- యూరియా లేక రోడ్డెక్కుతున్న అన్నదాతలు
సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియాను అందించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా, రైతులు నెలరోజులుగా యూరియా కోసం రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి బీజేపీ నాయకులు సృష్టిస్తున్న తప్పుడు ప్రచారమే కారణమని ఆరోపించారు. కృత్రిమ కొరత పేరుతో బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇప్పటికైనా రాష్ట్రానికి కావాల్సిన యూరియాను తెప్పించడానికి బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలబడాలని డిమాండ్ చేశారు.
నల్లబజారు దందా
రాష్ట్రానికి 9.80 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, కేంద్రం లక్షన్నర టన్నులు తగ్గించిందని జాన్ వెస్లీ ఆరోపించారు. కేటాయించిన కోటాను కూడా సకాలంలో సరఫరా చేయకపోవడంతో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని తెలిపారు. రైతులు సహకార సంఘాలు, దుకాణాల ముందు పడిగాపులు కాస్తున్నారని, కొన్నిచోట్ల తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ నుంచి అయినా రాష్ట్రానికి యూరియా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా, కేంద్రం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొరత కారణంగా బ్లాక్ మార్కెట్లోకి యూరియా వెళుతుందని పేర్కొన్నారు.