రాజమండ్రి శ్రీచైతన్యలో ర్యాగింగ్‌ భూతం – ఇస్త్రీ పెట్టెతో ఒళ్ళు కాల్చిన సీనియర్లు

  • దిక్కులు చూస్తున్న ప్రైవేటు యాజమాన్యం
  • హాస్టల్లో ఇటువంటి పరిస్థితి ఉంటే ఎలా?

సహనం వందే, రాజమండ్రి:
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన విద్యాసంస్థలు ముఖ్యంగా హాస్టళ్లు ఇప్పుడు హింసకు అడ్డాగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై సహచరులు దారుణంగా ర్యాగింగ్‌ కు పాల్పడిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గుఱ్ఱం విన్సెంట్ ప్రసాద్ అనే పదహారేళ్ల విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఇస్త్రీ పెట్టెతో వాతలు… క్రూరత్వానికి పరాకాష్ట
బాధితుడు విన్సెంట్ ప్రసాద్ ఒంటిపై ఉన్న గాయాలు, దాడి తీవ్రతకు నిదర్శనం. పొట్ట భాగం, చేతులపై ఐరన్ బాక్స్‌తో వాతలు పెట్టారు. ఈ క్రూరత్వం వల్ల బాలుడు స్పృహ తప్పే స్థితికి చేరుకున్నాడు.

గాయాలు తీవ్రంగా ఉండటంతో తల్లిదండ్రులు వెంటనే అతడిని రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుత వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్న మాటలు తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు…
ఈ ఘటనలో హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విన్సెంట్‌కు జరిగిన దారుణం గురించి అతడి తల్లి లక్ష్మీ కుమారి యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడం దారుణం. ఒక విద్యార్థి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడిన తర్వాత కూడా యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ర్యాగింగ్‌కు అడ్డుకట్ట వేయాల్సింది పోయి సమస్యను దాచిపెట్టేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి.

బెదిరించిన సీనియర్లు…
దాడికి పాల్పడిన విద్యార్థులు కేవలం ర్యాగింగ్‌కే పరిమితం కాలేదు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది కేవలం ర్యాగింగ్ కాదు ఒక విద్యార్థి జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం. ఇటువంటి ప్రవర్తన సమాజానికి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై ప్రభుత్వం జోక్యం చేసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *