- కో-ఆపరేటివ్ అధికారికి బాధ్యతలు
- మార్కెటింగ్ విభాగం కూడా మార్చే అవకాశం
- ‘సహనం వందే’ కథనాలతో ప్రక్షాళన పర్వం
- కొత్త ఎండీ శంకరయ్య దూకుడు వ్యవహారం
- మరికొందరి పీఠాలు కదిలే పరిస్థితి
సహనం వందే, హైదరాబాద్:
ఆయిల్ ఫెడ్ లో ప్రక్షాళన పర్వం ఊపందుకుంది. ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ వరుస కథనాలతో ఈ కార్పొరేషన్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మొక్కల అక్రమాలు, నర్మెట్ట ఫ్యాక్టరీ నిర్మాణ వివాదం… కొందరు అధికారులు కీలకమైన విభాగాలను తమ గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడుతుండటం… ఇలాంటి అన్ని విషయాలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ కొత్త ఎండీ శంకరయ్య కొరడా ఝలిపిస్తున్నారు. అందులో భాగంగా మొన్నటి వరకు ఎండీగా పనిచేసిన యాస్మిన్ భాషా స్థానంలో శంకరయ్యను తీసుకొచ్చారు. అక్కడి నుంచి మొదలైన చర్యల పర్వం ఇప్పుడు మరింత ఊపందుకుంది.
తిరుమలేశ్వర్ రెడ్డిపై వేటు…
ఆయిల్ ఫెడ్ లో నాలుగు కీలక విభాగాలను తన చేతిలో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు తిరుమలేశ్వర్ రెడ్డి. ఫైనాన్స్, మార్కెటింగ్, బల్క్ మార్కెటింగ్, ఓపీఎస్ ఫ్యాక్టరీ… ఈ నాలుగింటినీ ఆయనే తన చేతిలో ఉంచుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా వీటిపై గుత్తాధిపత్యం వహిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీనిపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ https://sahanamvande.com/?p=4916 కథనాలు రాసింది. అనేక వాస్తవాలు వెలుగు చూడటంతో ఆయన చేతిలో ఉన్న ఫైనాన్స్ విభాగాన్ని సహకారశాఖకు చెందిన ఒక అధికారిణికి అప్పగించారు. కీలకమైన ఫైనాన్స్ విభాగం ద్వారా వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. దీంతో అనేక చోట్ల డబ్బులు చేతులు మారుతుంటాయన్న విమర్శలు ఉన్నాయి.
విమర్శలు వచ్చిన నేపథ్యంలో తిరుమలేశ్వర్ రెడ్డి చేతిలో ఉన్న ఫైనాన్స్ విభాగాన్ని తొలగించారు. అంతేకాదు తనుకు అనుకూలురైన ఒక వ్యక్తిని ఆడిటర్ గా నియమించుకొని అన్ని వ్యవహారాలు చక్కదిద్దుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో ఒక సంస్థకు ఆడిటర్ బాధ్యతలు అప్పగించినప్పటికీ… దాన్ని మధ్యలోనే పక్కనపెట్టి మరొక సంస్థకు ఇచ్చినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
మొక్కల అక్రమాలు… నర్మెట్ట వివాదం
జన్యుపరమైన లోపాలతో ఉన్న నాసిరకం మొక్కల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అయింది. రైతులకు ఇచ్చిన మొక్కల్లో నాసిరకం ఉన్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం అశ్వారావుపేట, దమ్మపేటల్లో పర్యటిస్తుంది. మొక్కల అక్రమాలపై గతంలో ఎండీగా పనిచేసిన నిర్మల ఒక అధికారికి నోటీసులు కూడా జారీ చేశారు. 40 లక్షల రూపాయలు రికవరీ చేయాలని ఆదేశించారు. కానీ ఆమె తర్వాత ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఒక అధికారి అవన్నీ పక్కన పెట్టి… అక్రమాలు చేసిన ఘనుడికి అందలం ఇచ్చారు. అతను ఇప్పుడు ఆయిల్ ఫెడ్ లో కీలక వ్యక్తిగా ఉన్నారు. మరోవైపు నాసిరకం మొక్కల వల్ల నష్టపోయిన రైతుల విషయంలో జాతీయ ఎస్టీ కమిషన్ ఇటీవలే విచారణ చేసింది. ఇలా ఆయిల్ ఫెడ్ ను అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మరికొందరిపై కూడా వేటు పడుతుందని అత్యంత సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఆ సీనియర్ అధికారాలన్నింటినీ కత్తిరించి ఆయనపైన మరో ఇద్దరు అధికారులను నియమించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన కిరణ్ అనే అధికారి ఆయిల్ ఫెడ్ లో ఓఎస్డీగా చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు ఇప్పుడు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పెషల్ ఆఫీసర్ గా ఆయనను నియమించినట్లు తెలిసింది. అక్కడ జరుగుతున్న అక్రమాలను సరిదిద్దాలని ఆయనను ఆదేశించినట్లు సమాచారం.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ప్రక్షాళన జరుగుతున్నట్టు సమాచారం. ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి శంకరయ్య దూకుడు పెంచారు. చర్యలకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఆయిల్ ఫెడ్ ను ప్రక్షాళన చేసేందుకు ఆయన నడుం బిగించారు. చైర్మన్ జంగా రాఘవరెడ్డి కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అనేకమందిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి తన అక్రమాల నుంచి బయటపడేందుకు డిప్యూటేషన్ అడుగుతున్నట్లు తెలిసింది. ఇలా అక్రమార్కులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.