తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు?

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్
  • తెలంగాణ సర్కారు నిర్ణయంపై సందిగ్ధత
  • ఏళ్లుగా ఎదురు చూస్తున్న పాత్రికేయులు
  • మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
  • ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామన్న సీఎం
  • కదలిక లేకపోవడంపై జర్నలిస్టుల ఆవేదన

సహనం వందే, హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంత్రులు అనగాని, పార్థసారథి, నారాయణతో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వ్యవహారంలో కదిలిక వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సందిగ్ధత ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చింది. డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. ముఖ్యమంత్రి అయ్యాక ఫ్యూచర్ సిటీలో జాగాలు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డిని కలిసిన డీజేహెచ్ఎస్ ప్రతినిధులు (ఫైల్ ఫోటో)

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందిగ్ధత…
తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు డీలా పడిపోయాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో జర్నలిస్టు కుటుంబాలు…
మీడియా రంగంలో పనిచేసే చాలామంది తమ కుటుంబాలను పోషించుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడా పత్రికలు, టీవీ ఛానెళ్ల మేనేజ్‌మెంట్లు తప్ప, సామాన్య జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మీడియా సంస్థలు అత్యంత తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. దీంతో చాలీచాలని జీతాలతో జీవితాన్ని భారంగా గడపాల్సి వస్తుంది.

జర్నలిస్టుల ఆశలపై నీళ్లు…
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కోసం పెట్‌బషీరాబాద్‌లో 38 ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పుతో అంతా తలకిందులైంది. ఈ తీర్పు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును అడ్డుకుంటూ, వారి దశాబ్దాల కలను అగమ్యగోచరంగా మార్చింది. ‘బడుగు వర్గాలకు ప్రభుత్వం ఇళ్లు, స్థలాలు, సంక్షేమ పథకాలు అందిస్తుంది. మరి జర్నలిస్టులు కూడా అదే వర్గాల నుంచి ఎక్కువమంది వచ్చినప్పుడు వారికి ఈ హక్కు ఎందుకు ఉండకూడదు?’ అని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) ప్రధాన కార్యదర్శి అమృత, వైస్ ప్రెసిడెంట్ మరిపాల శ్రీనివాస్, కోశాధికారి అయ్యప్ప అంటున్నారు.

ఫ్యూచర్ సిటీపై ఆశలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. ‘జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఫైల్‌పై ఒక నిమిషంలో సంతకం చేస్తాను’ అని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి వైఖరిపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే, హామీ అమలు కోసం ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి సానుకూలంగా ఆలోచిస్తే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించేందుకు చర్యలు తీసుకోవచ్చు’ అని జర్నలిస్టు నాయకులు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని డీజేహెచ్ఎస్ నాయకులు కోరుతున్నారు.

ఫ్యూచర్ సిటీకి వెళ్లి సీఎం హామీకి కృతజ్ఞత సభ జరిపిన డీజేహెచ్ఎస్
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *