- మోడీ ప్రతిష్టతో తయారు చేసిన యాపిల్
- ఆ ఫోన్ల కోసం ఎగబడుతున్న హిందువులు
- దేశంలో పలుచోట్ల బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు
- అసలు ధర కంటే రూ. 25 వేలు అధికం
- అధికారికంగా కొనాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే
సహనం వందే, న్యూఢిల్లీ:
కాషాయ రంగుతో యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 17 ప్రో ఇప్పుడు దేశంలో రాజకీయ రంగు పులుముకుంది. ఇది హిందువుల కోసమే తయారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీనిని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ ఘనతగా ప్రచారం చేస్తున్నారు. మోడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకునే యాపిల్ ఈ ఫోనును తీసుకొచ్చిందని ప్రకటించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక మొబైల్ ఫోన్ రంగును రాజకీయ ప్రచారంగా మార్చేశారని విమర్శకులు మండిపడుతున్నారు. మోడీ మహిమ కారణంగా ఈ రంగుకు ఊహించని డిమాండ్ వచ్చిందని బీజేపీ నేతలు మురిసిపోతున్నారు.

బ్లాక్ మార్కెట్లో డీలర్ల దందా…
మోడీ మహిమ ప్రభావమో లేక పండగ సీజన్ డిమాండో కానీ భగవ (కాషాయ) రంగు ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడింది. స్టాక్ లేదంటూ చెబుతున్న డీలర్లు… కస్టమర్లు ఎక్కువ డబ్బు చెల్లిస్తే వెంటనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నోయిడా మార్కెట్లో ఒక డీలర్ ఏకంగా బ్లాక్ మార్కెట్లో అసలు ధర కంటే 25 వేల రూపాయలు అధికంగా తీసుకుంటున్నాడు. ఢిల్లీలోని లజ్‌పత్ నగర్, కరోల్ బాగ్, గఫర్ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. అధిక ధరను నగదు రూపంలో మాత్రమే చెల్లించాలని డీలర్లు పట్టుబడుతున్నారు.
ఇండియన్ మార్కెట్ పై యాపిల్ కన్ను…
ఈ కాషాయ రంగు మోడల్‌కు ఉన్న డిమాండ్‌ను యాపిల్ ఇండియా వెబ్‌సైట్ కూడా ధృవీకరిస్తోంది. ఇతర రంగుల మోడళ్లు అక్టోబర్ రెండో వారంలోనే డెలివరీ అవుతున్నా... కాషాయ రంగు మోడల్‌కు మాత్రం అక్టోబర్ మూడో వారం వరకు డెలివరీ లేదు. ఈ ఆలస్యాన్ని కూడా బీజేపీ నేతలు మోడీ మహిమ అంటూ రాజకీయంగా లింక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే యాపిల్ కంపెనీ ఈ రంగును తమ బోల్డ్ డిజైన్‌లో భాగంగానే తీసుకువచ్చింది తప్ప దీనికి రాజకీయాలకు సంబంధం లేదని చెబుతోంది. అయినప్పటికీ పండగల సీజన్‌లో భగవ ఐఫోన్‌ను చేతిలో పట్టుకొని తిరగాలని హిందూ కస్టమర్లు పడుతున్న తహతహను డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది బీజేపీకి రాజకీయంగా మరింత ఊతం ఇస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా ఇంత పెద్ద దేశంలో కాషాయపు రంగుకున్న మార్కెట్ ను యాపిల్ కంపెనీ సొమ్ము చేసుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి.