- రాజకీయాల్లోకి అడుగు పెట్టిన టెస్లా అధిపతి!
- అవినీతిపై పోరాటం… స్వేచ్ఛే లక్ష్యంగా పార్టీ
సహనం వందే, అమెరికా:
ప్రముఖ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ రాజకీయ రంగ ప్రవేశంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ‘అమెరికా పార్టీ’ పేరుతో తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించి అమెరికా రాజకీయాల్లోకి సంచలనాత్మక అడుగు వేశారు. దేశంలో వ్యర్థాలు, అవినీతి పెరిగిపోయాయని, స్వేచ్ఛను తిరిగి తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ పెడుతున్నట్లు గతంలోనే ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=4952 ప్రత్యేకంగా ఆర్టికల్ రాసింది.

‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ నేపథ్యం
ఇటీవల ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ చట్టంగా మారితే తాను కొత్త పార్టీని స్థాపిస్తానని మస్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ బిల్లుపై సంతకం జరిగి చట్టంగా మారిన నేపథ్యంలో, మస్క్ తన మాట నిలబెట్టుకుంటూ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటనకు ముందు జూలై 4న అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మస్క్ తన ఎక్స్ ఖాతాలో నిర్వహించిన ఒక పోల్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.
65.4 శాతం మంది ప్రజల మద్దతు
ఆ పోల్‌లో, ‘మీరు రెండు పార్టీల వ్యవస్థ నుంచి స్వాతంత్ర్యం కోరుకుంటున్నారా? మనం అమెరికా పార్టీని ఏర్పాటు చేయాలా?’ అని మస్క్ ప్రజలను అడిగారు. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఏకంగా 65.4 శాతం మంది ‘అవును’ అని ఓటు వేయగా, 34.6 శాతం మంది ‘లేదు’ అని అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి లభించిన ఈ అపార మద్దతు తనకు ఒక చోదక శక్తిగా నిలిచిందని మస్క్ పేర్కొన్నారు.
అమెరికా పార్టీ లక్ష్యం…
అమెరికా పార్టీ ఏర్పాటును ప్రకటిస్తూ మస్క్ తన ఎక్స్ పోస్టులో, ‘మీకు కొత్త రాజకీయ పార్టీ కావాలి… ఇప్పుడు సాకారం అయ్యింది. వ్యర్థాలు, అవినీతితో మన దేశాన్ని దివాలా తీస్తున్న విషయానికి వస్తే… మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఏక-పార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము. ఈ రోజు అమెరికా పార్టీ మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి ఏర్పడింది’ అని ఉద్ఘాటించారు. ఇది అమెరికా రాజకీయ భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారి తీస్తుందో వేచి చూడాలి.