- అధ్యక్ష పోటీకి అనర్హుడైనా పార్టీ ప్రకటన
- నమ్మిన బంటును అధ్యక్షుడిగా చేసే యోచన
- పరోక్షంగా చక్రం తిప్పాలని ఎత్తుగడ
- ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంపై దండయాత్ర
సహనం వందే, అమెరికా:
ప్రపంచ వ్యాపార దిగ్గజం… టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లోకి అనూహ్యంగా ప్రవేశించి సంచలనం సృష్టించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత లేకపోయినా, ఆయన అమెరికా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహితంగా మెలిగిన మస్క్, ఇటీవల ఆయనతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఈ సరికొత్త రాజకీయ శక్తిని నిర్మించేందుకు పూనుకోవడం గమనార్హం. అధ్యక్ష పదవికి తాను అర్హుడు కానప్పటికీ, ఈ కొత్త పార్టీ ద్వారా ప్రస్తుత ద్విపార్టీ వ్యవస్థను సవాల్ చేయాలనే ఆయన లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

పుట్టుకతోనే అనర్హుడు అయినా…
అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థి తప్పనిసరిగా అమెరికాలో జన్మించిన పౌరుడై ఉండాలి. దక్షిణాఫ్రికాలో జన్మించిన మస్క్ ఈ నిబంధన కారణంగా 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు. ఈ విషయాన్ని 2024లోనే ఆయన స్వయంగా అంగీకరించారు. ‘నా తాత అమెరికన్ అయినప్పటికీ, నేను ఆఫ్రికాలో పుట్టాను కాబట్టి అధ్యక్షుడిని కాలేన’ని ఆయన స్పష్టం చేశారు.
అయితే 2025 ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ప్రచారం చేసిన మస్క్ తన రాజకీయ ఆసక్తిని ప్రదర్శించారు. ‘నేను అధ్యక్షుడిని కావాలని అనుకోవడం లేదు. రాకెట్లు, కార్లు తయారు చేయాలను కుంటున్నానని’ ఆయన అప్పట్లో అన్నారు. ఒకవేళ ట్రంప్ మళ్లీ ఎన్నికైతే ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడానికి కృషి చేస్తానని కూడా ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఆయన రాజకీయాలపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో తెలియజేస్తున్నాయి. అధ్యక్ష బరిలో నిలవలేకపోయినా రాజకీయాలను ప్రభావితం చేయాలనే మస్క్ ఆశయం ఈ ప్రకటనతో స్పష్టంగా వ్యక్తమైంది.
ద్విపార్టీ ఆధిపత్యానికి సవాల్…
ఎలాన్ మస్క్ శనివారం తన కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని ప్రకటించారు. ప్రజలకు స్వేచ్ఛను తిరిగి ఇవ్వడమే ఈ పార్టీ ప్రధాన లక్ష్యమని… ఇది డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తుందని మస్క్ స్పష్టం చేశారు. ఈ పార్టీ ప్రకటనకు ముందు మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ఒక పోల్ నిర్వహించారు.
ఈ పోల్‌లో 12 లక్షల మందికి పైగా పాల్గొనగా, ఎక్కువ మంది కొత్త రాజకీయ పార్టీ అవసరాన్ని సమర్థించారు. ఈ ఫలితాల ఆధారంగా, మస్క్ రెండు పార్టీల వ్యవస్థ నుంచి బయటపడేందుకు అమెరికా పార్టీని ప్రకటించారు. ఈ పోల్ ఫలితాలను ఉటంకిస్తూ, మస్క్ రెండు తలల పామును సూచిస్తూ ఒక మీమ్‌ను కూడా పోస్ట్ చేశారు. దానిపై ఉన్న క్యాప్షన్ ‘ఏకపక్ష వ్యవస్థను అంతం చేయాలి’ అని పేర్కొంది.
ఈ చర్య రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే ఆయన బలమైన సంకల్పాన్ని తెలియజేస్తోంది. ఈ కొత్త పార్టీ ఏ రూపంలో రాజకీయ రంగంలో ప్రభావం చూపుతుంది? దీనికి ఎవరు నాయకత్వం వహిస్తారు అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలియనుంది. మస్క్ రాజకీయ ప్రవేశం అమెరికా రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని తెరవనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.