పొయ్యి వెలగలేదు… శవం లేవలేదు – ఇంట్లో ఇరాన్ మంటలు… స్మశానంలో సెగలు

Iran war - Gas crisis
  • పూణేలో గ్యాస్ అంత్యక్రియల నిలిపివేత
  • మృతదేహాల దహనాలకు తీవ్ర అంతరాయం
  • గ్యాస్ బ్లాక్ దందా… ప్రజల తీవ్ర ఆందోళన
  • నేడు బెంగళూరులో హోటల్స్ బంద్
  • దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్న యుద్దం

సహనం వందే, హైదరాబాద్:

జీవితం గడిచిపోయిన తర్వాత మనిషికి దక్కే కడసారి గౌరవం కూడా ఇప్పుడు యుద్ధపు సెగలకు బలి అవుతోంది. పశ్చిమ ఆసియాలో (ఇరాన్) మండుతున్న యుద్ధం… వేల మైళ్ల దూరంలోని పూణే శ్మశానవాటికల గ్యాస్ చితులను ఆపేసింది‌. బెంగళూరు వంటింటి పొయ్యిలను చల్లార్చే వరకు విస్తరించింది. అంతర్జాతీయ రాజకీయాల ఆటలో ఒక సామాన్యుడి చివరి ప్రయాణం ఎంతటి అనిశ్చితిలో పడిందో చెప్పడానికి ఇదొక విషాద దృశ్యం.

చివరి ప్రయాణానికి ఆగిన బాట…
పూణె మున్సిపల్ కార్పొరేషన్ తన శ్మశానవాటికలను తాళం వేసింది. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో మృత్యువుకు కూడా ఇప్పుడు క్యూ కట్టాల్సిన పరిస్థితి. గ్యాస్ ఆధారిత ముడి పదార్థాల కొరతతో యాంత్రిక అంత్యక్రియలు ఆగిపోవడంతో బంధువులు తమ వారిని ఎలా సాగనంపాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలు ఇంధన సంక్షోభంతో నిస్సహాయంగా నిలిచిపోయాయి. మనిషి ప్రాణం పోయాక కూడా అంతర్జాతీయ యుద్ధపు ప్రభావం అతడిని వదలడం లేదనడానికి ఈ దయనీయ స్థితి ఒక నిదర్శనం.

Iran War - Gas Crisis

అన్నం దొరకని బెంగళూరు
కేవలం శ్మశానవాటికలే కాదు… దేశంలోని ప్రతి వంటిల్లు ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రంగా మారింది. అటు బెంగళూరు నగరంలో హోటల్స్ అసోసియేషన్ భగ్గుమంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాను కంపెనీలు నిలిపేయడంతో హోటల్ యజమానులకు పొయ్యి వెలిగించడం గగనమైంది. వంట గ్యాస్ లేని హోటళ్లు, ఆకలితో అలమటించే పౌరులు… మొత్తంగా ఆ నగరం మంగళవారం బంద్‌కు సిద్ధమైంది. వాణిజ్య వ్యవస్థలు కుప్పకూలడం వెనుక ఉన్న యుద్ధం ఇప్పుడు మధ్యతరగతి పళ్లెం మీద నేరుగా ప్రభావం చూపిస్తోంది.

బ్లాక్ మార్కెట్ ఆకలి
సామాన్యుడి కన్నీటిని వ్యాపారంగా మార్చుకున్న ముఠాలు ఇప్పుడు రంగంలోకి దిగాయి. నోయిడా వంటి ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 1500 రూపాయలకు చేరింది. కృత్రిమ కొరతను సృష్టించే దోపిడీ ముఠాల పంజాలో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ ఏజెన్సీ ముందు సిలిండర్లు పట్టుకుని వందలాది మంది చేసిన నిరసన ప్రభుత్వం పట్ల వారి అసహనాన్ని, వేదనను ప్రతిబింబిస్తోంది.

Gas Crisis - Iran War

అనిశ్చితిలో ప్రభుత్వ యంత్రాంగం
ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ వ్యవధిని సోమవారం 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచి కఠిన ఆంక్షలు విధిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉంది. రిఫైనరీల ఉత్పత్తిని పెంచాలని ఆదేశించినా అంతర్జాతీయ సరఫరా గొలుసు తెగిపోవడంతో ఆ ప్రయత్నాలు ఏమాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు. పాలకులు తీసుకునే నిర్ణయాలు సామాన్యుడి కన్నీటిని తుడవలేక సందిగ్ధంలోనే ఆగిపోతున్నాయి.

ఎడతెగని ఆవేదన
యుద్ధం ఎక్కడో పశ్చిమ ఆసియాలో జరుగుతోంది… కానీ బాధితులు మాత్రం ఇక్కడ గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్న సామాన్యులు. ఇంధన భవిష్యత్తుపై అలుముకున్న ఈ అనిశ్చితి రేపు ఏం జరుగుతుందో తెలియని ఆందోళనను ప్రతి ఒక్కరిలో పెంచుతోంది. యుద్ధం ముగిసే వరకు పరిస్థితి ఇలాగే ఉండే ప్రమాదం ఉండటంతో సామాన్య ప్రజలు తమ కనీస అవసరాల కోసం కూడా యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *