- సొంత ప్రభుత్వంలోనూ అవమానమని ఫైర్
- మంత్రి కందుల దుర్గేష్ ను నిలదీశానని వెల్లడి
- జగన్ సైకోగాడు అంటూ ఆగ్రహవేశాలు
- ఏపీ అసెంబ్లీని కుదిపేసిన బాలకృష్ణ కామెంట్స్
- చిరంజీవి సహా అందరినీ ఇరికించిన బాలయ్య
- సొంత కూటమి ప్రభుత్వాన్నీ ఉతికి ఆరేశారు
- తండ్రి పార్టీలో అందరూ అనుభవించే వారేనా?
- తనకు ఎలాంటి పదవి లేకపోవడంపై ఆవేదన!
సహనం వందే, అమరావతి:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే బాలయ్య బాబు విశ్వరూపం చూపించారు. అఖండ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. సొంత ప్రభుత్వం పైనా… మాజీ సీఎం జగన్ పైనా చెలరేగిపోయారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవినీ ఇరికించేశారు. రాజకీయంగా సొంత పార్టీనీ… పెద్దలను చెడుగుడు ఆడుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని సైకోగాడు అంటూ చేసిన తీవ్ర వ్యాఖ్యలు సభను స్తంభింపజేశాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు జగన్‌ను కలిసిన వివాదాస్పద అంశంపై మాటల యుద్ధం రాజుకోవడంతో రాష్ట్ర రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. బాలకృష్ణ వ్యాఖ్యలు, దీనిపై వచ్చిన కౌంటర్లు, మెగాస్టార్ చిరంజీవి వివరణ మొత్తం వ్యవహారాన్ని గందరగోళంలోకి నెట్టాయి.

జగన్ తో ఒకే భేటీ.. మూడు వాదనలు
గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో జగన్‌ను కలిసిన అంశంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ… జగన్ ముందు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, చిరంజీవి పట్టుబట్టడంతోనే దిగివచ్చారని వాదించారు. అయితే బాలకృష్ణ ఈ వాదనను ఖండించారు. చిరంజీవి పట్టుబట్టలేదని… జగన్ కావాలనే ఆయనను అవమానించారని ఆరోపించారు.
తనకు ఆహ్వానం వచ్చినా అందుకే వెళ్లలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఈ దశలో చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. తాను జగన్ ఆహ్వానం మేరకే వెళ్లానని, సాదరంగా స్వీకరించి పరిశ్రమ సమస్యలు పరిష్కరించారని చిరంజీవి వివరించారు. ఈ వ్యవహారంలో బాలకృష్ణ, కామినేని, చిరంజీవి చెప్పిన విషయాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జగన్-సినీ ప్రముఖుల భేటీ వెనుక అసలు కథ ఏమిటి అనే ప్రశ్న ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
జగన్ పై వ్యక్తిగత దాడి…
బాలకృష్ణ నేరుగా జగన్‌ను సైకోగాడు అని సంబోధించడంతో అసెంబ్లీ రచ్చ రచ్చ అయ్యింది. కామినేని చెప్పిన వివరాలు అబద్ధమంటూ… జగన్ వ్యవహారశైలి సినీ పరిశ్రమను పూర్తిగా అవమానించిందని బాలకృష్ణ తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. దీనికి వైసిపి నేత అంబటి రాంబాబు అంతే దూకుడుగా కౌంటర్ ఇచ్చారు. ప్రపంచంలోని అతిపెద్ద సైకో బాలకృష్ణేనని, అవసరమైతే అందుకు సర్టిఫికెట్ కూడా ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యక్తిగత దాడి రాజకీయాలను ఉద్రిక్తం చేసింది.
సొంత ప్రభుత్వంపైనా బాలయ్య ఫైర్…
బాలకృష్ణ కోపం కేవలం వైసీపీనే కాదు… ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపైనా ఉంది. పనిలో పనిగా సొంత ప్రభుత్వాన్ని కూడా ఉతికి ఆరేశారు. జనసేన మంత్రి కందుల దుర్గేష్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కమిటీలో తనది 9వ పేరుగా ప్రచురించారని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జాబితా ఎవరు తయారు చేశారో (?) తనకు తెలుసని, కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కందుల దుర్గేష్‌కు ఫోన్ చేసి నిలదీసినట్లు కూడా వెల్లడించారు. ఈ ఘటన తెలుగుదేశం పార్టీలో అంతర్గత ఉద్రిక్తతలను బయటపెట్టింది.
ఒకవైపు మాజీ ముఖ్యమంత్రిపై మాటల దాడి… మరోవైపు సొంత బావ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న అధికార కూటమిలోనే అవమానం జరిగిందని ఆయన భావిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలను ఎవరినీ ఆయన వదిలిపెట్టలేదు. దీంతో చంద్రబాబు తలపట్టుకోవాల్సి వచ్చింది. అధికార కూటమిలో బాలకృష్ణ రూపంలో అసమ్మతి బయటపడిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన తండ్రి స్థాపించిన టీడీపీ ప్రభుత్వంలో అందరూ అధికారాన్ని అనుభవిస్తున్నారని… తను మాత్రం కేవలం ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సి వస్తుందని ఆయన మధనపడుతున్నట్లు బాలయ్య సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.