా నిలవడంతో ఇష్యూ మరింత పెద్దది అయ్యింది. అంతేకాకుండా పొన్నం క్షమాపణ చెప్పాలంటూ మంత్రి లక్ష్మణ్ పెట్టిన డెడ్‌లైన్‌తో మంత్రుల మధ్య వైరం మరింత రాజుకున్నట్లు అయింది. దీంతో వ్యవహారం పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తుందని భావించిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరు మంత్రులకు క్లాస్ తీసుకున్నారట. అటు మంత్రి లక్ష్మణ్ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలకు కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ ఆధిపత్య పోరే అసలు కారణమా?
మంత్రుల మధ్య వ్యక్తిగత దూషణలు కేవలం ఆలస్యం అయినంత మాత్రాన రాలేదని దీని వెనుక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆధిపత్య పోరు ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల మధ్య ఆధిపత్య పోరే అసలు సమస్య. గతంలో సుడా చైర్మన్ వ్యవహారంలో శ్రీధర్ బాబు జోక్యంపై పొన్నం ఆగ్రహంగా ఉన్నారు. తాజాగా లక్ష్మణ్‌పై పొన్నం చేసిన వ్యాఖ్యలకు అసలు కారణం సెప్టెంబర్ 17న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్‌లో అధికారికంగా జెండా ఎగరవేయలేకపోతున్నానన్న పొన్నం ఆవేదనేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తన నియోజకవర్గ హెడ్ క్వార్టర్ సిద్దిపేట జిల్లాలో ఉండటంతో తాను కరీంనగర్ సిటీకి పరిమితం కాలేకపోతున్నానన్న అసంతృప్తి పొన్నంలో రగిలిపోతోందట.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *