- అందుకే థైరాయిడ్ వచ్చే అవకాశం ఎక్కువ
- బీపీ ఉందని ఉప్పు మానేయడం తప్పు…
- ఉప్పు మితం… ఆరోగ్యం హితం
- ‘బిజినెస్ స్టాండర్డ్’ ప్రత్యేక కథనం
సహనం వందే, న్యూఢిల్లీ:
పప్పు… పచ్చళ్ల నుంచి నూడుల్స్… చాట్ వరకూ మన దైనందిన ఆహారంలో ఉప్పు దాగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు వినియోగం మన గుండె, కిడ్నీలను తీవ్రంగా దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేసిన పరిమాణం కంటే భారతీయులు ఏకంగా రెట్టింపు ఉప్పు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అలవాటును వెంటనే మార్చుకోవడం అత్యవసరం.
ఉప్పు ఎక్కువైతే ప్రాణాలకు చేటు…
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం… రోజుకు కేవలం 5 గ్రాముల ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అయితే 2023 జాతీయ ఎన్‌సీడీ సర్వే నివేదికల ప్రకారం… మన దేశంలో పురుషులు సగటున 8.9 గ్రాములు, మహిళలు 7.1 గ్రాములు తీసుకుంటున్నారు. పరిమితికి మించిన ఉప్పు కేవలం రక్తపోటుకే కాకుండా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, శరీరంలో నీటి నిల్వ, కడుపు క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని అమాంతం పెంచుతుంది.
పింక్ ఉప్పు ఫ్యాషన్… అయోడిన్ లోపం
రాక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్‌లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని… అవి సహజమైనవని చాలామంది నమ్మకం. కానీ వాస్తవం ఏమిటంటే… అన్ని రకాల ఉప్పులూ ప్రధానంగా సోడియం క్లోరైడ్‌తోనే తయారవుతాయి. ఈ ఫ్యాన్సీ ఉప్పుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడేంత పరిమాణంలో ఉండవు. దీనికితోడు ఈ ఉప్పుల్లో అయోడిన్ పూర్తిగా లేకపోవడం వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే అయోడిన్ కలిగిన సాధారణ ఉప్పే రోజువారీ వినియోగానికి అత్యుత్తమమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దాగి ఉన్న ఉప్పుతో దాడి…
మనం వంటలో వేసే ఉప్పు మాత్రమే కాదు పచ్చళ్లు, పప్పులు, చాట్, నూడుల్స్, బిస్కెట్లు వంటి రెడీ టు ఈట్ ఫుడ్స్, రెస్టారెంట్లలో లభించే వంటకాల్లోనూ ఉప్పు పెద్దమొత్తంలో దాగి ఉంటుంది. ఈ దాగి ఉన్న ఉప్పు మన రోజువారీ సోడియం వినియోగాన్ని గణనీయంగా పెంచుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, ఊబకాయం వంటి రుగ్మతలను నివారించుకోవచ్చు.
అయోడిన్ తప్పనిసరి…
అయోడిన్ ఉప్పు కేవలం పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు మాత్రమే అవసరమనే అపోహ ఉంది. కానీ థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి అయోడిన్ ప్రతి ఒక్కరికీ అత్యవసరం. దీని లోపం వల్ల గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ రోజువారీ వంటలో అయోడిన్ కలిగిన ఉప్పును వాడడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాక అధిక ఉప్పు సమస్య వృద్ధులకే అనుకుంటే పొరపాటే. యువతలోనూ అధిక ఉప్పు కారణంగా రక్తపోటు, కడుపు క్యాన్సర్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఈ అలవాటును అదుపులో ఉంచుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.
బీపీ ఉందని ఉప్పు మానేయడం తప్పు…
రక్తపోటు ఉన్నవారు ఉప్పును పూర్తిగా మానేయాలని భావించడం సరికాదు. సోడియం నరాల పనితీరు, కండరాల కదలికలు, శరీరంలో నీటి సమతుల్యతకు చాలా అవసరం. అందుకే ఉప్పును పూర్తిగా మానడం కంటే రోజుకు 2.5 గ్రాములకు తగ్గించడం ఉత్తమమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. తక్కువ ఉప్పుతో కూడిన సమతుల్య జీవనశైలితో రక్తపోటును సమర్థవంతంగా అదుపులో ఉంచవచ్చు. తీవ్రమైన వ్యాయామం, వేడి వాతావరణంలో తప్ప సాధారణ సందర్భాల్లో చెమట పట్టినా శరీరం సోడియం సమతుల్యతను దానంతటదే సరిచేసుకుంటుంది. తక్కువ ఉప్పుతో కూడిన సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చు.