- టెలిమెట్రీ విధానానికి గ్రీన్ సిగ్నల్!
- ఎవరెంత నీటిని వినియోగిస్తున్నారో అంచనా
- తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అంగీకారం
- పోలవరంపై తెలంగాణ సీఎం అభ్యంతరం
సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపిణీపై నెలకొన్న సమస్యలకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ సమక్షంలో బుధవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, దీనిని తెలంగాణకు ఒక విజయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు.

నాలుగు అంశాలపై ఏకాభిప్రాయం…
కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు, ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నాలుగు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు.
టెలిమెట్రీ విధానం అమలు
నదీ జలాల వినియోగంపై పూర్తి పారదర్శకత కోసం, అన్ని పాయింట్ల వద్ద టెలిమెట్రీ విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి అంగీకారం కుదిరింది. ఎవరు ఎంత నీటిని వినియోగిస్తున్నారో పర్యవేక్షించడానికి ఇది అత్యంత అవశ్యకమని తెలంగాణ మొదటి నుంచీ కోరుతోందని, విభజన చట్టంలో ఉన్నప్పటికీ ఇంతకాలం అమలు జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. టెలిమెట్రీ అమలుకు ఏపీ అంగీకరించడం తెలంగాణ సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు.
నదీ యాజమాన్య బోర్డుల కార్యాలయాలు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేయాలన్న అంశంపైనా ఏకాభిప్రాయం కుదిరింది. గతంలో జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటివరకు అమలు కాలేదు.
శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు: ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి, నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనల మేరకు ప్లంజ్ పూల్‌తో పాటు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అనుమతి లభించింది.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలను పరిశీలించడానికి సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ నెల రోజుల్లోగా నదీ జలాలపై ఇప్పటికే నిర్మించిన, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి సూచనలు అందిస్తుంది. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తారు.
పోలవరంపై తెలంగాణ అభ్యంతరం…
గోదావరి – బనకచర్లపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రివర్ మేనేజ్‌మెంట్ అథారిటీ, సీడబ్ల్యూసీ వంటి సంస్థలన్నీ అభ్యంతరాలు తెలియజేశాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి – బనకచర్లను చేపడతామని చెప్పలేదని, ఒకవేళ వారు ఆ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ అభ్యంతరం చెబుతుందని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి పాటిల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని, పాటిల్ ఒక న్యాయమూర్తిలా వ్యవహరించారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇది అనధికారిక సమావేశమని, ఇరు రాష్ట్రాల మధ్య కేంద్రం ఒక వేదికగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు.