- ఆగని అసభ్య కామెంట్స్
- కుక్కల కోసం పోరాటంతో మొదలు
- ఇలా చేస్తే ఇంటికొచ్చి నిలదీస్తానని హెచ్చరిక
సహనం వందే, హైదరాబాద్:
సామాజిక మాధ్యమాలు సృష్టించే విష సంస్కృతికి ఒక మహిళ ఎలా బాధితురాలిగా మారుతుందో నటి రేణూ దేశాయ్ ఉదంతం అద్దం పడుతోంది. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడినందుకు ఆమెపై జరుగుతున్న సోషల్ మీడియా దాడి మానవత్వం గీత దాటింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆమెను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది.
విడాకుల నాటి వెతలు
కుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్ చేస్తున్నారని వాపోయింది నటి రేణూ దేశాయ్. తనపై ఇంత ద్వేషం ఎందుకని మండిపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ… 2012లో తనకు విడాకులైనప్పటినుంచి తన గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారని… భరణం తీసుకున్నానని… వ్యక్తిగత జీవితం గురించి… ఏ రాజకీయ పార్టీకి బానిస అని.. ఇలా రకరకాలుగా తిడుతూనే వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని ఆమె ఖరాఖండిగా చెబుతున్నారు.
కుక్కల కోసం పోరాటం
జనవరి నెలలో జరిగిన ఒక ప్రెస్‌మీట్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వందలాది కుక్కలను దారుణంగా చంపుతున్నారని ఎన్జీవోలు కోరడంతో ఆమె అక్కడికి వెళ్లారు. వంద కుక్కల్లో పది పిచ్చి కుక్కలుంటే వాటి కోసం మిగిలిన 90 మంచి కుక్కలను చంపవద్దని ఆమె కోరారు. ఈ మాటలను కొందరు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. జంతువుల పట్ల జాలి చూపమంటే దానిని రాజకీయ రంగు పులిమి వేధించడం మొదలుపెట్టారు.
అసభ్యకర పదజాలం
సోషల్ మీడియాలో వినియోగిస్తున్న భాష అత్యంత దారుణంగా ఉంది. ప్రెస్‌మీట్‌లో ఒక అపరిచిత వ్యక్తి తనను దూషించడంతో ఆమె కోప్పడ్డారు. దీనిని ఆసరాగా చేసుకుని ఆమెకు రేబిస్ వచ్చిందని ప్రచారం చేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ను కుక్కలు కరిస్తే బాధ తెలుస్తుందనే నీచమైన కామెంట్స్ చూసి ఆమె షాక్‌కు గురయ్యారు. ఒక మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఏ సంస్కారమని ఆమె ప్రశ్నిస్తున్నారు.
తల్లిదండ్రుల బాధ్యత
బూతులు తిట్టే వ్యక్తుల పెంపకంపై ఆమె సూటిగా విమర్శలు చేశారు. మీ ఇంట్లో ఉన్న అక్కాచెల్లెళ్లకు మీరు పెట్టే కామెంట్స్ చూపించగలరా అని నిలదీశారు. కుక్కల బెడద ఉంటే స్థానిక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యేపై పోరాడాలి కానీ తనను తిట్టడం వల్ల ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. బాధ్యత గల పౌరులుగా వ్యవహరించకుండా సోషల్ మీడియా చాటున దాక్కుని ఆడమగ తేడా లేకుండా దాడి చేయడం విచారకరం.
ఇంటికే వస్తానంటూ హెచ్చరిక
మొన్నటి కులాల గొడవలో ఒక బిడ్డ ప్రాణం పోతే దానికి కూడా రేణూ దేశాయ్‌ను బాధ్యురాలిని చేస్తూ తిట్టడం గమనార్హం. ఇక భరించడం తన వల్ల కాదని ఆమె తేల్చి చెప్పారు. ఎక్కడైనా అసభ్య కామెంట్స్ కనిపిస్తే నేరుగా బాధ్యుల ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ఆ బూతులు చూపిస్తానని హెచ్చరించారు. తన నటన నచ్చకపోతే విమర్శించవచ్చని కానీ వ్యక్తిత్వ హననం చేస్తే ఊరుకోనని చెప్పారు.
కాశీకి వెళ్లిన ఫోటోలపైనా…
ఆమె కాశీకి వెళ్లిన ఫోటోలపై కూడా వికృతమైన కామెంట్స్ రావడం దారుణం. నిండుగా బట్టలు వేసుకున్న ఫోటోకు రేటు ఎంత అని అడిగే స్థాయికి దిగజారారు. అందుకే తాను బహిరంగంగా రోడ్డు మీదకు వస్తానని వార్నింగ్ ఇచ్చారు. మీకు దమ్ముంటే ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలను ప్రశ్నించండి కానీ తనపై విషం చిమ్మవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.