ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు-బుసలు కొడుతున్న అక్రమాలు

  • విదేశాల నుంచి తెచ్చిన బ్యాచ్ లో నాసిరకం
  • ఒక ఏడాది తెచ్చిన వాటిల్లో లక్ష జన్యు లోపం
  • నోరెళ్ళ పెడుతున్న కేంద్ర శాస్త్రవేత్తల బృందం
  • ఖమ్మం జిల్లాలో మళ్లీ క్షేత్రస్థాయి పర్యటన
  • ఒక తోటలో 570 మొక్కల్లో 300 నాసిరకమే
  • వెలుగు చూస్తున్న అక్రమార్కుల నయవంచన

సహనం వందే, వేంసూర్: ఆయిల్ పామ్ తోటల్లో అవినీతి పుట్టలు వెలుగు చూస్తున్నాయి. ఆ పుట్టలను తవ్వుతుంటే అక్రమాల విషపు నాగులు బుసలు కొడుతున్నాయి. ఆయిల్ ఫెడ్ అధికారుల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అక్కడి రైతుల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారు. వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలు సంపాదనకు మరిగిన కొందరు అధికారులు రైతులకు నాసిరకం మొక్కలు అంటగట్టడంపై నిరసన వ్యక్తం అవుతుంది. ఆయిల్ పామ్ మొక్కల్లో ఎక్కువ సంఖ్యలో జన్యు లోపం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అవినీతి అధికారుల పుట్ట బద్దలవుతుంది.

వేంసూరు తోటలో సగం నాసిరకమే…
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు ఆయిల్ పామ్ మొక్కల్లో జరిగిన అక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై గతంలో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్లో ‘ఆయిల్ ఫెడ్ అక్రమార్కులకు చుక్కలే’ https://sahanamvande.com/?p=5540 శీర్షికతో స్పాట్ స్టోరీ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా

సంస్థ మళ్లీ బుధవారం మొదలైన వారి పర్యటనలో భాగంగా వేంసూర్ మండలంలో తోటలను పరిశీలించారు. రైతులు దొడ్డా చక్రధర్ రెడ్డి, గొర్ల సత్యనారాయణరెడ్డి, దేశీరెడ్డి సత్యనారాయణ రెడ్డి, గాదె బ్రహ్మానందరెడ్డి తోటలను పరిశీలించారు. అందులో ఒక రైతుకు పది ఎకరాల తోట ఉంది. 2018-19 ప్రాంతంలో వేసిన 570 మొక్కల్లో ఏకంగా 300 మొక్కలు జన్యు లోపాలతో ఉన్నట్లు అంచనా

వేశారు. అంటే సగానికి పైగా మొక్కలు నాసిరకం ఉండటం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ఎకరానికి సరాసరి 8 టన్నుల గెలలు రావాల్సి ఉండగా… కేవలం 3 టన్నులు మాత్రమే వస్తున్నట్లు బృందం గుర్తించినట్లు తెలిసింది. ఈ స్థాయిలో నాసిరకం మొక్కలు ఉండటం వల్ల ఆ రైతు లక్షల రూపాయల ఆదాయం కోల్పోతున్నారు.

విదేశీ మొక్కల్లో లక్ష నాసిరకమే?
మరోవైపు కేంద్ర శాస్త్రవేత్తల బృందం అక్కడ జరిగిన అక్రమాలపై తలలు పట్టుకుంటుంది. ఈ స్థాయిలో థర్డ్ క్లాస్ మొక్కలు రైతులకు ఇవ్వడం పట్ల ఆశ్చర్యానికి లోనవుతున్నారు. రైతులను మోసం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021-22 ప్రాంతంలో విదేశాల నుంచి కొన్ని

లక్షల ఆయిల్ పామ్ మొక్కలు తెలంగాణకు వచ్చాయి. అందులో ఒక బ్యాచ్ కు చెందిన 4 లక్షల మొక్కల్లో ఏకంగా లక్ష మొక్కలు జన్యు లోపంతో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. ఈ స్థాయిలో రైతులకు నాసిరకం మొక్కలు ఇచ్చి కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని చూసి అక్కడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొక్కల కంపెనీలతో అధికారుల లాలూచీ…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తుంది. ఈ సాగును పెంచేందుకు రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. అందుకోసం ఆయిల్ పామ్ విత్తన మొక్కలను మలేషియా, కోస్టిరికా వంటి దేశాల నుంచి కొనుగోలు చేశారు. థర్డ్ క్లాస్ మొక్కలను ఫస్ట్ క్లాస్ మొక్కల రేటుకి మాట్లాడుకుని కంపెనీలతో లాలూచీ పడినట్లు విమర్శలు వస్తున్నాయి. అలా పలు సందర్భాల్లో 2022 వరకు ఆయా దేశాల నుంచి మొక్కలను లక్షల్లో తెప్పించారు. కీలకమైన ఆ సమయంలో కార్పొరేషన్ కు ఎండీగా సురేందర్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే నాసిరకం మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఆ సమయంలో పనిచేసిన అధికారులంతా దీనికి బాధ్యులే. వారు ఇప్పుడు అత్యంత కీలకమైన స్థానంలో పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే ఆర్డర్లు పెట్టడం, బిల్లులు క్లియర్ చేసి పేమెంట్స్ చేయడం వంటివి జరిగాయి.

ఇంత కీలకమైన నిర్ణయాలు జరిగినవి సమయంలో వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులు ఏం చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి. వారి ఆమోదం లేకుండా ఇంత పెద్ద నిర్ణయాలు జరుగుతాయా అన్నది ప్రశ్న. వారిని కూడా ఆయిల్ ఫెడ్ అధికారులు బోల్తా కొట్టిచ్చారా? లేక వాళ్లను కూడా ఇందులో భాగం చేశారా అన్నది తెలియాల్సి ఉంది. వీటిపై సమగ్ర దర్యాప్తు చేస్తే గాని అసలు విషయాలు బయటకు రావు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారాలన్నింటిపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలోనూ ప్రస్తుత అధికారులే ఉండటం వల్ల అక్రమాలు వెలుగులోకి రానీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *