- 6న సుప్రీంలో… 8న హైకోర్టులో విచారణలు
- 50 శాతానికి మించొద్దన్న నిబంధనపై ఉత్కంఠ
- న్యాయస్థానాల తీర్పుపైనే బీసీల భవితవ్యం
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది. షెడ్యూల్ విడుదలై ఎన్నికల నగారా మోగిన తరుణంలో అత్యున్నత న్యాయస్థానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
50 శాతం పరిమితి దాటుతుందా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం రిజర్వేషన్ల పరిమితిని 50 శాతానికి పైగా మించుతుందని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఐదు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ ఈ రిజర్వేషన్ల వివాదం ఎన్నికల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
గవర్నర్ వద్ద పెండింగ్‌లో చట్టం…
బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్‌లో ఉండటం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది. అసెంబ్లీ తీర్మానంపై గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం రాకముందే ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై కూడా న్యాయపరమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విడుదల చేసిన జీవో చెల్లదనే వాదన వినిపిస్తోంది. ఈ అంశంపై హైకోర్టు కూడా గతంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు కొంత సమయం ఆగాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లి షెడ్యూల్‌ను విడుదల చేసింది.
హైకోర్టులోనూ విచారణ…
ఒకవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా… మరోవైపు బీసీ రిజర్వేషన్లపై మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సైతం ఈనెల 8వ తేదీన తిరిగి విచారణ జరపనుంది. జీవో నంబర్ 9 ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై న్యాయస్థానాలు ఏం చెప్పబోతున్నాయనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ జీవో అమలుకు కోర్టులు పచ్చజెండా ఊపుతాయా లేక బ్రేకులు వేస్తాయా అనే ఉత్కంఠ ఆశావహుల్లో… రాజకీయ వర్గాల్లో నెలకొంది. సుప్రీంకోర్టులో విచారణకు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సస్పెన్స్ మరింత పెరిగింది. రిజర్వేషన్ల అంశం తేలేదాకా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఆందోళన రాజకీయ ఉత్కంఠను పెంచుతోంది.