- జస్టిస్ గవాయిపై బూటు విసిరిన సనాతనుడు
- గతంలో ముంబైలో అధికారుల అహంకారం
- అడుగడుగునా వివక్షకు గురవుతున్న గవాయి
- బహుజనుడైతే ఉన్నత పదవుల్లో ఉండొద్దా?
- ఇంత జరిగినా ఖండించలేని పెద్దలు ఎందరో…
సహనం వందే, న్యూఢిల్లీ:
ఈ దేశంలో అత్యున్నత పదవుల్లోని బహుజన, దళిత వర్గాలకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులకు అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. దేశ మాజీ రాష్ట్రపతి కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి… ఇద్దరూ దళితులే కావడంతో వారిపై అడుగడుగునా కులోన్మాదులు అనేక విధాలుగా మానసికంగా దాడులు చేస్తూనే ఉన్నారు. తాజాగా ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై న్యాయవాది రాకేష్ కిశోర్ బూటు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. విచారణ సమయంలో సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించబోమంటూ ప్రధాన న్యాయమూర్తిపై దాడికి తెగబడటం శోచనీయం.
విష్ణు విగ్రహ వివాదం…
ఈ ఘటనకు మూలమైన విష్ణు విగ్రహ పునరుద్ధరణ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ఆ సుప్రీంకోర్టు న్యాయవాది ఈ దాడికి పాల్పడటం వృత్తి ప్రమాణాలను ఉల్లంఘించడమే. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు కేవలం పబ్లిసిటీ కోసం దాఖలైన పిటిషన్లను నిరుత్సాహపరచడానికి ఉద్దేశించినవే తప్ప… మత విశ్వాసాలను అవమానించేవి కాదని గమనించాలి. అయినప్పటికీ వ్యక్తిగత ఆవేశం పేరుతో న్యాయస్థానం పవిత్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరం.
గతంలో మహారాష్ట్రలోనూ గవాయికి అగౌరవం…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన రెండో దళిత వ్యక్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. సీజేఐగా నియమితులైన తర్వాత ఆయన స్వరాష్ట్రం మహారాష్ట్రలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ వంటి ఉన్నతాధికారులు హాజరు కాకపోవడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి, అదీ దేశంలో అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన వ్యక్తికి లభించాల్సిన కనీస ప్రోటోకాల్, గౌరవం కూడా లభించకపోవడం దారుణం. ఇది కేవలం ప్రోటోకాల్ ఉల్లంఘన మాత్రమే కాదు. ఒక రాజ్యాంగ పదవికి, ఆ పదవిని అధిష్టించిన దళిత వ్యక్తికి జరిగిన కుల అవమానం. ఇదే మహారాష్ట్రకు చెందిన జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజేఐగా స్వరాష్ట్రానికి వెళ్లినప్పుడు ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు. ఈ వ్యత్యాసం కుల వివక్షను చూపిస్తుంది.
మాజీ రాష్ట్రపతి కోవింద్‌కూ తప్పని వివక్ష!
దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా దళిత సమాజానికి చెందినవారు. ఆయన కూడా కుల వివక్ష నుండి తప్పించుకోలేకపోయారు. 2017లో రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఒడిశాలోని జగన్నాథ ఆలయం సందర్శించారు. ఆలయంలోని పండితులు ఆయనను లోపలికి అనుమతించకుండా దర్శనాన్ని అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికే ఈ విధమైన అవమానం జరగడం, దేశంలో కుల వివక్ష ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టంగా తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత స్థాయిలో ఉన్నా, కుల మూలాలు ఆధిపత్య వర్గాల దురహంకారానికి లక్ష్యంగా మారుతాయని ఈ సంఘటన నిరూపించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరిగితే ఇప్పటివరకు దేశంలోని ముఖ్యమంత్రులు, కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందించలేదంటే వారి కులహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేకమంది ప్రముఖులు ఉన్నారు. ఎంతమంది నోరు విప్పారో గమనించాలి.

న్యాయవ్యవస్థపై దాడి: తెలంగాణ జడ్జీల సంఘం ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై బహిరంగ కోర్టులో జరిగిన దాడిని తెలంగాణ జడ్జీల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు జి. రాజగోపాల్, ప్రధాన కార్యదర్శి కె. మురళీమోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే అది యావత్ భారత న్యాయవ్యవస్థపైనే దాడి చేసినట్టుగా భావించాలని వారు పేర్కొన్నారు.