దేశదేశాన ‘జెన్ జెడ్’ ప్రభంజనం – ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది

  • నేపాల్… మొరాకో… మడగాస్కర్… పెరూ
  • ఇలా అంతర్జాతీయ వీధుల్లోకి యువత
  • ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటివే ఆయుధాలు
  • సోషల్ మీడియా నుంచి వీధుల్లోకి ఉద్యమం
  • అవినీతి… అక్రమాలపై నినదిస్తున్న గొంతులు
  • మొరాకోలో ప్రపంచ కప్ కోసం వేల కోట్లు…
  • కానీ ఆసుపత్రుల్లో స్త్రీల మరణం మృదంగం
  • దీనిపై గొంతెత్తుతున్న జెన్ జెడ్ యూత్

సహనం వందే, న్యూఢిల్లీ:
మొరాకో… మడగాస్కర్… పెరూ… నేపాల్… ఈ పేర్లు ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయి. దేశ దేశాలకు జెన్ జెడ్ ఉద్యమం ప్రభంజనంలా వ్యాపిస్తుంది. జెన్ జెడ్ తరం సామాజిక మాధ్యమాల నుంచి వీధుల్లోకి దిగి అధికార పీఠాలను కుదిపేస్తోంది. అవినీతి, అసమానతలు, అణచివేతలపై ఈ తరం గట్టిగా నినదిస్తుంది. మొరాకోలో జెడ్212 ఉద్యమం విద్య, వైద్య వ్యవస్థల్లోని దయనీయ దుస్థితిని బయటపెట్టింది. ఒకవైపు 2030 ప్రపంచ కప్ కోసం వేల కోట్లు ధారపోస్తూ… మరోవైపు ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీల మరణాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఏ రకమైన పాలన అని జెన్ జెడ్ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వాధినేతల రాజీనామా డిమాండ్‌తో వీధుల్లోకి దిగింది. ప్రభుత్వ దమనకాండలో ముగ్గురు మరణించినా ఈ ఆగ్రహం చల్లారలేదు.

మడగాస్కర్ లో విద్యుత్ కోతలపై వీధుల్లోకి…
ఆఫ్రికాలోని అత్యంత నిరుపేద దేశాల్లో ఒకటైన మడగాస్కర్‌లో నీటి కొరత, విద్యుత్ కోతలపై యువత చేస్తున్న తిరుగుబాటును అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా హింసతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 2009లో అధికారంలోకి వచ్చిన ఆయన ప్రజల ఆక్రోశాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఐక్యరాష్ట్ర సమితి లెక్కల ప్రకారం ఈ దమనకాండలో 22 మంది మరణించగా…100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఖ్యలను ప్రభుత్వం నిస్సిగ్గుగా ఖండిస్తున్నప్పటికీ… అధ్యక్షుడు రాజీనామా చేయాలనే యువత డిమాండ్ అగ్నిలా రాజుకుంటోంది. ప్రజల కష్టాలను విన్నానని అధ్యక్షుడు చెబుతున్న మాటలు కేవలం అధికార దాహాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలా కనిపిస్తున్నాయి.

పెరూ ప్రజాస్వామ్యంపై అవినీతి మచ్చ…
పెరూలో అధ్యక్షురాలు దీనా బోలువార్టె నాయకత్వం ప్రజాస్వామ్యం అనే పదానికి మాయని మచ్చ తెచ్చింది. ఈ ప్రభుత్వం అవినీతి, నేరాలు, ఆర్థిక అస్థిరతలతో కునారిల్లుతోంది. 2022లో ఆమె అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరసనకారుల హత్యలు, దమనకాండలు నిత్యకృత్యమైపోయాయి. కొత్త పెన్షన్ చట్ట సంస్కరణలు యువతను వీధుల్లోకి నెట్టాయి. అవినీతి, నేరాలపై ఆగ్రహజ్వాలలు సమగ్ర తిరుగుబాటుగా మారింది. ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న ఈ పాలన నిజానికి కేవలం అవినీతి అక్రమాలకు అద్దం పడుతోంది.

నేపాల్ నుంచి ప్రపంచానికి పాఠం…
నేపాల్‌లో జెడ్ తరం మొదట సామాజిక మాధ్యమ నిషేధంపై నిరసనతో ప్రారంభించిన ఉద్యమం అసాధారణ రీతిలో ఒక రాజకీయ విప్లవంగా పరిణమించింది. కేవలం 48 గంటల్లోనే ప్రధానమంత్రిని గద్దె దించి ఏకంగా పార్లమెంట్‌ను దహనం చేసిన ఈ యువత శక్తి ప్రపంచ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాసింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, శ్రీలంకలో రాజపక్సే వంశాన్ని యువత కూలదోసిన ఘటనలు ఈ తరం ఎంత శక్తివంతమైనదో చాటుతున్నాయి. అవినీతి, ఆర్థిక సంక్షోభం, అణచివేతలపై ఈ తిరుగుబాటు పాత తరం అధికార వర్గాలకు గట్టి హెచ్చరిక.

డిజిటల్ యుద్ధం… సరిహద్దులు దాటిన తరం
జెడ్ తరం పూర్తిగా డిజిటల్ యుగంలో జన్మించింది. అందుకే ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, డిస్కార్డ్, టెలిగ్రామ్ వంటి వేదికలు వీరికి ఆయుధాలుగా మారాయి. మొరాకోలో జెడ్212 డిస్కార్డ్ సర్వర్ కొద్ది రోజుల్లోనే 1.3 లక్షల మందికి విస్తరించడం డిజిటల్ శక్తికి నిదర్శనం. ఈ డిజిటల్ సాధనాలు నిరసనలను ఏ ఒక్క నాయకత్వం లేకుండా వికేంద్రీకృతంగా నడిపిస్తున్నాయి. అందుకే అధికారులు ఈ ఉద్యమాలను అణచివేయలేక చేతులెత్తేస్తున్నారు. మడగాస్కర్‌లో జెడ్ మడా ఉద్యమం సాంప్రదాయ సంఘాలతో కలిసిపోయి అధికార వర్గాలకు సవాల్ విసిరింది. ఈ డిజిటల్ శక్తి యువతను ప్రపంచ సరిహద్దులు దాటి ఒక్కటి చేస్తోంది. జెన్ జెడ్ తరం తిరుగుబాటు కేవలం నిరసన కాదు… అది ప్రపంచ రాజకీయాల్లో కొత్త శకానికి నాంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *