- తాజాగా ఎమ్మెల్యే సత్యనారాయణకు నోటీసు
- చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి లేఖ
సహనం వందే, హైదరాబాద్: ఆర్ఎంపీలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. అనర్హులైన ఆర్ఎంపీలకు మద్దతు ఇవ్వడం ద్వారా నకిలీ వైద్యాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందని కౌన్సిల్ మండిపడింది. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. అవకాశవాద రాజకీయాల కోసం అనర్హులైన వైద్యులను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే సత్యనారాయణ డాక్టరు అయినందున తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నుండి వైద్యుడిగా ఆయన పేరును రిజిస్టర్ నుండి శాశ్వతంగా తొలగించాలని తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (థానా) వరంగల్ శాఖ డిమాండ్ చేసింది.

రాజకీయ నేతలకు ఆర్ఎంపీలే గురువులు…
ఆర్ఎంపీల వైద్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రాథమిక చికిత్స వదిలి ప్రధాన చికిత్సలు కూడా చేస్తుండటంతో అవి వికటిస్తున్న సంఘటనలు చూస్తున్నాము. అయినప్పటికీ కొందరు ఆర్ఎంపీ వైద్యులు మారడం లేదు. తమ సామర్థ్యానికి మించి వైద్యం చేయడం… మందులు రాయడం… చికిత్సలు చేయడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు జిల్లాల్లో వీరే అనేక పెద్ద ఆసుపత్రులకు రోగులను తరలించే కీలక వ్యక్తులుగా పనిచేస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నందున రాజకీయ నాయకులు వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
గ్రామాల్లో సాధారణ ప్రజలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండటంతో వీరిని మచ్చిక చేసుకునే పనిలో నేతలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్నారు. గతంలో అనేకమంది మంత్రులు కూడా ఆర్ఎంపీలకు అనుకూలంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీల నాయకులు ఆర్ఎంపీల వెంట పడుతున్నారు. కొందరు ఆర్ఎంపీలు కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఆర్ఎంపీల వ్యవస్థను నిర్మూలించాలని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కృతనిశ్చయంతో ఉంది. కానీ మెడికల్ కౌన్సిల్ కు అడ్డంకులు సృష్టించేది వేరే ఎవరో కాదు. తోటి డాక్టర్లే ఆర్ఎంపీలను ప్రోత్సహిస్తున్నారు. ఆస్పత్రులు బతకాలంటే ఆర్ఎంపీలు కావాలన్నా భావన నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో దాదాపు రెండు మూడు గ్రామాలకు ఒక పల్లె దవాఖానా ఉంది. అందులో ఒక డాక్టర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు ఉంటారు. డాక్టర్ మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు డాక్టరు రానే రారు. నిర్ణీత సమయం… ఒక్కోసారి డాక్టర్ వస్తారో రారో తెలియకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో వైద్యం అందుబాటులోకి రావడం లేదు.
మరోవైపు ప్రతి గ్రామంలో ముగ్గురు నలుగురు ఆర్ఎంపీలు ఉంటున్నారు. గత్యంతరం లేక రోగులు ఆర్ఎంపీలనే ఆశ్రయించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ వ్యవస్థను ముందుకు తీసుకు రాకుండా ప్రస్తుత వ్యవస్థను ధ్వంసం చేయడం సాధ్యం కాదన్న విషయాన్ని మెడికల్ కౌన్సిల్ దృష్టిలో పెట్టుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు సరిగా డ్యూటీ చేయడం, అన్నివేళలా అందుబాటులో ఉండటం వంటివి చేయడం వల్ల ఆర్ఎంపీల వద్దకు వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఉండదనేది గుర్తుంచుకోవాలని అంటున్నారు.
ఆర్ఎంపీల సామర్థ్యానికి మించి వైద్యం...
- ఇష్టారాజ్యాంగా యాంటిబయోటిక్స్, స్టెరాయిడ్లు, హెవీ పెయిన్ కిల్లర్లు రోగులకు ఇస్తున్నారు.
- శస్త్రచికిత్సలు చేయడం, ఎంటీపీ కిట్లు వినియోగించడం
- హాస్పిటల్‌లా మంచాలను వాడుతూ పేషెంట్ కి చికిత్స అందించడం.
- లింగ నిర్ధారణ, గర్భ విచ్చిత్తి వంటి చట్టవ్యతిరేక పనులు చేయడం
- అనధికారికంగా ప్రాథమిక ఆసుపత్రుల మాదిరిగా క్లినిక్‌లు, ల్యాబ్ లు నడిపించడం
ప్రత్యామ్నాయ చర్యలు…
- క్రమం తప్పకుండా వైద్యులను, ఇతర సిబ్బందిని రీక్రూట్ చేయడం
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయడం
- పూర్తి సమయం : 24 గంటలు వైద్యులతో , సహాయ సిబ్బందితో భర్తీ చేయడం
- కమ్యూనిటీ హెల్త్ కేర్ కేంద్రాలు, మెడికల్ కాలేజీలతో ఆన్ లైన్ కన్సల్టేషన్ అనుసంధానం ఏర్పాటు చేయడం
- నకిలీ వైద్యులకు రాజకీయ రక్షణ కల్పించకుండా చర్యలు తీసుకోవడం