దీపికా ఓపిక లేదిక – దీపికా పదుకొనె వ్యవహారంపై అసహనం

  • తట్టుకోలేక బయటకు నెట్టేసిన నిర్మాతలు
  • టాప్ హీరోయిన్ కు భారీ ప్రాజెక్టుల ఝలక్
  • కల్కి 2898 ఏడీ, స్పిరిట్ ల నుంచి ఔట్
  • రెమ్యూనరేషన్… లాభాల్లో వాటానే కారణం
  • ఇంకా నోరు విప్పని బాలీవుడ్ హీరోయిన్…

సహనం వందే, హైదరాబాద్:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కెరీర్ ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె భారీ చిత్రాలను వదిలేసుకుంటున్నారని వార్తలు వినిపించాయి‌. కానీ దాని వెనుక సినిమా వర్గాల అసహనం, ఆమె అతి డిమాండ్లే కారణమని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కల్కి 2898 ఏడీ, స్పిరిట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. గత ఏడాది భారీ విజయాలతో దూసుకెళ్లిన దీపిక, ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాలు ఆమె కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేలా చేశాయి. సినిమా రంగంలో నిబద్ధత ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి.

రెమ్యునరేషన్ వివాదాలు… పబ్లిక్ లీకులు
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ చిత్రం నుంచి దీపికా పక్కకు తప్పుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. దీని వెనుక రెమ్యునరేషన్ వంటి అంశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఒక నటిని ఉద్దేశించి డర్టీ పీఆర్, సినిమా కథను లీక్ చేయడం వంటి ఆరోపణలు చేయడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరింది. తృప్తి డిమ్రీని ఆమె స్థానంలో తీసుకోవడంతో ఈ సమస్యకు తాత్కాలికంగా తెరపడినా, ఇండస్ట్రీలో వర్కింగ్ కండిషన్స్ గురించి తీవ్ర చర్చకు దారితీసింది.

కల్కి సీక్వెల్ నుంచి తప్పించిన వైజయంతి మూవీస్…
సందీప్ వంగా వివాదం చల్లారకముందే కల్కి 2898 ఏడీ నిర్మాతలు వైజయంతి మూవీస్ ఆమెపై మరో బాంబు వేశారు. కల్కి ఆస్థానిక్ భాగం నుంచి దీపికను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారీ చిత్రాలకు పూర్తి నిబద్ధత అవసరమని, అది దీపికలో లోపించిందని నిర్మాతలు పరోక్షంగా వ్యాఖ్యానించారు. తొలి భాగంలో కల్కి తల్లి సుమతిగా ఆమె పోషించిన కీలక పాత్ర సినిమా విజయంలో భాగమైనప్పటికీ రెండో భాగంలో ఆమె లేకపోవడం సినిమాపై ప్రభావం చూపుతుందని నిర్మాతలు అంగీకరించారు. ఈ నిర్ణయం దీపికా అతి డిమాండ్లకు టాలీవుడ్ నిర్మాతలు స్పందించిన తీరుకు అద్దం పడుతోంది.

గొంతెమ్మ కోరికల పర్వం…
దీపికను ప్రాజెక్టుల నుంచి తొలగించడానికి ప్రధాన కారణం ఆమె పెడుతున్న అధిక డిమాండ్లేనని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సినిమాలో రెమ్యునరేషన్‌ 50 శాతం లాభాల వాటాతో పాటు, డిజిటల్, సాటిలైట్ హక్కుల్లో కూడా భాగస్వామ్యం కోరడం, రోజుకు కేవలం 5 గంటలు మాత్రమే పని చేస్తానని చెప్పడం, తనతో పాటు వచ్చే సిబ్బందికి రాయల్ ట్రీట్మెంట్‌తో పాటు వారి ఖర్చులు కూడా భరించాలని కండిషన్ పెట్టడం వంటివి నిర్మాతలు భరించలేకపోయారని సమాచారం. ఈ డిమాండ్ల కారణంగానే సందీప్ వంగా ఆమెను స్పిరిట్ సినిమా నుంచి తప్పించగా, ఇప్పుడు కల్కి 2 నుంచి కూడా ఆమెను తొలగించారు. ఈ వివాదంపై ఇప్పటివరకు దీపికా మౌనంగా ఉన్నప్పటికీ ఆమె నోరు విప్పితే ఇండస్ట్రీలో బడా స్టార్ల రహస్యాలు బయటపడే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *