- ఓజీ సినిమా అంచనాలు అసాధారణం
- అభిమానుల కోలాహలంతో ప్రీ రిలీజ్ వేడుక
- ఉర్రూతలూగించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
సహనం వందే, హైదరాబాద్:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా సినీ లోకం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై మొదట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలైన ప్రతీ అప్డేట్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచింది. ఓజీలో ఓజాస్ గంభీరంగా గర్జించనున్నారని చెబుతున్న పవన్, ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి స్టార్ క్యాస్ట్‌తో రాబోతున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. భారతీయ సినీ రంగంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటిగా నిలిచింది. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అభిమానుల కోలాహలం మధ్య ప్రీ రిలీజ్ వేడుక
సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో ఆదివారం ఓజీ ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించారు. అభిమానుల కోలాహలం, డప్పుల మోత, జెండాలు, ఫ్లెక్సీలతో స్టేడియం కిక్కిరిసిపోయింది. చిత్ర బృందంతోపాటు సినీ ప్రముఖులంతా హాజరై సినిమా విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. సంగీత దర్శకుడు తమన్ తన టీమ్‌తో అద్భుతమైన లైవ్ మ్యూజిక్ షో ఇచ్చారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం తాను పాడిన ‘వాషి యో వాషి’ పాటను లైవ్‌లో పాడటం అందరినీ ఆకట్టుకుంది. అదే సమయంలో విడుదలైన ఓజీ ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసింది. అద్భుతమైన విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, పవన్ కళ్యాణ్ డైలాగ్స్ తో నిండిన ట్రైలర్ చూసి అభిమానుల హర్షధ్వానాలు మిన్నంటాయి.
పవన్ మాటల్లో ఓజీ మాయాలోకం…
వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… సాధారణంగా సినిమా కాస్ట్యూమ్స్ తో తాను ఇలాంటి వేడుకలకు హాజరుకాను కానీ దర్శకుడు సుజీత్ కోరికపై ఈసారి వచ్చానని చెప్పారు. ‘వాషి యో వాషి’ పాట గురించి వివరిస్తూ… ఇది జపనీస్ హైకూ అని, విలన్‌కు హీరో ఒక భయానక మరణాన్ని పరిచయం చేసే సందర్భంలో ఈ పాట వస్తుందని చెప్పారు. ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీతో కలిసి నటించడం తనకు ఆనందంగా ఉందని, ఆయన అద్భుతమైన నటుడని కొనియాడారు. ‘సుజీత్ నా వీరాభిమాని, సినిమా మీద పిచ్చితో ఈ స్థాయికి వచ్చాడ’ని చెప్పారు. సుజీత్ గురించి త్రివిక్రమ్ తనకు చెప్పారని, కథ చెప్పేటప్పుడు సింపుల్‌గా చెప్పినా, సినిమా తీసేటప్పుడు అతని సత్తా ఏంటో తెలిసిందని పవన్ ప్రశంసించారు. తమన్, సుజీత్ ఇద్దరూ ఈ సినిమా కోసం పిచ్చిగా పనిచేశారని, తమ మాయలోకి తనను కూడా తీసుకెళ్లారని పవన్ వ్యాఖ్యానించారు.