- ఔషధ పరీక్షల్లో నైతిక ప్రమాణాలకు చెల్లు
- స్వతంత్రతపై నీడలు… ఐఆర్‌బీలు ప్రైవేట్
- దీంతో అరకొరగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ
సహనం వందే, హైదరాబాద్:
ఔషధ పరిశోధనల పేరుతో కంపెనీలు రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయా? క్లినికల్ ట్రయల్స్ లో రోగుల భద్రతకు కవచంగా నిలవాల్సిన నైతిక సమీక్ష మండలి (ఐఆర్‌బీ) తమ స్వతంత్రతను కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. బడా ఫార్మా కంపెనీల ఆర్థిక ప్రయోజనాల వలలో చిక్కుకున్న ఈ వ్యవస్థ రోగుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో వెలుగు చూసిన ఈ వ్యవహారం… మన దేశంలో కూడా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఐఆర్‌బీలు ప్రైవేటుపరం!
క్లినికల్ ట్రయల్స్‌లో రోగుల భద్రతకు భరోసా ఇవ్వాల్సిన ఐఆర్‌బీలు ఇప్పుడు పూర్తి వాణిజ్య సంస్థలుగా మారిపోయాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ సంస్థలు ప్రైవేటు ఈక్విటీ సంస్థల ఆధీనంలోకి వెళ్లడంతో వాటి పారదర్శకత ప్రశ్నార్థకమైంది. దీనికి నిదర్శనంగా నోవో నార్డిస్క్ కంపెనీ తన ఓజెంపిక్ (సెమాగ్లూటైడ్) ఔషధ పరీక్షల కోసం డబ్ల్యూసీజీ క్లినికల్ అనే సంస్థను ఎంచుకోవడం ఒక ఉదాహరణ. నోవో హోల్డింగ్స్‌తో ఆర్థిక సంబంధాలున్న ఈ సంస్థను గత ఆరేళ్లలో నోవో ఏకంగా 46 ట్రయల్స్‌కు ఎంచుకోవడం కేవలం యాదృచ్చికం కాదనే అనుమానాలు బలపడుతున్నాయి. మన దేశంలోనూ ఔషధ కంపెనీలతో స్థానిక నైతిక సంస్థలకు ఉన్న సన్నిహిత సంబంధాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
లాభార్జనే లక్ష్యం… రాజీ పడుతున్న సమీక్షలు
గతంలో విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రుల వద్ద లాభాపేక్ష లేకుండా పనిచేసిన నైతిక సమీక్ష మండలులు ప్రస్తుతం డబ్ల్యూసీజీ, ఆడ్వర్రా వంటి వాణిజ్య దిగ్గజాలుగా అవతరించాయి. ఈ సంస్థలు కేవలం సమీక్షలకే పరిమితం కావడం లేదు. ట్రయల్స్ నిర్వహణ, వాలంటీర్ల ఎంపిక, డేటా విశ్లేషణలో సైతం చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. ఔషధ కంపెనీల నుంచి భారీగా ఆర్థిక లబ్ధి పొందుతున్నందున ట్రయల్స్‌లో చిన్నపాటి లోపాలను సైతం చూసీచూడనట్లు వదిలేసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశంలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) నియంత్రణ ఉన్నప్పటికీ స్వతంత్ర నైతిక సమీక్షల కొరత కారణంగా కంపెనీల ఒత్తిడికి లోనవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాత కథే పునరావృతం!
క్లినికల్ ట్రయల్స్‌లో నైతిక ఉల్లంఘనలు కొత్తవి కాదు. 1972లో వెలుగు చూసిన టస్కీగీ సిఫిలిస్ అధ్యయనం నైతికతను పూర్తిగా పాతాళానికి తొక్కింది. 2005లో హైదరాబాద్‌లో రోగుల పూర్తిస్థాయి సమ్మతి లేకుండా పరీక్షలు నిర్వహించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల తర్వాత ప్రభుత్వం 2019లో నియమాలను కఠినతరం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు బలహీనంగా ఉంది. ఈ వైఫల్యం కారణంగానే ఓజెంపిక్ వంటి ఔషధాల ట్రయల్స్‌లో తలెత్తిన వివాదాలు ప్రపంచవ్యాప్తంగా ఫార్మా పరిశోధనలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే ఓజెంపిక్ వల్ల పేగు, గాల్‌బ్లాడర్ సమస్యలు వచ్చాయంటూ 2300కు పైగా ఫిర్యాదులు వచ్చాయి.
నియంత్రణ లోపం… రోగుల రక్షణకు శాపం
అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా నైతిక సమీక్ష మండలుల పర్యవేక్షణ లోపభూయిష్టంగా ఉంది. ఈ సంస్థలు తాము నిర్వహించే సమీక్షల నాణ్యతను బహిరంగంగా వెల్లడించాల్సిన అవసరం లేకపోవడం నియంత్రణ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. మన దేశంలో సీడీఎస్‌సీఓ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నియమాలు ఉన్నప్పటికీ వాటి అమలులో లోటుపాట్లు కొనసాగుతున్నాయి. భారతదేశంలో కొన్ని ట్రయల్స్‌లో రోగులకు సరైన సమాచారం అందించకపోవడం, సమ్మతి పత్రాలు సరిగా పరిశీలించకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు నిత్యం తలెత్తుతూనే ఉన్నాయి.