రద్దయినా మారని బుద్ధి – ‘మహావీర్’ యాజమాన్యం ధిక్కరణ ధోరణి

  • మూడేళ్ల క్రితం బ్యాచ్ రద్దు చేసిన ఎన్ఎంసీ
  • అప్పుడు మూడు కాలేజీలది ఇదే పరిస్థితి
  • మౌలిక సదుపాయాలు లేకపోవడమే కారణం
  • దీంతో పలు కాలేజీల్లో విద్యార్థుల సర్దుబాటు

సహనం వందే, హైదరాబాద్:
వికారాబాద్ లోని ‘మహావీర్’ మెడికల్ కాలేజీ బాగోతం అంతా ఇంతా కాదు. మూడేళ్ల క్రితం రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేవని ఆ సంవత్సరం బ్యాచ్ లను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ మూడు కాలేజీల్లో మహావీర్ మెడికల్ కాలేజీ కూడా ఉంది. అయినప్పటికీ ఆ కాలేజీ యాజమాన్యం మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదని బోధనాసుపత్రిని చూస్తే అర్థమవుతుంది. ఏం చేసుకుంటారో చేసుకోండన్న ధిక్కరణ కనిపిస్తుంది. అంతేకాదు డబ్బులు ఇస్తే ఎన్ఎంసీ అనుమతులు ఇస్తుందన్న ధీమా వారిలో ఉంది. ఒక బ్యాచ్ పోతే ఏంటి అన్న ధోరణి కనిపిస్తుంది. ఆ కాలేజీని ‘సహనం వందే’ బృందం పరిశీలించిన తర్వాత అనేక లోటుపాట్లు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

మూడేళ్ల క్రితం ఏం జరిగిందంటే…?
2021-22 వైద్య విద్యా సంవత్సరంలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవంటూ రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీల్లోని మొదటి ఏడాది ఎంబీబీఎస్ అడ్మి షన్లను ఎన్ఎంసీ రద్దు చేసింది. సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్, పటాన్ చెరులోని టీఆర్ఆర్, వికారాబాద్ లోని మహవీర్ కాలేజీల్లో మొదటి ఏడాదికి చెందిన మొత్తం 450 ఎంబీబీఎస్ సీట్లను ఎన్ఎంసీ రద్దు చేసింది. దాంతో ఆయా కాలేజీల్లో చేరిన వైద్య విద్యార్థులు అడ్మిషన్లు పొందిన నెలకే రోడ్డున పడ్డారు. వాటిల్లో తొలి ఏడాది చేరిన వైద్య విద్యార్థులు అంతా కలిపి రూ. 66 కోట్లు చెల్లించారు. తర్వాత టీఆర్ఆర్, మహావీర్ మెడికల్ కాలేజీలకు చెందిన 300 మంది (ఒక్కో మెడికల్ కాలేజీకి చెందిన 150 మంది) విద్యార్థులను 13 ప్రైవేట్ కాలేజీల్లో సర్దుబాటు చేశారు. ఎమ్మెన్నార్ కాలేజీ విద్యార్థులను మాత్రం తిరిగి అందులోనే కొనసాగించారు.

సర్దుబాటు సందర్భంగా సమస్యలు…
ఈ క్రమంలో టీఆర్ఆర్ కాలేజీ డబ్బులు ఇవ్వకుండా చెక్కులు ఇచ్చింది. అయితే అవి బౌన్స్ అవుతున్నాయి. ముఖ్యంగా బీ, సీ కేటగిరీల్లో పెద్ద మొత్తంలో డొనేషన్లు చెల్లించిన విద్యార్థులకు రసీదులు లేకపోవడం ఒక సమస్య కాగా, కొందరు తక్కువ ధరకు మాట్లాడుకోవడం వల్ల ఇతర కాలేజీల్లో సర్దుబాటుతో అక్కడ పూర్తి స్థాయి ఫీజు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సీ కేటగిరీకి చెందిన కొందరు విద్యార్థులైతే ఏకంగా ఏడాదికి రూ. 23 లక్షల చొప్పున చెల్లించారు. ఇందులో డొనేషన్ల సొమ్ముకు కాలేజీలు ఎలాంటి రసీదులూ ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. కాలేజీలలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఈ విధంగా రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఇంత తతంగం జరిగినప్పటికీ మహావీర్ యాజమాన్యం మాత్రం తన తీరును మార్చుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *