- ఆయన అభ్యర్థునను తిరస్కరిస్తూ ఉత్తర్వులు
- వెనక్కు పంపాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేఖ
- ఈనెల 14వ తేదీన ‘సహనం వందే’ ఆర్టికల్
- 19న డీవోపీటీ ఆదేశం .. 20వ తేదీన ఏపీ లేఖ
- తొలగింపుపై ఇంకా నిర్ణయం తీసుకోని సర్కార్
సహనం వందే, హైదరాబాద్:
ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయనను తిరిగి వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ సాధారణ పరిపాలన విభాగం తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ఏపీకి కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలంటూ శ్రీనివాసులు చేసిన అభ్యర్థనను కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ (డీవోపీటీ) తిరస్కరించింది. 2017 జనవరి 17న జారీ చేసిన ఆ ఉత్తర్వులు సరైనవని డీవోపీటీ తేల్చి చెప్పింది. దీంతో తెలంగాణలో కొనసాగాలన్న ఆయన ఆశలకు గండిపడింది.

‘సహనం వందే’ రాసిన ఐదు రోజులకే…
ఇదిలా ఉండగా డాక్టర్ శ్రీనివాసులు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ గా కొనసాగడంపై జరుగుతున్న రగడను ‘సహనం వందే’ https:// sahanam vande.com/?p=6557 , ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/mnj-cancer-institute-directors-continuation-sparks-row/ డిజిటల్ పేపర్లు ఈనెల 14వ తేదీన వార్తా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ…పదవి మోజులో పరకాయ ప్రవేశం… నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పోస్టింగ్’ అంటూ కథనం రాశాయి.

రెండు రాష్ట్రాల వైఖరులు స్పష్టమే అయినా…
డాక్టర్ శ్రీనివాసులు తుది కేటాయింపుపై నిర్ణయం తీసుకునే ముందు రెండు రాష్ట్రాల అభిప్రాయాలను గతంలోనే డీవోపీటీ కోరింది. ఆంధ్రప్రదేశ్ కు ఆయన కేటాయింపును మార్చాల్సిన అవసరం లేదని, ఇది మార్గదర్శకాలకు అనుగుణంగానే జరిగిందని తెలంగాణ డీవోపీటీకి స్పష్టం చేసింది. అంతేకాకుండా తెలంగాణలో సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ల కొరత లేదని కూడా తేల్చి చెప్పింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డాక్టర్ శ్రీనివాసులు సేవలు తమకు అవసరమని, తమ రాష్ట్రంలో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దీంతో ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.
రిటైర్ అయినా ఎలా కొనసాగిస్తున్నారు?
వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం డాక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆయన ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం గత ఏడాదే ఉద్యోగ విరమణ పొందాలి. కానీ తన కేటాయింపుపై న్యాయపోరాటం చేస్తూ ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఏకంగా ఎంఎన్ జే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఏపీకి కేటాయించినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఉద్యోగ విరమణ నిబంధనను అమలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీకి వెళ్లాల్సిందే!
ఈ తాజా నిర్ణయంతో డాక్టర్ శ్రీనివాసులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి, అక్కడి నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి డీవోపీటీ తీసుకున్న ఈ నిర్ణయం ముగింపు పలికింది. ఈనెల 20వ తేదీన ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆయనను గత ఐదు రోజులుగా ఎలా కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా కొత్త డైరెక్టర్ ఎవరు అవుతారన్న దానిపై చర్చ జరుగుతుంది.