సహనం వందే, చెన్నై:
సూపర్ స్టార్ రజనీకాంత్ కాలుజారి పడినట్లుగా ఉన్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో రజనీకాంత్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చెన్నైలోని తన నివాసం ఆవరణలో నడుచుకుంటూ వెళ్తుండగా ఆయన అదుపుతప్పి కిందపడ్డారని ఈ వీడియోలో కనిపిస్తోంది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో రజనీకాంత్ పోలిన ఒక వ్యక్తి ఉదయం దినపత్రిక తీసుకోవడానికి తన ఇంటి నుండి బయటకు వస్తున్నాడు. తిరిగి లోపలికి వెళుతుండగా తడి నేల కారణంగా అకస్మాత్తుగా జారిపడి ముఖం కిందపడినట్లుగా ఉంది. అయితే వెంటనే ఆయన ఏమాత్రం తడబడకుండా లేచి ప్రశాంతంగా తిరిగి ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
అభిమానుల ఆగ్రహం… గోప్యతపై ప్రశ్నలు
ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయిన వెంటనే నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రజనీకాంత్ వ్యక్తిగత గోప్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఈ వీడియో నకిలీదని వాదించగా, మరికొందరు నటుడి ఇంటి లోపల నుండి ఈ వీడియో ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు. ‘ఈ వ్యక్తిగత ఫుటేజ్ ఎలా లభించింద’ని ఒకరు అడగగా, ‘వీక్షకుల కోసం రికార్డ్ చేయడం చాలా బాధాకరం. ప్రతి ఒక్కరికీ గోప్యత అవసరం. ఇతరుల జీవితాలతో కాకుండా మీ పని మీరు చూసుకోండ’ని మరొకరు వ్యాఖ్యానించారు. ‘ఎవరో రహస్యంగా రికార్డ్ చేసినట్లుంద’ని ఇంకొకరు అన్నారు. ‘ఆయన సిసిటివి ఫుటేజ్ కూడా హ్యాక్ అయిందా?” అని మరొక నెటిజన్ ప్రశ్నించారు.
రజనీకాంత్ రాబోయే సినిమాలు…
ఇదిలా ఉండగా రజనీకాంత్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘కూలి’ విడుదల కోసం సిద్ధమవుతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజిఆర్, మోనిషా బ్లెస్సీ, కాళి వెంకట్ వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ‘కూలి’ చిత్రంలో దేవ అనే వృద్ధ గ్యాంగ్‌స్టర్ కథతో తెరకెక్కింది.