యూరియా ‘అధికారి’ దయ – ఎక్కడికక్కడ బ్లాక్…

  • కొరతను సొమ్ము చేసుకుంటున్న యంత్రాంగం
  • వారితో కుమ్మక్కైన ఆ మార్క్ ఫెడ్ ‘అధికారి’
  • కమీషన్లు ముట్ట చెబుతున్న దళారులు
  • అనేకచోట్ల రెట్టింపు ధరకు యూరియా విక్రయిస్తున్న వైనం
  • మంత్రి తుమ్మల ఆదేశాలకు ఆఫీసర్ తూట్లు

సహనం వందే, హైదరాబాద్:
రాష్ట్రంలో యూరియా కొరత ఉందని… కేంద్రం అవసరమైనంత కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సీజన్ ఊపందుకోవడంతో ఆయన కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా లోటు ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఇంకేం ఇదే అదనుగా భావించిన మార్క్ ఫెడ్ లోని ఒక అధికారి దళారులతో చేతులు కలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ చేయిస్తున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రాథమిక సహకార సంఘాల ద్వారా సరఫరా చేయాల్సిన ఆ సంస్థ ప్రైవేటు దుకాణదారులతో కుమ్మక్కు అయినట్లు అందులోని అధికారులే చెప్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ యూరియా నల్ల బజారులోకి వెళ్లిపోయింది. కొందరు దళారుల వద్ద వందల బస్తాలు దాచి పెట్టారు.

వర్షాలతో భారీ డిమాండ్…
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సాగు ఇప్పటికే ప్రారంభమైంది. రైతులు పెద్దఎత్తున యూరియా కోసం ఎగబడుతున్నారు. అయితే రాష్ట్రానికి నెలవారి కేటాయించిన విధంగా ఎరువులు పంపిణీ చేయకపోవడం వలన రైతాంగం రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తక్షణమే యూరియాను పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల కేంద్రమంత్రి జె.పి. నడ్డాకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ అలసత్వం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌ లో అత్యవసరంగా అవసరమయ్యే యూరియా సరఫరాలో నెలవారి లోటు ఉందని తుమ్మల పేర్కొన్నారు.

5 లక్షల మెట్రిక్ టన్నులు కావాలి…
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి రావాల్సిన యూరియా లక్ష్యం 5 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 3.06 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా అయిందని తుమ్మల అన్నారు. దీని ఫలితంగా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడింది. ముఖ్యంగా దిగుమతి ద్వారా వచ్చే యూరియాలోనూ పెద్ద లోటు ఉందని మంత్రి అన్నారు. ఏప్రిల్ లో 1.70 లక్షల టన్నులు రావాల్సి ఉండగా… 1.22 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. మే నెలకు 1.60 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా, 88 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందింది. జూన్ నెలకు 1.70 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా… 96 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని మంత్రి పేర్కొన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూరియా వినియోగం అధికంగా ఉంటుందనీ, అందువల్ల అందకపోతే పంటలకు తీవ్ర నష్టం జరుగుతుందనీ మంత్రి వివరించారు. జూలైకి కేటాయించిన 97 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను తక్షణంగా సరఫరా చేయాలని, రాష్ట్రానికి రవాణా సౌలభ్యం కలిగిన రామ్‌గుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ నుండి యూరియా కేటాయింపును 30,800 నుండి 60,000 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు.

పండుగ చేసుకుంటున్న మార్క్ ఫెడ్…
ఒకవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతో ఆవేదన చెందుతుంటే… యూరియా కొరతను సొమ్ము చేసుకునేందుకు మార్క్ ఫెడ్ కు చెందిన ఒక అధికారి పండుగ చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ తన కంట్రోల్ లో యూరియాను ఉంచారు. తను చెప్పిన వారికే అందించేలా ఏర్పాటు చేశారు. అందుకోసం కొందరు జిల్లా అధికారులతో, దళారులతో కుమ్మక్కైనట్లు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక అధికారి వందల బస్తాల యూరియాను ఒక ప్రత్యేక గోదాములో ఉంచుకున్నట్లు సమాచారం. దళారులతో పని లేకుండా ఆయనే మొత్తం యూరియాను నియంత్రిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎండీ శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన కళ్ళుగప్పి ఆ అధికారి చక్రం తిప్పుతున్నట్లు ఆ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *