ఉత్తుత్తి పోలీస్… నకిలీ పెళ్ళామ్స్ – ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్న నేర సామ్రాజ్యం

Scam Lands - Fake Police ...
  • నకిలీ పోలీస్ స్టేషన్… ఫేక్ టోల్ ప్లాజా దోపిడీ
  • గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో నయా దందా
  • ఇక జమ్తారాలో సైబర్ నేరగాళ్ల మోసాలు
  • ప్రభుత్వ డబ్బుల కోసం 200 నకిలీ పెళ్లిళ్లు
  • స్కామ్‌ల్యాండ్స్ యాత్రలో నేర చరిత్రలు
  • స్నేహా పూనమ్ పుస్తకం..కళ్ళకు కట్టిన వాస్తవం

సహనం వందే, హైదరాబాద్:

మనం క్లిక్ చేసే ప్రతి లింక్ వెనుక ఒక భారీ నేర సామ్రాజ్యం దాగి ఉంది. మీ జేబుకు చిల్లు పెట్టే కిలాడీలు ఇప్పుడు ఖండాంతరాలు దాటి విస్తరించారు. జమ్తారా చీకటి వీధుల నుంచి కంబోడియా రక్తపాత గదుల వరకు సాగుతున్న ఈ దగా వెనుక ఉన్న భయంకరమైన నిజాలు తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది. ఇది కేవలం దొంగతనం కాదు… ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్‌వర్క్.

Sneha Poonam -  Scam Lands book

స్నిగ్దా పూనం అన్వేషణ
ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ స్నిగ్దా పూనం తన ‘స్కామ్‌ల్యాండ్స్’ పుస్తకం కోసం ఆసియా అంతటా పర్యటించారు. డిజిటల్ మోసాల వెనుక ఉన్న సామాజిక కారణాలను ఆమె విశ్లేషించారు. భారతదేశంలోని మారుమూల గ్రామాల నుంచి కంబోడియా వంటి దేశాల వరకు ఈ నేరాల మూలాలు ఎలా విస్తరించాయో ఆమె కళ్ళకు కట్టినట్లు చూపారు. కేవలం సాంకేతికత మాత్రమే కాదు… నిరుద్యోగం, పేదరికం కూడా ఈ నేర సామ్రాజ్యానికి ఇంధనంగా మారుతున్నాయని ఆమె హెచ్చరించారు.

నేరమే ఒక ఆర్థిక వ్యవస్థ
జార్ఖండ్‌లోని జమ్తారా ప్రాంతంలో మోసాలు కేవలం నేరం మాత్రమే కాదు.. అదొక సమాంతర ఆర్థిక వ్యవస్థగా మారింది. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల యువత ఈ రంగంలోకి ప్రవేశించి విలాసవంతమైన భవంతులు నిర్మిస్తున్నారు. వారు కొనుగోలు చేసే ఎస్‌యూవీలు, ఖరీదైన మోటార్ సైకిళ్లు స్థానికంగా ఆధిపత్య పోరుకు దారితీస్తున్నాయి. ఈ మోసాల సొమ్ము రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారాలకు, పోలీసులకు లంచాల రూపంలో వెళ్తోంది. ఇక్కడ నేరం ఒక సామాజిక హోదాగా మారిపోయింది.

నకిలీ టోల్ ప్లాజా… నకిలీ పోలీస్ స్టేషన్
బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో నేరగాళ్లు ప్రభుత్వ వ్యవస్థలనే హైజాక్ చేస్తున్నారు. గుజరాత్‌లో ఏకంగా నకిలీ టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేయగా.. బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ నడిపిస్తూ సామాన్యులను దోచుకున్నారు. సామూహిక వివాహాల పథకంలో 2 లక్షలు లేదా 3 లక్షల రూపాయల నగదు కోసం ఏకంగా 200 మంది నకిలీ పెళ్లిళ్లు చేసుకున్నారు. రైతుల కోసం వచ్చే ప్రభుత్వ నిధులను ఒకరికి బదులు ఐదుగురు దొంగలు అనుభవిస్తున్నారని స్నేహా పూనమ్ తన పర్యటనలో గుర్తించారు.

హెలికాప్టర్ బ్రదర్స్ బండారం
తమిళనాడులోని కుంభకోణానికి చెందిన ఎం.ఆర్. గణేష్, ఎం.ఆర్. స్వామినాథన్‌లను హెలికాప్టర్ బ్రదర్స్ అని పిలుస్తారు. వారు హెలికాప్టర్ వాడుతున్నారంటే అది వారి సంపాదన కాదు… అది బాధితులను నమ్మించడానికి వేసిన ఒక ‘కాన్ఫిడెన్స్ ట్రిక్’. తాము అత్యంత ధనవంతులమని, తమ దగ్గర పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించడానికి ఆ హెలికాప్టర్‌ను ఒక మార్కెటింగ్ ఆయుధంగా వాడారు. తమ బ్రాహ్మణ మూలాలను వాడుకుని స్వజాతి వారినే నమ్మించి కోట్లాది రూపాయల డిపాజిట్లు వసూలు చేసి ముంచేశారు.

ఓటీపీ సెకన్ల వ్యవహారం
ఒక వ్యక్తి నుంచి ఓటీపీ తీసుకోవడం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సులభమైన పనిగా మారింది. కేవలం 10 రోజుల్లో కోటి రూపాయల వరకు సంపాదించే కిలాడీలు జమ్తారాలో ఉన్నారు. వారు అమెజాన్ వంటి సైట్లలో బాధితుల పేరుతో అకౌంట్లు తెరిచి.. రిమోట్ కంట్రోల్ కర్టెన్లు, ఎలక్సా వంటి ఖరీదైన వస్తువులను కొంటున్నారు. కేవలం ఒక ఫోన్ కాల్‌తో 10 వేలు సంపాదించడం తమకు చిటికెలో పని అని వారు గర్వంగా చెబుతున్నారు. బాధితుల డేటాను సేకరించి వారిని మానసికంగా లొంగదీసుకోవడంలో వీరు దిట్ట.

డిజిటల్ ప్రేమ వంచన
గురుగ్రామ్ వంటి నగరాల్లోని కాల్ సెంటర్లలో యువతులు వైట్ కాలర్ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. లమోర్ వంటి డేటింగ్ యాప్‌ల ద్వారా ఒంటరిగా ఉన్న పురుషులను బక్రా అని పిలుస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. వారు ఒక ఫోటో చూడాలన్నా లేదా చాటింగ్ చేయాలన్నా డిజిటల్ డైమండ్స్ కొనేలా ప్రేరేపిస్తున్నారు. ఈ సొమ్ములో మెజారిటీ వాటా చైనాలోని యాప్ యజమానులకు చేరుతోంది. ఈ యాప్‌లు కేవలం ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు.

కంబోడియాలో బానిస విక్రయాలు
కంబోడియా వంటి దేశాలకు ఉద్యోగాల పేరుతో వెళ్తున్న గ్రాడ్యుయేట్లు అక్కడ బానిసలుగా మారుతున్నారు. వారి పాస్‌పోర్టులను లాక్కుని చీకటి గదుల్లో ఉంచి బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు. ఒక రిక్రూటర్ నుంచి ఉద్యోగిని 6 లక్షలు నుండి 7.5 లక్షలు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మాట వినకపోతే కరెంటు షాక్‌లు ఇస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. సరైన ఉపాధి లేక యువత ఇలాంటి నేర సామ్రాజ్యాల్లోకి సులభంగా ఆకర్షితులవుతున్నారు. సామాజిక మార్పు ద్వారానే ఈ స్కామ్‌ల్యాండ్స్ అంతమవుతాయని స్నిగ్దా పూనం హెచ్చరిస్తున్నారు.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *