- పదవి మోజులో పరకాయ ప్రవేశం
- నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పోస్టింగ్
- ఆంధ్రాలో వీడాల్సిన అధికారం… ఇక్కడెందుకు పదవీ దాహం
- నిరసన గళం… డైరెక్టర్‌పై కదం… సీఎంకు విన్నపం
- క్యాన్సర్ ఆస్పత్రిలో కుమ్ములాటలు… డాక్టర్ల గగ్గోలు
సహనం వందే, హైదరాబాద్:
నిబంధనల ప్రకారం ఉద్యోగ విరమణ చేయాల్సిన వ్యక్తి… ఆ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ విధుల్లో ఉండడాన్ని మీరు ఎక్కడైనా చూశారా? అంతే కాదు ఒక రాష్ట్రంలో రిటైర్డ్ కావలసిన వ్యక్తి… మరో రాష్ట్రంలో దర్జాగా అధికారికంగా అదే స్థాయి హోదాలో ఉండడాన్ని ఏమనుకోవాలి? అచ్చంగా తెలంగాణలో ఒక డాక్టర్ విషయంలో అదే జరుగుతుంది. హైదరాబాదు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. అక్కడ పోస్టు లేదనే కారణంతో అది వివాదం అయింది.

చివరకు గత ఏడాది ఆంధ్రప్రదేశ్ నిబంధనల ప్రకారం ఆయన అక్కడ పదవీ విరమణ పొందాలి. కానీ ఇక్కడ దర్జాగా డైరెక్టర్ గా విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని వైద్యులు మండిపడుతున్నారు. అంతేకాదు ఈ విషయంపై స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కానీ ఆ డాక్టర్ సీటు వదలకుండా పట్టుకుని వేలాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తుల అండ చూసుకొని ఒక రిటైర్మెంట్ కావాల్సిన డాక్టర్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కుచ్చుటోపి పెడుతున్నట్లు వైద్య సంఘాలు భగ్గు మంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఎంచుకున్నది ఆయనే…
2016లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో డాక్టర్ శ్రీనివాసులు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. శ్రీ కమల్ నాథన్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితాలో కూడా ఆయనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రొఫెసర్‌గా నియమించింది. అయితే ఆ రాష్ట్రంలో తనకు సరిపోయే పోస్టు లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే వరకు ఆయన తెలంగాణలోనే కొనసాగవచ్చని హైకోర్టు ఆదేశించింది.
అప్పటి నుండి ఈ సమస్య పరిష్కారం కాకుండా అలాగే ఉండిపోయింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని డీఓపీటీ చెప్పినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారంపై ఎంఎన్‌జేలోని సీనియర్ ప్రొఫెసర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఏడాది క్రితమే రిటైర్మెంట్…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సు 63 సంవత్సరాలు. ఈ లెక్కన డాక్టర్ శ్రీనివాసులు గత ఏడాది జూన్ లోనే పదవీ విరమణ కావాలి. కానీ ఆయన తెలంగాణలో కొనసాగడం వలన ఇక్కడ 65 సంవత్సరాల వరకు పని చేసే అవకాశం ఉంది. దీని వల్ల తెలంగాణ ప్రభుత్వం ఆయన పదవీ విరమణ ప్రయోజనాలు, జీవితకాల పెన్షన్‌ను భరించాల్సి వస్తుంది.
సీఎం లేఖలో మరో తీవ్రమైన అంశాన్ని ప్రొఫెసర్లు లేవనెత్తారు. ఆయన కొనసాగింపు వల్ల తెలంగాణకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లకు తీవ్ర అన్యాయం చేయడమేనని, వారికి రావాల్సిన పదోన్నతిని నిరాకరించినట్లవుతుందని ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రొఫెసర్లు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
One thought on “ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ”