ఆయిల్ పామ్ అక్రమార్కులకు చుక్కలే

  • కేంద్ర బృందం పర్యటనలో వెలుగులోకి నాసిరకం మొక్కలు
  • 3 రోజులు… 3000 మొక్కలు… 100 శాంపిళ్ళు
  • పెద్దఎత్తున జన్యులోపం ఉన్న మొక్కల గుర్తింపు
  • నమూనాలను డీఎన్ఏ టెస్ట్ కు పంపిన శాస్త్రవేత్తల బృందం

సహనం వందే, అశ్వారావుపేట: ఆయిల్ పామ్ మొక్కల్లో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అశ్వారావుపేట, ములకలపల్లి మండలాల్లో ఆయిల్ పామ్ తోటలను భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ (ఐఐఓపీఆర్) బృందం మూడు రోజులు పర్యటించింది. గురువారంతో వారి పర్యటన ముగిసింది. వర్షంలోనూ ఆ బృందం పట్టుదలగా క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయడం విశేషం. ఈ మూడు రోజుల్లో శాస్త్రవేత్తల బృందం 3 వేల ఆయిల్ పామ్ మొక్కలను పరిశీలించింది. ఇందులో నుంచి 100 నమూనాలను సేకరించింది. వాటిని డీఎన్ఏ పరీక్షల కోసం పంపించారు. రిపోర్టులు వచ్చాక అక్రమార్కులకు శిక్ష పడుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం శాస్త్రవేత్తల బృందం ఈ మూడు రోజుల పర్యటనలో అనేక లోపాలను గుర్తించారు. జన్యు లోపం ఉన్న మొక్కలు వెలుగు చూశాయని… స్థానికంగా ఉత్పత్తి చేసిన మొక్కలను రైతులకు అందజేసి వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని తెలిసింది.

30% వరకు జన్యు లోపం…
ఢిల్లీ నుంచి పంపిన మొదటి జాబితాలోని 37 మంది రైతులకు చెందిన తోటల్లో కొన్నింటిని పరిశీలించారు. ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లోని తోటలను పూర్తిగా పరిశీలించారు. దమ్మపేట మండలంలోనూ ఒకటి రెండు మినహా మిగిలిన తోటల పరిశీలన పూర్తయింది. రానున్న విడతలో దమ్మపేట మండలంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు వేంసూర్, సత్తుపల్లి మండలాలను, ఇతర జిల్లాల్లోని పైలట్ ప్రాజెక్టు బాధిత రైతుల తోటలను పరిశీలించేందుకు తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఇక ఈ పర్యటనలో తుమ్మా రాంబాబు 2015లో వేసిన స్ప్రింగ్ రకం ఆయిల్ పామ్ తోటలో ఒక్క మొక్క కూడా లోపభూయిష్టంగా లేకపోవడం, అత్యధిక దిగుబడిని ఇవ్వడం గమనార్హం. దీనికి విరుద్ధంగా దాని పక్కనే 2016లో రాంబాబు సోదరులు వేసిన తోటలో 30% వరకు జన్యు లోపం ఉన్న మొక్కలు ఉండటాన్ని ఐఐఓపీఆర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం.వి. ప్రసాద్ గుర్తించారు. 2015 తోటలు, 2016 తర్వాత వేసిన తోటల మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఆయన గమనించారు.

అశ్వారావుపేట నర్సరీపై అనుమానాలు…

అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలో 2016 నుండి వస్తున్న నాసిరకం మొక్కల సరఫరాపై లోతైన విచారణ చేపట్టారు. ఈ పరిశీలనతో తమకు న్యాయం జరుగుతుందని, ఇకపై నర్సరీలలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని బాధిత రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తోటలను అప్పట్లో అక్రమాల్లో ‘ప్రావీణ్య’త పొందిన ఒక అధికారి పర్యవేక్షించినట్లు రైతులు చెబుతున్నారు. ఆయనపై అప్పట్లోనే విచారణ జరిగింది.

తప్పులు చేశారని తేలింది. 40 లక్షల రూపాయల రికవరీకి ఆదేశించారు. కానీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బయటపడ్డాడు. కానీ ఇప్పుడు కేంద్ర బృందం పర్యటనతో ‘ప్రావీణ్యు’డికి ఇక చుక్కలే అని రైతులు అంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర బృందం పరిశీలిస్తున్న తోటల వివరాలను… అక్కడ జరిగిన అక్రమాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అందుకు బాధ్యులైన గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరైనా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *