డాక్టర్లకు సీబీఐ బేడీలు – మెడికల్ కాలేజీల అనైతిక చర్య

  • మెడికల్ కాలేజీకి గుర్తింపు ఇచ్చేందుకు 55 లక్షలు లంచం
  • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆరుగురిని అరెస్టు చేసిన సీబీఐ
  • ఛత్తీస్‌గఢ్‌లోని ఒక కాలేజీకి అనుకూలంగా తప్పుడు నివేదికలు ఇచ్చిన డాక్టర్లు
  • తెలంగాణలోనూ వసతులు లేకుండానే కాలేజీలు నడుపుతున్న ప్రైవేట్లు
  • వికారాబాద్ మహావీర్ కాలేజీకి ముందే సమాచారం ఇచ్చిన ఎన్ఎంసీ
  • ‘సహనం వందే’ వార్తతో నిలిచిపోయిన తనిఖీలు

సహనం వందే, హైదరాబాద్:
ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వైద్య కళాశాలకు గుర్తింపు ఇచ్చేందుకు ఏకంగా రూ. 55 లక్షల లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సీబీఐ ముగ్గురు వైద్యులతో సహా ఆరుగురిని అరెస్టు చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల గుర్తింపు ప్రక్రియలో పేరుకుపోయిన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. సీబీఐ అధికారులు ఈ కేసులో కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లలో 40 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్ ప్రాంతంలో ఉన్న శ్రీ రవత్‌పుర సర్కార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ కళాశాల అధికారులు, తనిఖీకి వచ్చిన వైద్యులు, మధ్యవర్తులు ఈ భారీ కుంభకోణంలో భాగస్వాములైనట్లు సీబీఐ వెల్లడించింది. ‘రూ. 55 లక్షల లంచం లావాదేవీ జరుగుతుండగా ఆరుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాము. బెంగళూరుకు చెందిన తనిఖీ చేసిన వైద్యులకు ఇచ్చార’ని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు.

వసతులు లేకున్నా ఉన్నట్లు నివేదికలు…
మెడికల్ కాలేజీలో వసతులు లేకపోవడం… ఫ్యాకల్టీ కొరత ఉండటం… అవసరమైన స్థాయిలో రోగులు లేకున్నా తప్పుడు కేస్ షీట్స్ తయారు చేయటం… ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ మెడికల్ కాలేజీకి గుర్తింపు కోసం డాక్టర్లు, అధికారులు, కాలేజీ యాజమాన్యాలు కుమ్మక్కు అవుతున్నట్టు సీబీఐ పసిగట్టింది. తనిఖీకి వచ్చిన వైద్యులు వివిధ వైద్య కళాశాలలకు అనుకూలమైన నివేదికలు ఇవ్వడం ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. శ్రీ రవత్‌పుర సర్కార్ ఇన్‌స్టిట్యూట్ అధికారులు, తనిఖీ వైద్యుల మధ్య కుదిరిన ఈ చీకటి ఒప్పందాన్ని సీబీఐ బట్టబయలు చేసింది. లంచం లావాదేవీని పట్టుకునేందుకు ఒక పక్కా వ్యూహాన్ని రచించి, ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది. అరెస్టు చేసిన ఆరుగురినీ త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు సీబీఐ పేర్కొంది. తనిఖీకి వచ్చిన వైద్యులను అక్రమంగా ప్రభావితం చేసేందుకు నిందితులు రకరకాల పద్ధతులను అవలంబించినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ కేసుపై సీబీఐ మరింత లోతుగా విచారణ జరుపుతోంది.

తెలంగాణలోనూ కాలేజీల మాయాజాలం…
మెడికల్ కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ప్రస్తుతం తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణలో కూడా ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో తనిఖీలు జరుగుతున్నాయి. కొన్ని కాలేజీలలో ఫ్యాకల్టీ లేకపోవడం, రోగులు వచ్చే పరిస్థితి లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ తమ ఎంబీబీఎస్, పీజీ మెడికల్ సీట్లను కాపాడుకునేందుకు యాజమాన్యాలు అడ్డదారి తొక్కుతున్నాయి.

ఉదాహరణకు ఇటీవల వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి సంబంధించి ఇటువంటి వ్యవహారమే వెలుగు చూసింది. ఆ కాలేజీకి ఎంఎంసీ అధికారులు తనిఖీకి వస్తున్నారని ముందే తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం నకిలీ రోగులను, తాత్కాలిక ఫ్యాకల్టీని, తప్పుడు కేసు షీట్లను, అప్పటికప్పుడు అద్దెకు తెచ్చిన పరికరాలను సిద్ధం చేసుకున్నారు. తనిఖీలకు వస్తున్న విషయాన్ని సంబంధిత వర్గాలన్నింటికీ ఒకరోజు ముందే వాట్సాప్ లో మెసేజ్ పంపించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ https://sahanamvande.com/?p=5078 ఆ విషయాన్ని బట్టబయలు చేసింది. దీంతో ఎంఎంసీ అధికారులు తాత్కాలికంగా తనిఖీలు నిలిపివేశారు. ఇక్కడ కూడా డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి.

మరోవైపు అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్ఎంసీ అధికారులను లోబర్చుకునేందుకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్ఎంసీ అధికారులను ఒప్పించి తాత్కాలికంగా అనుమతులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వైద్య విద్యను అత్యంత నాసిరకంగా మారుస్తూ… తప్పుడు పద్ధతులు ద్వారా గుర్తింపులు పొందుతూ యాజమాన్యాలు అక్రమంగా కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాయి.

విద్యార్థుల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయలతో జేబులు నింపుకుంటున్నారే కానీ వసతులు కల్పించడం లేదు. దీంతో వైద్య విద్య అత్యంత నాసిరకంగా మారుతుందన్న విమర్శలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం తరగతులు ప్రారంభమైన రెండు నెలల్లోనే వసతులు లేని కారణంగా మూడు కాలేజీల అనుమతులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఏడాది ఆయా కాలేజీల విద్యార్థులను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేశారు. అయినా కాలేజీ యాజమాన్యాలు మారడం లేదు. డబ్బులతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *