- యువతి యువకుల్లో హర్షాతిరేకాలు
- గతంలో నేరస్తులను గుర్తించేందుకు టాటూలు
- అందుకే 1992లో నిషేధించిన సుప్రీంకోర్టు
- డాక్టర్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన సర్కార్
- కొత్త చట్టంతో ఏర్పాటు కానున్న స్టూడియోలు
సహనం వందే, సియోల్:
కొత్త చట్టంతో దక్షిణ కొరియాలో ఇక టాటూ కళకు స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటివరకు చీకటి గదుల్లో రహస్యంగా పనిచేసిన టాటూ కళాకారులకు మంచి రోజులు వచ్చాయి. జాతీయ అసెంబ్లీ టాటూ కళను చట్టబద్ధం చేస్తూ చారిత్రక బిల్లును గురువారం ఆమోదించింది. ఈ చట్టం దక్షిణ కొరియా సమాజంలో టాటూలపై ఉన్న అపోహలను తొలగించి కళగా గుర్తించే దిశగా వేసిన అతిపెద్ద అడుగు.

కళాకారుల జీవితాల్లో వెలుగు…
దక్షిణ కొరియాలో టాటూలు వేయడం ఎప్పటి నుంచో నిషేధం. గతంలో ప్రముఖ రాపర్ జే పార్క్ వంటివారు కూడా తమ టాటూలను టీవీలో చూపించడానికి కప్పుకోవాల్సి వచ్చేది. 1992 నాటి అక్కడి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం… టాటూ వేయడం వైద్య ప్రక్రియగా పరిగణించింది. కేవలం డాక్టర్లకు మాత్రమే టాటూ వేయడానికి అనుమతి ఉండేది.
ఈ నిబంధనను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్ష కూడా పడేవి. ఈ నిషేధం ఉన్నప్పటికీ దేశంలో చాటుమాటుగా టాటూ పరిశ్రమ విపరీతంగా వృద్ధి చెందింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం సుమారు మూడున్నర లక్షల మంది కళాకారులు రహస్యంగా పనిచేస్తుండగా… కోటి మందికి పైగా టాటూ వేయించుకున్నారు.
లైసెన్సుతో లభించే గౌరవం…
కొత్త చట్టం అమలులోకి వస్తే టాటూ కళాకారులు ఇకపై ప్రభుత్వ ఆమోదిత లైసెన్స్ పొంది బహిరంగంగా పనిచేయవచ్చు. వారి స్టూడియోలు కూడా కొత్త పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. సియోల్‌లో టాటూ పార్లర్‌ను నడుపుతున్న హియో జున్-హో వంటి కళాకారులు ఈ మార్పు పట్ల ఉత్సాహంగా ఉన్నారు. ‘ఇప్పుడు మేము మా వృత్తిపై గర్వపడవచ్చు. హెయిర్ సెలూన్ల మాదిరిగా పెద్ద కిటికీలున్న స్టూడియోల్లో ధైర్యంగా పని చేయవచ్చు’ అని పేర్కొన్నారు.
నిషేధానికి చారిత్రక మూలాలు…
దక్షిణ కొరియాలో టాటూలపై నిషేధానికి చారిత్రక మూలాలు ఉన్నాయి. పూర్వకాలంలో నేరస్థులను, బానిసలను గుర్తించడానికి వారి ముఖాలు, చేతులపై బలవంతంగా టాటూలు వేసేవారు. 20వ శతాబ్దంలో ఇవి నేర సమూహాలకు, గుండాల సంస్కృతికి చిహ్నంగా మారాయి. ఈ చారిత్రక నేపథ్యమే టాటూలు సమాజంలో చులకనగా మారడానికి కారణమైంది. అయితే నిషేధం ఉన్నప్పటికీ యువతలో టాటూలు ఫ్యాషన్ స్టేటస్ గా మారాయి. ఈ కొత్త చట్టం ఆ పాత అపోహలను తొలగించనుంది.
వైద్య వర్గాల ఆందోళన…
కొత్త బిల్లును కొందరు ప్రజా ప్రతినిధులు, వైద్యులు వ్యతిరేకించారు. టాటూ చేయడం అపరిశుభ్రం, అనారోగ్యకరమని వారు వాదించారు. కానీ వారి విమర్శలు కొత్త చట్టాన్ని అడ్డుకోలేకపోయాయి. 2022 ఎన్నికల్లోనే రాష్ట్రపతి లీ జే మ్యుంగ్ టాటూలను చట్టబద్ధం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఏడాది ప్రత్యేక ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయన ఆ దిశగా అడుగులు వేశారు. ఆరోగ్యమంత్రి కూడా ఈ బిల్లుకు మద్దతు పలికారు. దక్షిణ కొరియా యువతలో ఇప్పటికే ఒక సాంస్కృతిక వ్యక్తీకరణగా మారిన ఈ సంస్కృతిని ఈ చట్టం మరింత బలపరుస్తుంది.