- ‘సహనం వందే’ కథనాలతో కదిలిన ప్రభుత్వం
- 15 రోజులు దోబూచులాడి చివరికి వేటు
- కొత్త డైరెక్టర్ గా డాక్టర్ బెంజిమెన్ నియామకం
సహనం వందే, హైదరాబాద్:
ఎట్టకేలకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ఇంచార్జి డైరెక్టర్ గా డాక్టర్ జోసెఫ్ బెంజిమెన్ ను నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు రాసిన వరుస కథనాలతో డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన డైరెక్టర్ గా కొనసాగడంపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=6557, ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ shock-to-dr-srinivasulu-as-dopt-sacks-mnj-director/ డిజిటల్ పేపర్లు గత నెల నెల 14వ తేదీన వార్తా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. ‘ఎంఎన్ జే డైరెక్టర్ రిటైర్మెంట్ రగడ…పదవి మోజులో పరకాయ ప్రవేశం… నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు పోస్టింగ్’ అంటూ కథనాలు రాశాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపు ఉత్తర్వులు సరైనవని అదే నెల19వ తేదీన డీవోపీటీ ఆదేశాలు ఇచ్చింది. వెంటనే తదుపరి రోజు 20వ తేదీన ఆయనను వెనక్కి పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు లేఖ రాసింది. అయినప్పటికీ కదలిక లేకపోవడంతో ఈ రెండు డిజిటల్ పేపర్లు https://sahanamvande.com/?p=6842 మళ్లీ పలు కథనాలు రాశాయి. దీంతో గత నెల 26వ తేదీన https://sahanamvande.com/?p=7072 ఆయనను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ బుధవారం వరకు అంటే దాదాపు 15 రోజులు ఆయన సీట్లో కొనసాగడంపై విమర్శలు వచ్చాయి. ఏదో విధంగా ఇక్కడ కొనసాగేందుకు ఆయన ప్రయత్నాలు చేశారన్న చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో ఒక కీలక అధికారి ఆయనకు సపోర్ట్ ఇచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు.
రిటైర్ అయినా కొనసాగింపుపై విమర్శలు…
వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం డాక్టర్ శ్రీనివాసులును ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. ఆయన ఆ రాష్ట్ర నిబంధనల ప్రకారం గత ఏడాదే ఉద్యోగ విరమణ పొందాలి. కానీ తన కేటాయింపుపై న్యాయపోరాటం చేస్తూ ఆయన తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఏకంగా ఎంఎన్ జే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఏపీకి కేటాయించినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన ఉద్యోగ విరమణ నిబంధనను అమలు చేయకపోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ తాజా నిర్ణయంతో డాక్టర్ శ్రీనివాసులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉంది.