తెలంగాణలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుమతికి 500 కోట్లు?

  • ఒక్కో కాలేజీ నుంచి రూ. 25 కోట్లు లంచం
  • ప్రైవేట్ వైద్య కాలేజీలతో ఎన్ఎంసీ కుమ్మక్కు
  • ఎలాంటి వసతులు లేకున్నా అనుమతులు
  • నకిలీ రోగులు… కేస్ షీట్లు… ఘోస్ట్ ఫ్యాకల్టీ
  • సీబీఐ విచారణతో వెలుగులోకి అక్రమాలు
  • వైద్య ఆరోగ్య అధికారులకూ భాగస్వామ్యం
  • రాష్ట్ర డీఎంఈ కార్యాలయానికి లింకులు
  • కొందరు కీలకాధికారులకు విల్లాలు అందజేత
  • హవాలా మార్గంలో డబ్బులు అందజేత
  • దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న సీబీఐ
  • మెడికల్ విద్యలో భారీ కుంభకోణం

సహనం వందే, హైదరాబాద్:
ప్రైవేటు మెడికల్ కాలేజీల మాఫియా వైద్య విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. డబ్బా కాలేజీలు పెట్టి విద్యార్థుల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తుతున్నాయి. వాటిని పర్యవేక్షించాల్సిన జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) లంచాలకు మరిగి ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటం సంచలనంగా మారింది. వైద్య విద్యా వ్యవస్థను కుదిపేసిన భారీ అవినీతి కుంభకోణం బయటపడింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ), వైద్య ఆరోగ్య శాఖలోని అధికారులు, దళారులు, వైద్య కళాశాలల నిర్వాహకులతో కలిసి కోట్ల రూపాయల లంచాలు మేసినట్లు తేలింది. ఏ మాత్రం వసతులు లేని కాలేజీలకు అనుమతులు కట్టబెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణం వైద్య విద్యా వ్యవస్థపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పరిస్థితి వైద్య విద్య నాణ్యతను వెక్కిరిస్తున్నాయి. ఈ వ్యవహారం తెలంగాణలోని మెడికల్ కాలేజీలోనూ వెలుగు చూసింది. ఇక్కడ కొందరు డాక్టర్లపై కేసులు కూడా నమోదు చేశారు.

ఒక్కో కాలేజీ నుంచి రూ. 25 కోట్ల లంచం.‌‌..
తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 23 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీల్లో ఎంబీబీఎస్, పీజీ సీట్లు ఉన్నాయి. అదనపు ఎంబీబీఎస్ సీట్ల కోసం, అలాగే ప్రతి ఏడాది పీజీ సీట్ల తనిఖీకి ఎన్ఎంసీ అధికారులు వస్తారు. ఈ తనిఖీ బృందంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ఇతర నిపుణులు ఉంటారు. ఒక్కో బృందంలో దాదాపు 15 మంది ఉంటారు. ఒక్కో కాలేజీలో 20 వరకు పీజీ స్పెషాలిటీ విభాగాలు ఉంటాయి. కాలేజీలలో వసతులు లేకపోయినప్పటికీ అనుమతి పొందేందుకు ప్రైవేట్ మెడికల్ యాజమాన్యాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. దీన్ని ఎన్ఎంసీ తనిఖీ బృందాలు క్యాష్ చేసుకుంటున్నాయి.

ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో ఎన్ఎంసీ తనిఖీ అధికారికి దాదాపు రెండు కోట్ల రూపాయలు ముట్ట చెబుతుంటారు. ఒక అంచనా ప్రకారం ఒక కాలేజీకి ఎన్ఎంసీ బృందం వస్తే 20 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయల వరకు లంచం ఇస్తారు. అప్పుడే ఎటువంటి డబ్బా కాలేజీకైనా అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. ఇలా తెలంగాణలో దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఎన్ఎంసీ తనిఖీ బృందాలకు లంచం అందజేసేలా అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే దాదాపు 200 కోట్ల రూపాయలు అందినట్లు సమాచారం.

నకిలీ రోగులు… ఘోస్ట్ ఫ్యాకల్టీ
ఎన్ఎంసీ తనిఖీ బృందాలు, వైద్య ఆరోగ్య అధికారులు కలిసి ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్కు అవుతున్నాయి. ముందే ఆ కాలేజీలకు సమాచారం ఇవ్వడంతో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ అధికారులు రహస్యంగా ఇన్‌స్పెక్షన్ షెడ్యూల్స్, అంతర్గత ఫైల్ నోటింగ్స్, ఇన్‌స్పెక్టర్ల వివరాలను మధ్యవర్తులకు లీక్ చేసి కోట్ల రూపాయల లంచాలు అందుకున్నారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలు అత్యంత దారుణంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. అందులో ప్రధానమైనది ఘోస్ట్ ఫ్యాకల్టీ.

ఒక పీజీ విభాగానికి దాని హెచ్ఓడీతో కలిపి ఏడుగురు ఫ్యాకల్టీ ఉండాలి. కానీ కేవలం ఇద్దరితో మాత్రమే అనేక కాలేజీలు నడుపుతున్నాయి. ఈ ప్రకారం చూస్తే ఒక్కో కాలేజీలో 20 విభాగాలు ఉంటే… 140 మంది ఫ్యాకల్టీ ఉండాలి. కానీ కేవలం 40 మంది మాత్రమే ఉంటున్నారు. మరో వంద మంది ఘోస్ట్ ఫ్యాకల్టీ మాత్రమే. ఇలా ఒక్కో కాలేజీ వంద మంది ఫ్యాకల్టీ లేకుండా నడిపిస్తుందంటే… దానిద్వారా ఏడాదికి కనీసం రూ. 30 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది.

ఒక్కో కాలేజీకి వాళ్ల సీట్లను బట్టి రోగుల ఆక్యుపెన్సీ ఉండాలి. కానీ నకిలీ రోగులు, నకిలీ కేసు షీట్లు ఉంటున్నాయి. ఫ్యాకల్టీ, అవసరమైన సిబ్బంది లేకుండా బయోమెట్రిక్ మోసానికి పాల్పడుతూ హాజరు రికార్డులను తారుమారు చేస్తున్నారు. విద్యార్థులకు స్టైఫెండ్లు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నాయి.

హవాలా మార్గంలో లంచాలు…
సీబీఐ దర్యాప్తులో బయటపడిన లంచాల అందజేత విస్మయం కలిగిస్తుంది. కోట్ల రూపాయలు హవాలా, ఇతరత్రా పద్ధతులతో చేరాయి. మాజీ ఎంఏఆర్ బీ సభ్యుడు జితూ లాల్ మీనా ఈ లంచాల్లో కొంత భాగాన్ని రాజస్థాన్‌లో రూ. 75 లక్షలతో ఆలయ నిర్మాణానికి ఉపయోగించినట్లు తేలింది. ఈ ఆలయం అవినీతి డబ్బుతో నిర్మించినట్లు సీబీఐ గుర్తించింది. తెలంగాణలో కూడా అలాగే వివిధ రూపాల్లో డబ్బు తనిఖీ బృందాలకు అందుతున్నట్లు సమాచారం.

హైదరాబాదులో ఒక ప్రొఫెసర్ రూ. 2 కోట్ల ఇంటిని గిఫ్ట్ గా పొందారు. వైద్య ఆరోగ్యశాఖలోని పదిమంది కీలక అధికారులకు ఒక్కొక్కరికి ఒక విల్లా చొప్పున అందజేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి చెందిన కొందరు అధికారులకు వివిధ స్థిరాస్తుల పేర లంచాలు అందినట్టు తెలిసింది.

వైద్య విద్యకు ముప్పు…
ఈ కుంభకోణం వైద్య విద్యా వ్యవస్థ విశ్వసనీయతను సమూలంగా దెబ్బతీసింది. అర్హత లేని కళాశాలలు చట్టబద్ధంగా విద్యార్థులను చేర్చుకుని, అసమర్థ వైద్యులను తయారు చేస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రోగుల ఆరోగ్యానికి, దేశ ఆరోగ్య వ్యవస్థకు తీవ్ర ముప్పుగా మారనుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *