- రాష్ట్ర హక్కులను తాకట్టుపెట్టబోమని వ్యాఖ్య
- దేవుడే ఎదురొచ్చినా నిలబడతామన్న సీఎం
- చంద్రబాబు నిర్ణయాలపై వ్యతిరేక కామెంట్లు
- మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిని వదలని రేవంత్
సహనం వందే, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైంది. చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అనేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టం. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతం. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతాం. ప్రజల హక్కులను తాకట్టు పెట్టం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

వరద జలాలను వినియోగించుకుంటామన్న ఆంధ్రప్రదేశ్ వాదనను ముఖ్యమంత్రి తోసిపుచ్చారు. ముందు నికర జలాల్లో వాటా తేలాలన్నారు. నికర జలాల్లో వాటా తేలిన తర్వాత మిగులు, వరద జలాల్లో ప్రొరేటా ప్రకారం ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరగాలన్నారు. ‘కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం : వివాదాలు’ అన్న అంశంపై బుధవారం ప్రజా భవన్‌లో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
తెలంగాణకు అన్యాయం…
‘తెలంగాణ నీటిని రాయలసీమకు తరలించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనికిరాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ రకంగా తక్కువ ధరకు లభించే విద్యుత్ విషయంలోనూ అన్యాయం జరిగింది.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన కల్వకుర్తికి నీటి కేటాయింపులను పూర్తి చేయలేదు. బీమా, నెట్టెంపాడు, నల్గొండకు గ్రావిటీతో తీసుకెళ్లే ఎస్ఎల్ బీసీ పూర్తి చేయలేదు. ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయని కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింద’ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే నీటి వాటాలో రాష్ట్ర హక్కులు దక్కేవ’ని కామెంట్స్ చేశారు.
వైయస్సార్ హయాంఫై విమర్శ…
సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాన్ని కూడా విమర్శించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిపై 2007-08లో ప్రాణిహిత చేవెళ్ల (డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి) ప్రాజెక్టు తుమ్మడిహెట్టి నుంచి ప్రాంతాన్ని, అంచనాలను, పేరును మార్చడమే కాకుండా బేసిన్ల సాకుతో రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని ఆయకట్టును తొలగించడం వల్ల నష్టం జరిగింద’ని మండిపడ్డారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత సీఎంను కూడా ఆయన వదిలిపెట్టలేదు.