- ఐదు దశాబ్దాలలో సగానికి తగ్గిన శుక్రకణాలు
- 100 మిలియన్ల నుంచి 50 మిలియన్లకు…
- ఇండియాలో 7-10 శాతం మందిలో సున్నా
- జీవనశైలి, ఆహారపు అలవాట్లతో తగ్గుదల
- సంతానలేమికి ఇదే ప్రధాన కారణం
- భారత్ లో 2.75 కోట్ల మందిలో సంతానలేమి
- హ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్ నివేదిక వెల్లడి
- దీంతో వీధికొకటి పుట్టుకొస్తున్న ‘సృష్టి’కర్తలు
- ఫెర్టిలిటీ సెంటర్ల పేరుతో లక్షల్లో దోపిడి
సహనం వందే, హైదరాబాద్:
ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో పునరుత్పత్తి సామర్థ్యం ప్రమాదకరంగా క్షీణిస్తోందని అంతర్జాతీయ అధ్యయనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ కాలుష్యం వంటి అనేక కారణాలు శుక్రకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా కోట్లాది జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి, దీంతో అనేక చోట్ల ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అనేక మోసాలకు పాల్పడుతున్నాయి. లక్షల రూపాయలు దండుకుంటున్నాయి. ‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతంతో అసలు సంతాన వైఫల్యానికి కారణాలపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రకణాల సంఖ్యలో భారీ తగ్గుదల
‘హ్యూమన్ రిప్రొడక్షన్ అప్డేట్’ నివేదిక ప్రకారం… గత ఐదు దశాబ్దాల్లో (1973-2020) పురుషుల్లో శుక్రకణాల సాంద్రత దాదాపు సగానికి పడిపోయింది. 1970లలో 20-30 ఏళ్ల వయస్సున్న యువకుల్లో సగటున 100 మిలియన్ల శుక్రకణాలు ఉండగా, 2020 నాటికి అదే వయస్సు వారిలో ఈ సంఖ్య 50 మిలియన్లకు తగ్గిపోయింది. అంటే సగం క్షీణత నమోదైంది. ఈ గణాంకాలు పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యం ఏ స్థాయిలో తగ్గిపోయిందో స్పష్టం చేస్తున్నాయి.
సంతానలేమికి కారణాలు…
సాధారణంగా సంతానలేమి గురించి చర్చ వచ్చినప్పుడు స్త్రీల పునరుత్పత్తి సామర్థ్యంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తారు. కానీ అనేక నివేదికలు పురుషుల పాత్రను విస్మరిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఆఫ్రికా, ఆసియా వంటి కొన్ని ప్రాంతాల్లో సంతానలేమికి స్త్రీలనే నిందించడం, బహు భార్యత్వం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగడానికి సంతానలేమిని అధిగమించాలనే కోరిక కూడా ఒక కారణమని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4.85 కోట్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నాయి.

భారత్‌లో 10 శాతం మందిలో జీరో…
భారత్‌లో సుమారు 2.75 కోట్ల మంది సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. ఇందులో స్త్రీల వల్ల 48 శాతం, పురుషుల వల్ల 31.6 శాతం, ఇద్దరిలో సమస్యల వల్ల 20.4 శాతం సంతానలేమి ఏర్పడుతోంది. సంతాన లేమితో బాధపడే పురుషుల్లో 80 శాతం మందికి శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. కొందరిలో శుక్రకణాలు పూర్తిగా లేకపోవడం (జీరో) కూడా జరుగుతుంది. ఇది జనాభాలో 7 నుండి 10 శాతం మందిలో ఉంటుందని అంచనా.
ఆలస్య వివాహాలు ఒక కారణం…
పురుషుల్లో సంతానలేమికి అనేక కారణాలు దోహదపడుతున్నాయి. హార్మోన్ల లోపాలు, పుట్టుకతో వచ్చే ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపాలు, పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్ఫెక్షన్లు ప్రధానమైనవి. ఆధునిక జీవనశైలి, మానసిక, శారీరక ఒత్తిళ్లు, ఆలస్య వివాహాలు, ఆహార కల్తీలు, ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాల వినియోగం, వాతావరణ కాలుష్యం, మొబైల్ ఫోన్ల అధిక వాడకం వంటివి కూడా శుక్రకణాలు తగ్గడానికి కారణమవుతున్నాయి.

అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు
సంతానలేమి సమస్యను అధిగమించడానికి అనేక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, శుద్ధిచేసిన ఆహారానికి దూరంగా ఉండటం, ధూమపానం, మద్యపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, ఏడెనిమిది గంటల నిద్ర వంటివి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. శుక్రకణాలు లేకపోవడం వంటి తీవ్రమైన లోపాలను కూడా ఆధునిక వైద్య పద్ధతులతో సరిదిద్దవచ్చు. మైక్రోసర్జికల్ వేరికోసిలెక్టమీ వంటి చికిత్సల ద్వారా వేరికోసీల్ సమస్య కారణంగా తగ్గిన శుక్రకణాల సంఖ్యను పెంపొందించవచ్చు. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి, చికిత్స తీసుకుంటే సంతానలేమి సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.