ప్రతీ కులానికి గ్రేడింగ్‌ … 242 కులాలకు…

  • సమగ్ర వెనుకబాటుతనం సూచిక నిర్ధారణ
  • 242 కులాలకు గ్రేడింగ్‌ ఇచ్చిన నిపుణులు
  • పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక
  • గ్రేడింగ్ కులాల మధ్య కుంపట్లు రాజేస్తుందా?

సహనం వందే, హైదరాబాద్‌:
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే గణాంకాల ఆధారంగా స్వతంత్ర నిపుణుల కమిటీ ప్రతి కులానికి గ్రేడింగ్‌ ఇచ్చింది. సర్వే వివరాలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా స‍్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ సర్వే గణాంకాలను లోతుగా పరిశీలించి, వివిధ కోణాల్లో విశ్లేషణ చేసిన అనంతరం రాష్ట్రంలోని 242 కులాలకు గ్రేడింగ్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. పది రోజుల్లో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వతంత్ర నిపుణుల కమిటీ సిద్దమైంది. ఈ కమిటీ బుధవారం సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశంలో కమిటీ చైర్మన్‌ జసఈస్‌ బి.సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ కంచె ఐల‌య్య, క‌న్వీనర్ ప్రవీణ్ చ‌క్రవ‌ర్తి, స‌భ్యులు ప్రొఫెస‌ర్ శాంతా సిన్హా, డాక్టర్ సుఖ్‌దేవ్ థారోట్‌, డాక్టర్ హిమాన్షు, నిఖిల్ డే, ప్రొఫెస‌ర్ భాంగ్య భుక్య, ప్రొఫెస‌ర్ పురుషోత్తమ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, క‌మిటీ కార్యద‌ర్శి అనుదీప్ దూరిశెట్టి పాల్గొన్నారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కన్వీనర్లు మీడియాతో మాట్లాడారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించిందన్నారు.

ఈ సర్వే నివేదిక దాదాపు 300 పైబడి పేజీల్లో ఉందని, ఆ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత కులాల వారీగా గణాంకాలను క్రోడీకరించి ప్రతి కులానికి (కంపోజిట్‌ బ్యాక్‌వర్డ్‌నెస్‌ ఇండెక్స్‌) గ్రేడింగ్‌(ర్యాంకింగ్‌) ఇచ్చినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఇలాంటి విశ్లేషణ ఏ రాష్ట్రంలో జరగలేదని, తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం పక్కా గణాంకాలతో నిర్వహించిందన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి తుది నివేదిక తయారైందని, వారం పది రోజుల్లో ప్రభుత్వం సమయం ఇచ్చిన వెంటనే నివేదికను సమర్పించనున్నట్లు వివరించారు. ఈ నివేదికను పబ్లిక్‌ డొమైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరతామన్నారు.

గ్రేడింగ్ పై భిన్నాభిప్రాయాలు
కులాలకు గ్రేడింగ్ ఇవ్వాలని నిపుణుల కమిటీ సూచించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజికపరంగా ఆయా కులాలు ఏ స్థాయిలో ఉన్నాయో నిర్ధారించి గ్రేడింగ్ ఇచ్చారు. ఆ గ్రేడింగ్ ప్రకారం కులాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇది వినటానికి బాగానే ఉంది. 242 కులాలకు గ్రేడింగ్ ఇవ్వడం వల్ల ఆయా కులాల మధ్య కుంపట్లు పెట్టినట్లు అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యవహారం అనేక వివాదాలకు దారి తీస్తుంది.

వర్గీకరణ మంచిదా కాదా అన్నది పక్కన పెడితే మాల, మాదిగ వర్గాల మధ్య వైరాన్ని కలిగించారని అంటున్నారు. ఆ రెండు కులాలు ఏమాత్రం కలిసే పరిస్థితి లేదని అంటున్నారు. ఇలా కులాలకు గ్రేడింగ్ ఇవ్వడం వల్ల ఒక కులం గొప్ప… మరొక కులం తక్కువ అన్న భావన ఏర్పడి బహుజనుల మధ్య అనైక్యత నెలకొంటుందని అంటున్నారు. తద్వారా అగ్రవర్ణాలకు మరింత మేలు చేసే విధంగా కులాల గ్రేడింగ్ ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గ్రేడింగ్ వల్ల ఏ కులం ఎంత వెనుకబడి ఉందనేది తెలుసుకోవడం వల్ల ఆయా వర్గాలకు అన్ని రకాలుగా సాయం అందించడానికి అవకాశం ఉంటుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *