సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

  • ఆయనపై దయ చూపిన కెనరా, ఎస్ బీఐలు
  • రాజకీయ అక్రమార్కులకు అండగా బ్యాంకులు
  • జనం సొమ్ము మాఫీ చేయడానికి సిగ్గు లేదా?
  • మండిపడుతున్న సాధారణ ప్రజానీకం

సహనం వందే, హైదరాబాద్:
సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో దాదాపు రూ.5,700 కోట్లు మాఫీ చేయించుకోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది కేవలం ఒక వ్యాపార లావాదేవీ కాదు. రాజకీయ పలుకుబడితో ప్రజల కష్టార్జితాన్ని బహిరంగంగా లూటీ చేయడమేనని మేధావులు మండిపడుతున్నారు.

దివాలా ప్రక్రియలో బ్యాంకుల అపహాస్యం…
సుబ్బిరామిరెడ్డి గాయత్రి కంపెనీ తీసుకున్న భారీ రుణాలను తిరిగి చెల్లించలేక దివాలా ప్రక్రియలోకి వెళ్లడంతో బ్యాంకులు జాతీయ కంపెనీల చట్ట ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకులు నిస్సహాయంగా వ్యవహరించి రుణగ్రహీత కుటుంబానికే వన్ టైం సెటిల్‌మెంట్ (ఓటీఎస్) ఆఫర్ చేయడం విడ్డూరం. కేవలం రూ. 2,400 కోట్లు చెల్లిస్తే… మిగతా రూ.5,700 కోట్లు మాఫీ చేస్తామని బ్యాంకులు బేరం కుదుర్చుకున్నాయి. ఆ కంపెనీకి వచ్చిన లాభాలు ఎక్కడికి పోయాయో తెలుసుకోకుండానే ఈ మాఫీ చేయడం అవినీతికి నిలువుటద్దం. ఈ పెద్ద లావాదేవీలో ఎన్ని వందల కోట్లు పక్కదారి పట్టాయో అంతుబట్టడం లేదు.

సుబ్బిరామిరెడ్డిపై దయ చూపిన బ్యాంకులివే…
గాయత్రి ప్రాజెక్ట్స్ రుణాల్లో ఎక్కువగా కెనరా బ్యాంక్ కు చెందినవే. ఆ బ్యాంకే ఏకంగా రూ. 1,911 కోట్లుగా సుబ్బిరామిరెడ్డికి అప్పులు ఇచ్చింది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 1,382 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ కన్సార్టియంలో తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సుమారు రూ. 300 కోట్లు వరకు ఇచ్చింది.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రూ. 400 కోట్లు ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రూ. 400 కోట్లు ఇచ్చింది. మొత్తం క్లెయిమ్స్ రూ. 7,947 కోట్లు దాఖలయ్యాయి. ఇందులో బ్యాంక్ గ్యారంటీలు రూ. 3,000 కోట్లకు పైగా ఉన్నాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ధరల పెరుగుదల కారణంగా డిఫాల్ట్ జరిగిందని నిర్ధారించారు.

మాఫీ వెనుక రాజకీయ పలుకుబడి..‌.
జల్సాకు పెట్టింది పేరు సుబ్బరామిరెడ్డి కుటుంబం. బ్యాంకుల వద్ద అప్పులు తీసుకున్న డబ్బులతో వ్యాపారం చేసి బాగానే వెనకేసుకుని ఉంటారు. ఆ డబ్బులు రూ. 2400 కోట్లు కట్టేసి మళ్లీ తన కంపెనీని తానే ఉంచుకుంటారు. అంటే ఐదు వేల కోట్లకుపైగా అప్పనంగా బ్యాంకులకు ఎగ్గొట్టేస్తున్నారు. ఒక రాజకీయ కుటుంబం వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయించుకోవడం సాధారణ వ్యాపార లావాదేవీ కాదు. ఇది రాజకీయ నాయకులకు మాత్రమే దక్కే అరుదైన అవకాశం.

కార్పొరేట్ రుణాల మాఫీ ఒక అంటువ్యాధి…
సుబ్బరామిరెడ్డి కుటుంబానికి జరిగిన ఈ మాఫీ ఒక్కటే కాదు. ఇది రాజకీయ కుటుంబాల రుణ మాఫీల పరంపరలో భాగం. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ కుటుంబ కంపెనీకి, మహారాష్ట్రలో శరద్ పవార్ కుటుంబానికి చెందిన చక్కెర కర్మాగారాలకు, గుజరాత్‌లో భారతీయ జనతా పార్టీ నేతలకు చెందిన మౌలిక సదుపాయాల కంపెనీలకు కూడా వేల కోట్ల రూపాయల రుణ మాఫీలు జరిగాయి. కేంద్రంలో రూ. 10 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణ మాఫీలు జరిగాయి. వీటిలో రాజకీయ కుటుంబాలు కీలక పాత్ర పోషించాయి. ఈ మాఫీలు ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు గండి కొట్టి, దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *