- ‘తిరు’ పెత్తనానికి కత్తెర
- ఫైనాన్స్ విభాగం సహా మార్కెటింగ్ పై వేటు
- రెండు విభాగాలకు ఇద్దరు ఇతర అధికారులు
- ‘సహనం వందే’ కథనాలతో చర్యల పర్వం
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ మేనేజర్ తిరుమలేశ్వర్ రెడ్డి పెత్తనానికి కత్తెరలు పడుతున్నాయి. ఆయన అధికారాలను ఒక్కొక్కటి తగ్గించే కార్యక్రమానికి ఆ సంస్థ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. నాలుగు విభాగాలను తన చేతుల్లో ఉంచుకొని ఆడించిన నాటకానికి తెరపడుతుంది. ‘నేను ఏం చేస్తే అదే చెల్లుబాటు’ అన్న ఆయన ధోరణికి చెక్ పడుతుంది. మొన్నటి వరకు ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ తన చేతిలో ఉంచుకున్నారు.
ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై గుత్తాధిపత్యం వహిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=4916 డిజిటల్ పేపర్ కథనాలు రాసింది. అనేక వాస్తవాలు వెలుగు చూడటంతో ఆయన చేతిలో ఉన్న ఫైనాన్స్ విభాగాన్ని తొలగించి సహకార శాఖకు చెందిన ఒక అధికారిణిని నియమించి ఇప్పటికే కత్తెర వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనపై మరో దెబ్బ పడింది. మరో కీలక విభాగమైన మార్కెటింగ్ కు ఒక జనరల్ మేనేజర్ ను నియమించినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు.
ఆయన ఏమైనా సెలబ్రిటీనా?
ఈ కీలక విభాగాలను చేతిలో ఉంచుకొని ఆయన చక్రం తిప్పారు. కీలకమైన ఫైనాన్స్ విభాగం ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. దీంతో అనేక చోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయన్న విమర్శలు ఉన్నాయి. మార్కెటింగ్ విభాగంలో ఉండి కూడా విజయ నూనె వ్యాపారాన్ని పెంచడంలో వైఫల్యం చెందారన్న విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు దూసుకుపోతుంటే… విజయ నూనె మాత్రం తన వాటాను పెంచుకోవడంలో వెనుకబడింది.
దీనికి సరైన మార్కెటింగ్ వ్యూహం లేకపోవడమే కారణమని విమర్శలు వచ్చాయి. ప్రైవేట్ కంపెనీలకు ధీటుగా నిలపడంలో ఆయన వైఫల్యం చెందినట్లు ఒక అధికారి వెల్లడించారు. విచిత్రం ఏంటంటే ఇటీవల ఆయనే విజయ నూనెకు బ్రాండ్ అంబాసిడర్ అయినట్లు ఒక వీడియోను https://www.instagram.com/reel/DLP_2gNybla/?igsh=MWh1am4xb213NGd5OQ== మార్కెట్లోకి విడుదల చేశారు. ఆయన మాటలు విశ్వసించి విజయ నూనెను వాడేవారు కూడా ఉంటారా? ఆయనేమన్నా సెలబ్రిటీనా? ఒకవేళ ఇలాంటి అధికారిక వీడియో విడుదల చేయాలనుకుంటే ఎండీ వంటి ఉన్నత స్థాయి అధికారులతో చేస్తే బాగుండేది. లేదా ఎవరైనా సెలబ్రిటీ వంటి వారితో వీడియో చేస్తే ప్రయోజనం కలిగేది.